మహా కుంభమేళా.. యూపీ ఆర్థిక వ్యవస్థకు రూ. 2లక్షల కోట్లు
కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ అంచనా
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం 'మహాకుంభమేళా'కు మొదటిరోజు కోటిన్నరమంది పుణ్యస్నానాలు చేసినట్టు కుంభమేళా అధికారులు ప్రకటించారు. ఇలా 45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారాయూపీరాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ. 2 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మహా ఘట్టానికి 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తున్నది. వారిలో ఒక్కక్కరు రూ. 5 వేలు ఖర్చుపెడితే రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో భక్తుడి సగటు ఖర్చు రూ. 10 వేలు ఉంటుంది అంటున్నారు. తద్వారా రూ. 4 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నద న్నారు. మహాకుంభమేళా వల్ల యూపీ జీఎస్‌డీపీ 1 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. 2019లో ప్రయాగ్ రాజ్‌లో జరిగిన అర్ధ కుంభమేళా వల్ల యూపీ ఆర్థిక వ్యవస్థకు లక్షా 20 వేల కోట్లు సమకూరాయని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల తెలిపారు. అర్ధకుంభమేళాలో 24 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు.
అటు వ్యాపారుల సమాఖ్య కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ )కూడా అంచనాలు రూపొందించింది.హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, లాడ్జీల ద్వారా రూ. 40 వేల కోట్ల వ్యాపారం జరగనున్నదని, ఆహార, పానియాల రంగం ద్వారా రూ. 20 వేల కోట్లు సమకూర్చే అవకాశం ఉన్నదని తెలిపింది. పూజా సామాగ్రి సహా ఆధ్యాత్మిక పుస్తకాల వ్యాపారం ద్వారా రూ. 20 వేల కోట్ల లాబాదేవీలు జరగనున్నాయని పేర్కొన్నది. రవాణా, లాజిస్టిక్ సేవల ద్వారా రూ. 10 వేల కోట్లు, టూరిస్ట్ గైడ్‌లు, ట్రావెల్ ప్యాకేజీల ద్వారా మరో రూ. 10 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఔషధాల ద్వారా మరో 3 వేల కోట్లు, ప్రకటనలు, ప్రమోషన్ కార్యకలాపాల ద్వారా 10 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉన్నదని సీఏఐటీ అంచనా వేసింది.