కరోనా టీకా అవసరం లేనట్టే " ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా

రోజు రోజుకీ కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో.. కరోనాని పూర్తిగా జయించేశామన్న ధీమాకి వచ్చేశారు భారత ప్రజలు. సినిమాహాళ్లు సహా… దాదాపుగా అన్నిటికీ ప్రభుత్వం గేట్లు ఎత్తేసిన దశలో.. రోడ్లపై మాస్కులు లేకుండానే తిరిగేస్తున్నారు. మొదట్లో ప్రతి దానికీ శానిటైజర్ రాసుకునే అలవాటు ఉన్నవారు కూడా ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. కరచాలనం, ఆత్మీయ ఆలింగనం.. మళ్లీ ప్రజల జీవన విధానంలోకి వచ్చి చేరాయి. టీకా ఎప్పుడొస్తుంది అంటూ గూగుల్ అంతా వెదికేసిన వాళ్లు, అయ్యో […]

Advertisement
Update:2020-11-15 03:00 IST

రోజు రోజుకీ కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో.. కరోనాని పూర్తిగా జయించేశామన్న ధీమాకి వచ్చేశారు భారత ప్రజలు. సినిమాహాళ్లు సహా… దాదాపుగా అన్నిటికీ ప్రభుత్వం గేట్లు ఎత్తేసిన దశలో.. రోడ్లపై మాస్కులు లేకుండానే తిరిగేస్తున్నారు.

మొదట్లో ప్రతి దానికీ శానిటైజర్ రాసుకునే అలవాటు ఉన్నవారు కూడా ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. కరచాలనం, ఆత్మీయ ఆలింగనం.. మళ్లీ ప్రజల జీవన విధానంలోకి వచ్చి చేరాయి. టీకా ఎప్పుడొస్తుంది అంటూ గూగుల్ అంతా వెదికేసిన వాళ్లు, అయ్యో రష్యావాడు మనకంటే ఫాస్ట్ గా ఉన్నాడే.. అని తెగ ఇదైపోయిన వాళ్లు కూడా కొవిడ్ టీకా పేరు చెబితే లైట్ తీసుకునే పరిస్థితి. ఎప్పుడో ఒకప్పుడు రాకుండా పోతుందా? రోగం తగ్గిపోయాక వచ్చినా ఉపయోగం ఏంటో? అనే కామెంట్లు వినపడుతున్నాయి.

సరిగ్గా టీకా విషయంలో ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. టీకా అవసరం లేకుండానే భారత ప్రజలు దాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని సంపాదిస్తారని స్పష్టం చేశారు. భారత ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి రావాలంటే 2022 వరకు సమయం పట్టొచ్చని, భారత్ లాంటి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో ప్రజలందరికీ టీకా అందుబాటులోకి తేవడం పెద్ద పని అని గతంలో తేల్చి చెప్పిన గులేరియా.. ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీపై వాస్తవాలను కుండబద్దలు కొట్టారు.

కొవిడ్-19 టీకా అందుబాటులోకి రావడానికి ముందే భారత ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. “మనమంతా మంచి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నామన్న దశకు చేరుకోవచ్చు. అప్పుడు టీకా ప్రయోజనం ఉండదు. అయితే అప్పుడు మరో సమస్య ఎదురవుతుంది. వైరస్ మార్పు చెందితే… రీ ఇన్ఫెక్షన్ నివారించడానికి టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే రోజుల్లో వైరస్‌ స్పందించే తీరుపై అధ్యయనాలు జరుగుతున్నాయి. దాని ఆధారంగా ఎంతమందికి, ఎంత తరచుగా టీకా ఇవ్వాలనే విషయంపై స్పష్టత వస్తుంది” అని చెప్పారు గులేరియా.

అంటే టీకా వచ్చే సమయానికి భారత ప్రజలందరిలో కరోనాని తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగి ఉంటుందనే విషయం స్పష్టమవుతోంది. ఇప్పటికే యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకున్న చాలామందికి కరోనా వచ్చిపోయినట్టు తెలుస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే, ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండానే కరోనా వారికి సోకడం, వారిలో యాంటీబాడీస్ పెరగడం జరిగిపోయిందనమాట. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది, అందుకే కేసుల సంఖ్య తగ్గిపోతోంది.

మరోవైపు కేసులు ఉన్నా కూడా… మరణాల సంఖ్య కనిష్టానికి పడిపోవడం అన్నిటికంటే ఊరటనిచ్చే అంశం. అంటే… ఒకవేళ కరోనా సోకినా.. గతంలో లాగా ఆందోళనపడాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నమాట. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, హఠాత్తుగా కోమాలోకి వెళ్లడం, రోజుల వ్యవధిలోనే చనిపోవడం.. లాంటి కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. అంటే ఒకరకంగా టీకాకంటే ముందే భారత్ కరోనాని జయించిందని చెప్పడం అతిశయోక్తి కాదు, అలాగని అజాగ్రత్తగా ఉండటం మంచిది కూడా కాదు.

టీకా వచ్చేవరకు, టీకా వచ్చిన తర్వాత కూడా వ్యక్తిగత శుభ్రత పాటించడం, భౌతిక దూరంతో మసలుకోవడం, మరీ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లడం, విందులు వినోదాల పేరుతో చేసే హడావిడి మానుకోవడం మన జీవితంలో నిత్యకృత్యం కావాలి. అప్పుడు టీకా అవసరం లేకుండానే మన జీవన విధానంతో కొవిడ్ ని నివారించొచ్చు.

Advertisement

Similar News