ప్రాంతాలకు అతీతంగా.... తెలుగు ప్రజలకు కావాల్సింది ఇదే !
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సమావేశమయ్యారు. ఇరువురూ ఉభయ రాష్ట్రాల పరిధిలోని చాలా సమస్యలపై మాట్లాడారు. కలిసి పని చేద్దామన్న నిర్ణయానికి వచ్చారు. ఇది అందరూ భావించిందే.. ప్రజలు కూడా ఆశించిందే. ఇంతకు మించి ఏం ఉంటుంది? ఇంతకు మించి ఏం ఆశించగలం? అని నిట్టూర్చేవారికి ఇలా.. యువనేతలు మంచి సందేశాన్ని ప్రజలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తెలంగాణ మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారంలో ఉన్న కేటీఆర్.. వారికి […]
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సమావేశమయ్యారు. ఇరువురూ ఉభయ రాష్ట్రాల పరిధిలోని చాలా సమస్యలపై మాట్లాడారు. కలిసి పని చేద్దామన్న నిర్ణయానికి వచ్చారు. ఇది అందరూ భావించిందే.. ప్రజలు కూడా ఆశించిందే. ఇంతకు మించి ఏం ఉంటుంది? ఇంతకు మించి ఏం ఆశించగలం? అని నిట్టూర్చేవారికి ఇలా.. యువనేతలు మంచి సందేశాన్ని ప్రజలకు పంపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తెలంగాణ మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారంలో ఉన్న కేటీఆర్.. వారికి తోడు గ్రీన్ చాలెంజ్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్.. ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే.. ఇప్పుడు ప్రజల్లో మంచి చర్చకు దారి తీసింది.
చిన్న సెల్ఫీ దిగితే ఇంత చర్చ చేయాలా అని ప్రశ్నించేవారు కూడా ఉంటారు కానీ.. ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించాలి. గుర్తు చేసుకోవాలి. సరిగ్గా 5 ఏళ్ల క్రితం వరకూ.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో.. సీమాంధ్ర ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగిన సమయంలో.. రెండు ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం కూడా.
కానీ.. కాలం మారింది. తెలంగాణ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. తొలుత చంద్రబాబు ప్రభుత్వం, తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చాయి. ఈ క్రమంలో.. తెలంగాణతో సంబంధాల విషయంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణతో నీళ్లు, విద్యుత్ విషయంలో ప్రతిసారీ గొడవలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం వచ్చాక మాత్రం ఆ పరిస్థితి మారింది. తెలంగాణ ప్రభుత్వం కూడా.. చంద్రబాబు ప్రభుత్వంతో కంటే జగన్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతోంది. ఒక రాష్ట్ర ప్రయోజనాన్ని మరో రాష్ట్రం దెబ్బ తీయకుండా పరస్పర అంగీకారంతో నడిచేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.
ఈ దిశగానే.. ఒకటికి రెండు సార్లు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి చర్యలతో పాటు.. చొరవ తీసుకుంటున్నారు. ఫలితంగా.. 2014 – 18 నాటికి… 2018 తర్వాత.. అన్నట్టుగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నేతల మధ్య చొరవ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు నిదర్శనంగా.. కేటీఆర్, జగన్ కలిసి సెల్ఫీ తీసుకోవడం.. తాము ముందు ముందు మరింత కలిసి పని చేస్తామని చెప్పడంతో.. ఇది ఇరు రాష్ట్రాల ప్రజలు ఆనందించాల్సిన విషయమే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Feeling happy to meet with AP CM @ysjagan garu along with our beloved working president @KTRTRS garu today when he called on @TelanganaCMO for a deliberation over various pending issues pertaining to both states at Pragathi Bhavan.#Selfie pic.twitter.com/8sq4blEvVw
— Santosh Kumar J (@MPsantoshtrs) January 13, 2020