ఈ దండ... కరోనాకి విరుగుడట!

కరోనా ఎలా తగ్గుతుంది అనేది భేతాళ ప్రశ్నగా మారినవేళ… అనేక రెమిడీలు మనముందుకు వస్తున్నాయి. అల్లోపతి మందులు, ఆయుర్వేద చికిత్సలు, వంటింటి చిట్కాలు, ప్రకృతి వైద్యం ఇలా ఎన్నో చూస్తున్నాం. కరోనాని జయించే ఉపాయాలతో యూట్యూబ్ లో అనేక వీడియోలు దర్శనమిస్తున్నాయి. రోజుకో కొత్త విషయం మనముందుకు వస్తోంది. ఈ నేపథ్యలో ఇండోనేషియా వ్యవసాయ శాఖామంత్రి శ్యాహ్రుల్ యాసిన్ లింపో ఒక వినూత్నమైన ఉపాయాన్ని తెరపైకి తెచ్చాడు. యూకలిప్టస్ ఆకులు బెరడు తదితర అంశాలతో తయారుచేసిన మాల […]

Advertisement
Update:2020-07-08 16:10 IST

కరోనా ఎలా తగ్గుతుంది అనేది భేతాళ ప్రశ్నగా మారినవేళ… అనేక రెమిడీలు మనముందుకు వస్తున్నాయి. అల్లోపతి మందులు, ఆయుర్వేద చికిత్సలు, వంటింటి చిట్కాలు, ప్రకృతి వైద్యం ఇలా ఎన్నో చూస్తున్నాం. కరోనాని జయించే ఉపాయాలతో యూట్యూబ్ లో అనేక వీడియోలు దర్శనమిస్తున్నాయి. రోజుకో కొత్త విషయం మనముందుకు వస్తోంది.

ఈ నేపథ్యలో ఇండోనేషియా వ్యవసాయ శాఖామంత్రి శ్యాహ్రుల్ యాసిన్ లింపో ఒక వినూత్నమైన ఉపాయాన్ని తెరపైకి తెచ్చాడు. యూకలిప్టస్ ఆకులు బెరడు తదితర అంశాలతో తయారుచేసిన మాల ధరిస్తే కరోనా వైరస్ చచ్చిపోతుందని చెబుతున్నారాయన.

యూకలిప్టస్ మాలని 15 నిముషాలు ధరిస్తే అది అరోమా థెరపీగా పనిచేసి 42 శాతం వైరస్ నశిస్తుందని, అరగంటపాటు ధరిస్తే 80శాతం వైరస్ నశించిపోతుందని ఆ మంత్రి చెబుతున్నారు. అంతేకాదు ఈ హారాలను చాలా పెద్ద ఎత్తున తయారుచేయాలనే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. ఈ దండల్లో వినియోగదారులు పీల్చుకునేందుకు వీలుగా పొడి ఉంటుంది. అలాగే యూకలిప్టస్ తో ఇన్ హేలర్లను సైతం తయారుచేస్తున్నారు.

అయితే దీనిపై పలు విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ఆ దేశంనుండే వినబడుతున్నాయి. తమ దేశాన్ని చూసి ఇతరులు నవ్వుకుంటారనే భయాన్ని కొంతమంది ఇండోనేషియా వాసులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఇదే దేశ ఆరోగ్యశాఖా మంత్రి తెరావన్ అగస్ పుత్రాంటో… ప్రార్థనా శక్తి కారణంగానే కరోనా వైరస్ స్థాయి తమకు తక్కువగా ఉందని చెప్పాడు. అది మర్చిపోకముందే ఇప్పుడు మరోమంత్రి తమని నవ్వులపాలు చేస్తున్నాడని ఆ దేశవాసులు కొందరు వాపోతున్నారు. ఇప్పుడు ఆగ్నేయాసియాలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న దేశం ఇండోనేషియా.

ఏదిఏమైనా యూకలిప్టస్ మహిమతో తమ దేశం కరోనానుండి బయటపడుతుందని ఆ దేశ వ్యవసాయశాఖ బలంగా నమ్ముతోంది. యూకలిప్టస్ ఆవిరితో వైరస్ బలహీనపడుతుందని, వ్యాప్తి తగ్గుతుందని ఆ శాఖకు చెందినవారు అంటున్నారు. ఇండోనేషియా వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఆరోగ్య పరిశోధన, అభివృద్ధి సంస్థ అధిపతి ఫాడ్ జ్రీ జూఫ్రీ మాట్లాడుతూ మార్చి నుండి తాము కరోనాకి తగిన ఔషధం విషయంలో అన్నిరకాల మూలికలపై పరిశోధనలు చేస్తున్నామన్నారు.

అయితే యూకలిప్టస్ కోవిడ్ 19కి పనిచేస్తుందా లేదా అనే విషయంలో ప్రయోగాలేమీ చేయలేదని, కొన్నిరకాల సాధారణ కరోనా వైరస్ లపై ప్రయోగించి చూశామని ఆయన తెలిపారు. కృత్రిమంగా కోవిడ్ 19 వైరస్ ని సృష్టించే సామర్ధ్యం మనకు లేకపోవటం వల్లనే అలా చేయలేకపోయామని జూఫ్రీ వివరించారు. తమ మంత్రిత్వశాఖకు క్లినికల్ ట్రయల్స్ చేసే అధికారం లేదని కూడా ఆయన వెల్లడించాడు.

కొన్ని తరాలుగా ఫ్లూ, శ్వాసకోశ సమస్యలకు యూకలిప్టస్ ని ప్రత్యామ్నాయ వైద్యంగా వాడుతున్నారని, దాని గురించి ఉన్న ప్రచురణలు, దాని స్వభావ లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఆ దిశగా పరిశోధనలు చేసినట్లుగా, అందులోని యాంటీవైరల్ లక్షణాలను పరిశీలించినట్టుగా ఇండోనేషియా వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశ జాతీయ ఔషధ ఆహార నియంత్రణ సంస్థనుండి తమ యూకలిప్టస్ ఔషధ హారానికి అనుమతి ఉందని ఇంతకుముందు వ్యవసాయ శాఖా మంత్రి చెప్పగా, జూఫ్రీ మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే యూకలిప్టస్ హారంపైన మాత్రం యాంటీ కరోనావైరస్ అనే అక్షరాలను మాత్రం ముద్రిస్తున్నారు. దీనిని కరోనా వైరస్ కి విరుగుడుగా చెప్పాలంటే మరిన్ని పరిశోధనలు జరగాలని అక్కడి వైద్యరంగ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News