ఏపీలో కళ తగ్గిన ప్రైవేట్ స్కూల్స్... 2లక్షల మంది స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూళ్లకు వలస...

చదువు మధ్యలోనే మానేసేవాళ్లు, ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లిపోయేవారితో ప్రతి ఏటా ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు కళ కోల్పోతూ వచ్చాయి. ఓ దశలో విద్యార్థులతో కిక్కిరిసినట్టు ఉండే స్కూళ్లు కూడా.. వెలవెలబోయే పరిస్థితికి చేరుకున్నాయి. కానీ గత ఏడాది కాలంగా ఈ విషయంలో భారీ మార్పు వచ్చింది. ఊరూ వాడా పుట్టగొడుగుల్లా వెలసిన కాన్వెంట్లు, ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు కష్టాల్లో పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ వదిలి, ప్రభుత్వ బాటపట్టారు. 2019 […]

Advertisement
Update:2020-11-20 02:04 IST

చదువు మధ్యలోనే మానేసేవాళ్లు, ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లిపోయేవారితో ప్రతి ఏటా ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు కళ కోల్పోతూ వచ్చాయి. ఓ దశలో విద్యార్థులతో కిక్కిరిసినట్టు ఉండే స్కూళ్లు కూడా.. వెలవెలబోయే పరిస్థితికి చేరుకున్నాయి. కానీ గత ఏడాది కాలంగా ఈ విషయంలో భారీ మార్పు వచ్చింది. ఊరూ వాడా పుట్టగొడుగుల్లా వెలసిన కాన్వెంట్లు, ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు కష్టాల్లో పడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ వదిలి, ప్రభుత్వ బాటపట్టారు. 2019 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాల కారణంగా ఈ మార్పు మొదలైందనడంలో అతిశయోక్తి కాదు.

అమ్మఒడి…

నవరత్నాల పథకాల్లో ఒకటైన అమ్మఒడిలో భాగంగా విద్యార్థిని బడికి పంపించే ప్రతి తల్లి అకౌంట్లో 15వేలు జమ చేస్తారు. మొదట్లో ఇది కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం అనుకుని అపోహపడ్డ పేరెంట్స్ అందరూ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ మాన్పించి మరీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు. ఆ తర్వాత అందరికీ ఈ స్కీమ్ ని ప్రభుత్వం వర్తింపజేసింది.

నాడు-నేడు

నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మారిపోయాయి. మౌలిక వసతుల్లో ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా తయారయ్యాయి. ఈ మార్పు వల్ల కూడా చాలామంది ప్రభుత్వ స్కూళ్లవైపు ఆకర్షితులవుతున్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడానికి అధికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఓవైపు కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నా కూడా తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లో పుస్తకాలు ముద్రించి.. సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇంగ్లిష్ మీడియం చదువులపై మక్కువ ఉన్న తల్లిదండ్రులందరూ.. తమ పిల్లల్ని కాన్వెంట్ చదువులు మాన్పించి సర్కారు బడులవైపు ఆసక్తి చూపించారు.

విద్యా కానుక

జగనన్న విద్యాకానుక పేరుతో ప్రతి స్కూల్ విద్యార్థికి బ్యాగ్, షూస్, సాక్స్, బెల్ట్, యూనిఫామ్ మెటీరియల్, పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేక పేద కుటుంబాల్లో పిల్లలు చదువుమానుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వమే వీటిని ఉచితంగా ఇస్తుండే సరికి డ్రాపవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది.

ప్రభుత్వ స్కూళ్లలోనే సకల సౌకర్యాలు, ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉండటంతోపాటు.. అమ్మఒడి వంటి కార్యక్రమాలు భవిష్యత్ లో కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేస్తారనే అనుమానంతో… ఇప్పటికే చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ మాన్పించి మరీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు.

గతంలో ఉన్న టీసీ నిబంధనను కూడా ప్రభుత్వం అవసరం లేదని చెప్పడంతో.. ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు మరింత పెరిగాయి. 2019 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లవైపు మళ్లిన విద్యార్థుల సంఖ్య 2,01,833.

2019కి ముందు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల సంఖ్య 39.78 లక్షలు కాగా, ప్రస్తుతం వారి సంఖ్య 42.46 లక్షలకి చేరింది అంటే.. కొత్త అడ్మిషన్లతో సహా ఏడాదికి ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య 2.68లక్షలు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లవైపు వెళ్లిన దాఖలాలు లేవు. చిన్న చిన్న పల్లెటూళ్లలో కూడా తామరతంపరలా పుట్టుకొస్తున్న కాన్వెంట్ లు, టెక్నో, టాలెంట్ స్కూళ్లకు ఇన్నాళ్లకు బ్రేక్ పడింది.

కరోనా కష్టకాలంతోపాటు.. ప్రభుత్వ పథకాల ఎఫెక్ట్ పడటంతో ప్రైవేట్ స్కూల్స్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పథకాల అమలుతీరు కూడా ఇంతే సమర్థంగా కొనసాగితే.. ఏపీలో సర్కారు బడులకు పునర్వైభవం రావడం గ్యారెంటీ.

Advertisement

Similar News