రాష్ట్రవ్యాప్తంగా.... వరుసగా రెండో రోజు ఉధృతంగా

అవినీతి నిరోధక శాఖ.. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా రెండో రోజు ఉధృతంగా తనిఖీలు, సోదాలతో హల్ చల్ చేసింది. ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా.. అన్నిజిల్లాల్లోనూ మున్సిపల్ కార్పొరేషన్లు, ఇతర ప్రధాన కార్యాలయాల పరిధిలో దాడులు చేసింది. పలు మార్గాల ద్వారా తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సీరియస్ గా స్పందించింది. భవన నిర్మాణాల్లో అక్రమాలు బయటపెట్టే దిశగా.. అనూహ్య తనిఖీలను కొనసాగించింది. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు విడుదల చేసిన పత్రికా ప్రకటన […]

Advertisement
Update:2020-02-20 02:51 IST

అవినీతి నిరోధక శాఖ.. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా రెండో రోజు ఉధృతంగా తనిఖీలు, సోదాలతో హల్ చల్ చేసింది. ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా.. అన్నిజిల్లాల్లోనూ మున్సిపల్ కార్పొరేషన్లు, ఇతర ప్రధాన కార్యాలయాల పరిధిలో దాడులు చేసింది. పలు మార్గాల ద్వారా తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సీరియస్ గా స్పందించింది.

భవన నిర్మాణాల్లో అక్రమాలు బయటపెట్టే దిశగా.. అనూహ్య తనిఖీలను కొనసాగించింది. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం అవినీతి నిరోధక శాఖ సిబ్బంది.. అక్రమ కట్టడాల ఫిర్యాదులపై రంగంలోకి దిగారు. వీటిలో చాలా వరకు అనుమతులు లేకుండా కట్టిన భవనాలను, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలను గుర్తించారు.

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో 108 చదరపు మీటర్ల స్థలంలో ఎలాంటి అనుమతులు లేని భవనం.. కథేరా వీధిలో జీ+2 భవనం, మంగువారి తోటలో జీ+1 భవనం, చాణక్, నగర్ లో మరో జీ+1 భవనాన్ని గుర్తించగా.. వేటికీ సరైన అనుమతులు లేవని విచారణలో తేలింది.

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రింగ్ రోడ్డులో.. 1355.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అనుమతులు లేని ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని అధికారులు గుర్తించారు. ఈ స్థలం దేవాదాయ శాఖకు చెందినదిగా భావిస్తున్నారు.

విశాఖపట్నం మధురవాడ జోన్ ఇందిరా నగర్ లో జీ+2 అనుతితో జీ+3 భవనం.. అది కూడా నివాస గృహానికి అనుమతి తీసుకుని అపార్ట్ మెంట్ గా నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. గాజువాక జోన్ షీలా నగర్ లో ఎలాంటి అనుమతులు లేని జీ+3 భవనం,.. వుడా కాలనీ ఫేజ్ 1లో ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా ఓ భవనంలో అదనపు భవన నిర్మాణం.. చినగంట్యాడలోని టౌన్ ప్లానింగ్ కార్యాలయ సమీపంలో అనుమతులు లేని జీ +2 భవనం.. గణేష్ నగర్ అల్లూరి సీతారామరాజు విగ్రహ సమీపంలో సరైన అనుమతులు లేని జీ+2 భవనాన్ని అధికారులు గుర్తించారు.

గోదావరి జిల్లాల విషయానికి వస్తే.. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సంజయ్ నగర్ లో తీసుకున్న అనుమతికి విరుద్ధంగా ఓ భారీ భవన నిర్మాణం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీలో అనుమతులు లేకుండానే నిర్మాణంలో ఉన్న భవనాన్ని.. ఏలూరు రోడ్డు, వార్డు నంబర్ 21లో మరో ఇదే రీతిన మరో భవనాన్ని గుర్తించారు.

మిగిలిన జిల్లాల్లోనూ ఇలాంటి దందాలు బాగానే బయటపడ్డాయి. కృష్ణా జిల్లా విజయవాడ కేదారేశ్వరపేటలో ఎలాంటి అనుమతులు లేని జీ+1 భవనం.. అలాగే ఇస్లాంపేట స్ట్రీట్, ఆర్ఆర్ అప్పారావు వీధి, కుటుంబరావు వీధి, గణేష్ నగర్ కాలనీల్లోనూ ఇలాంటి అనుమతులు లేని భవనాలు గుట్టును అధికారులు బయటపెట్టారు.

గుంటూరు జిల్లాకు వెళ్తే.. జిల్లా కేంద్రంలోని నల్లచెరువులో అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణం.. నగరంపాలెం దగ్గర అనుమతులు సరిగా లేని మరో భవనం.. శివరామ్ నగర్ లో.. లక్మీపురం వీధి నంబర్ 3లో ఒక్కో భవనాన్ని గుర్తించారు. కొన్ని అనుమతులకు విరుద్ధంగా నిర్మాణంలో ఉంటే.. మరికొన్నిటికి అనుమతులే లేవు.

ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ లోని భాగ్యనగర్ లో నిబంధనలకు విరుద్ధంగా జీ+3 భవనం.. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని వార్డు నంబర్ 37 లో ఉన్న రామ్ నగర్ రెండో వీధిలో అనుమతులు లేకుండా కడుతున్న భవనాన్ని… చిత్తూరు జిల్లాలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సత్యనారాయణ పురంలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం జరిగిన భవనాన్ని.. అధికారులు గుర్తించారు.

కడప జిల్లా విషయానికి వస్తే.. ప్రొద్దుటూరులో మైదుకూరు రోడ్డులో జీ+1 అనుమతితో జీ+4 భవనం… అదే ప్రాంతంలో జీ+2 అనుమతితో జీ+3 భవనం.. గాంధీ రోడ్డులో సాధారణ గృహానికి అనుమతితో కమర్షియల్ భవనం.. శ్రీరాములపేటలలో జీ+2 అనుమతితో జీ+5 భవనాన్ని కడుతున్నట్టు గుర్తించారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలోని శిల్పా ఎస్టేట్ లో జీ+2 కమర్షియల్ భవనం అనుమతి తీసుకుని.. అందుకు విరుద్ధంగా సెల్లార్, 4 కమర్షియల్ షాపులు కట్టినట్టు అధికారులు తేల్చారు. అదే ప్రాంతంలో జీ+1 అనుమతితో కట్టిన జీ+2 భవనం,.. అదే ప్రాంతంలో జీ+2 నివాస గృహ అనుమతితో కమర్షియల్ భవన నిర్మాణం చేసినట్టు తేల్చారు.

అనంతపురం జిల్లా కదిరిలో జీ+2 అనుమతితో జీ+4 భవనాన్ని కట్టినట్టు గుర్తించారు. సాయిబాబా గుడి దగ్గర వాణి స్ట్రీట్ సమీపంలో అనుమతులు లేకుండా కట్టిన ఇళ్లు గుర్తించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నా.. ఇన్నాళ్లు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంలాటి చర్యలు తీసుకోలేదని.. ఇంతగా అక్రమాలు జరుగుతున్నా చూసీ చూడనట్టు వ్యవహరించారని.. అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో.. అకస్మాత్తుగా నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ గానే కఠిన చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News