దాల్చిన చెక్క మంచిదే.... కానీ చెడు ప్రభావాలూ ఉన్నాయి !

కోవిడ్ నివారణలో భాగంగా… అల్లం, మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వంటివాటికి మరింతగా ఔషధ హోదా దక్కింది. నిత్యం వీటితో తయారుచేసిన కషాయాలు తాగుతున్నారు చాలామంది. అలా ఎక్కువగా తాగి సమస్యల బారిన పడుతున్నవారూ ఉన్నారు. కషాయాల్లో దాల్చిన చెక్కని సైతం ఎక్కువగా వినియోగిస్తున్నారు. అలాగే వంటల్లో సైతం దీనిని ఎక్కువగానే వాడుతుంటాం. ఇందులో చాలా విలువైన పోషకాలు, ఔషధ విలువలు ఉన్నాయి. నిజమే. కానీ దాల్చిన చెక్కని మోతాదుకి మించి తీసుకుంటే సైడ్ […]

Advertisement
Update:2020-10-30 02:00 IST

కోవిడ్ నివారణలో భాగంగా… అల్లం, మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వంటివాటికి మరింతగా ఔషధ హోదా దక్కింది. నిత్యం వీటితో తయారుచేసిన కషాయాలు తాగుతున్నారు చాలామంది. అలా ఎక్కువగా తాగి సమస్యల బారిన పడుతున్నవారూ ఉన్నారు. కషాయాల్లో దాల్చిన చెక్కని సైతం ఎక్కువగా వినియోగిస్తున్నారు. అలాగే వంటల్లో సైతం దీనిని ఎక్కువగానే వాడుతుంటాం. ఇందులో చాలా విలువైన పోషకాలు, ఔషధ విలువలు ఉన్నాయి. నిజమే. కానీ దాల్చిన చెక్కని మోతాదుకి మించి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. న్యూట్రిషనిస్ట్ మనీషా చోప్రా చెబుతున్న వివరాలను బట్టి…

  • దాల్చిన చెక్కతో శ్వాస సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పచ్చి దాల్చిన చెక్కను తింటున్న సమయంలో లేదా వంట చేస్తున్న సమయంలో దీని వాసనని పీల్చుకున్నా దగ్గు తుమ్ములతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆస్తమా ఉన్న వారు దీనిని వాడే సమయంలో వాసనని మరీ ఎక్కువగా పీల్చకూడదు.
  • దాల్చిన చెక్కకు అలర్జీలను కలిగించే గుణం ఉంది. చర్మంపై దురదలు, దద్దుర్లు లాంటివి కలగవచ్చు. అలాగే కొంతమందిలో కడుపుకి సంబంధించిన సమస్యలు సైతం రావచ్చు. దాల్చిన చెక్క పడనివారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని దానిని తమ ఆహారంలో చేర్చుకోవాలి.
  • దాల్చిన చెక్కను మరీ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో షుగర్ స్థాయి తగ్గిపోయి మగత, అలసట, ఆందోళన లాంటి లక్షణాలకు దారితీయవచ్చు.
  • కొంతమందికి దాల్చిన చెక్కని ఎక్కువగా తీసుకోవటం వలన కడుపులో మంటగా అనిపిస్తుంది. ఇది కడుపులో అల్సర్లకు, క్యాన్సర్ కి సైతం దారితీయవచ్చు.
  • దాల్చినచెక్కలో సిన్నామల్ డిహైడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది నోట్లో అల్సర్లను కలగచేయవచ్చు. కొంతమందికి దాల్చిన చెక్క తిన్నపుడు నాలుక, చిగుళ్లపైన మంట దురద లాంటి సమస్యలు ఉంటాయి.

ఎంత తీసుకోవచ్చు….

రోజుకి రెండు నుండి నాలుగు గ్రాముల వరకు లేదా సుమారు ఒక టీస్పూను వరకు దాల్చిన చెక్కని తీసుకోవచ్చని మనీషా చోప్రా చెబుతున్నారు. ఏదీ మితిమీరి తీసుకోకూడదని, ఒకవేళ మీరు ఏవైనా మందులు వేసుకుంటూ ఉంటే… దాల్చిన చెక్కని మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుందని, లేకపోతే ఇది ఆ మందులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి…

  • ప్రస్తుతం కానీ ఇంతకుముందు కానీ కాలేయానికి సంబంధించిన వ్యాధికి గురయినవారు
  • తరచుగా నోటికి సంబంధించిన అల్సర్లకు లోనయ్యేవారు…జాగ్రత్తగా ఉండాలి
  • దాల్చిన చెక్కను మరీ ఎక్కువగా తీసుకుంటే గర్భిణులకు నెలలు నిండకుండా నొప్పులు రావటం, గర్భాశయం సంకోచించడం లాంటి సమస్యలు కలగవచ్చు. కనుక గర్భవతులు, పాలిచ్చే తల్లులు దీనిని మరీ ఎక్కువ వాడకూడదు.
  • గ్యాస్ట్రోపారిసిస్ (ఆహారం పొట్టలో ఉండాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం ఉండిపోవటం ) సమస్య ఉన్నవారు దాల్చిన చెక్కకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటివారి శరీరాలకు దాల్చిన చెక్కని సవ్యంగా అరిగించే శక్తి ఉండదు.
  • దాల్చిన చెక్కలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు మధుమేహం ఉన్నవారికి సమస్యగా మారే ప్రమాదం ఉంది.
  • ఆస్తమా ఉన్నవారు దాల్చిన చెక్క విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరు దాల్చిన చెక్క వాసనని చూస్తే అప్పటికప్పుడు దగ్గు, శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
Advertisement

Similar News