జగన్ భయపడ్డాడా?
ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మూడు రాజధానుల అంశంపై తుది నిర్ణయం ఉంటుందని భావించారు. కానీ బీసీజీ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత .. హైపవర్ కమిటీతో పరిశీలన చేయించిన తర్వాత ముందుకెళ్లాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇలా జరగడంతో వెంటనే కొన్ని మీడియా సంస్థలు, కొందరు టీడీపీ నేతలు… జగన్ భయపడ్డారంటూ ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వార్నింగ్ వచ్చిందని కొందరు… సురేష్ ప్రభు వచ్చి జగన్‌ను హెచ్చరించి వెళ్లారని మరొ కొందరు… ప్రచారం […]
ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మూడు రాజధానుల అంశంపై తుది నిర్ణయం ఉంటుందని భావించారు. కానీ బీసీజీ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత .. హైపవర్ కమిటీతో పరిశీలన చేయించిన తర్వాత ముందుకెళ్లాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇలా జరగడంతో వెంటనే కొన్ని మీడియా సంస్థలు, కొందరు టీడీపీ నేతలు… జగన్ భయపడ్డారంటూ ప్రచారం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి వార్నింగ్ వచ్చిందని కొందరు… సురేష్ ప్రభు వచ్చి జగన్‌ను హెచ్చరించి వెళ్లారని మరొ కొందరు… ప్రచారం చేస్తున్నారు.
సుజనాచౌదరి…. మరో అడుగు ముందుకేసి అమరావతిని అంగులం కూడా కదిలించలేరు. అమరావతిని కదిలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదు అంటూ హెచ్చరించారు. కన్నా లక్ష్మీనారాయణ కూడా సుజనాచౌదరి తరహాలోనే మాట్లాడుతున్నారు.
నిజంగానే జగన్‌మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారా?. కేంద్రం నిజంగానే జగన్‌ను భయపెడుతుందా? అంటే ఈ రెండింటికి ఎక్కడా ఆధారం కనిపించదు. జగన్ భయపడే కేబినెట్ లో నిర్ణయం తీసుకోలేదు అని ప్రచారం చేస్తున్నారు. కానీ కేబినెట్ భేటీలోనే జగన్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. దాన్ని మరిచిపోకూడదు.
హడావుడిగా విశాఖకు వెళ్లిపోవాల్సిన అవసరం లేదు… అందరికీ ప్రభుత్వ నిర్ణయం వెనుక కారణాలను వివరించే ఆ పనిచేద్దామని కేబినెట్ భేటీలో జగన్ వ్యాఖ్యానించారు. జగన్ భయపడుతుంటే … హడావుడిగా వెళ్లిపోవాలనుకుంటే కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకునే ఉండేవారు.
కేంద్రం నుంచి ఒత్తిడి రావడంతో జగన్ వెనక్కు తగ్గారు అంటున్నారు… కానీ వెనక్కు తగ్గినట్టు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికీ మంత్రులు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే తప్పేంటి అని బహిరంగంగానే చెబుతున్నారు. జగన్‌మోహన్ రెడ్డి విశాఖ ఉత్సవ్‌కు వెళ్లినప్పుడు భారీ స్వాగతం పలికారు. విశాఖ ఉత్సవ్‌లో ముఖ్యమంత్రి సమక్షంలోనే ప్రదర్శించిన వీడియోలో కూడా విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నారని ప్రభుత్వమే వెల్లడించింది. మూడు రాజధానులపై జగన్ వెనక్కు తగ్గి ఉంటే అలా భారీ స్వాగతం ఉండేది కాదు.
మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం ఎక్కవ సమయం తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. బీసీజీ రిపోర్టు, జీఎన్ రావు కమిటీ రిపోర్టును అధ్యయనం చేసేందుకు హైపవర్ కమిటీని కూడా ఇప్పటికే ప్రకటించారు. హైపవర్ కమిటీకి కూడా మూడు వారాలు మాత్రమే గడుపు విధించారు. అంటే ఈ అంశాన్ని సాగదీసే యోచన, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టే యోచన కూడా లేదన్నది స్పష్టం.
కన్నా లక్ష్మీనారాయణ, సుజనాచౌదరి ఇద్దరూ జగన్‌కు వార్నింగ్‌లు ఇస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ కొత్తగా బీజేపీలో చేరిన వారే. కానీ మాటలు మాత్రం బీజేపీ వ్యవస్థాపకుల తరహాలో ఉంటున్నాయి. బాబు ఆక్రమిత బీజేపీ వాదనకు… అసలైన బీజేపీ స్పందనకు ఎలాంటి పొంతన కనిపించడం లేదు.
తిరుమలలో అన్యమత ప్రచారాన్ని జగన్ ప్రోత్సహిస్తున్నారు… ఏడు కొండలపై శిలువ ఉంది అంటూ తొలిసారి ప్రచారం మొదలుపెట్టింది, ట్వీట్ చేసింది బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణే. కానీ నిన్న తిరుమల వచ్చిన బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్యం స్వామి మాత్రం … తిరుమల పవిత్రతను ప్రభుత్వం కాపాడుతోందని కితాబిచ్చారు. తిరుమలలో అన్యమత ప్రచారం అంటూ తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావాలు వేయాలని సుబ్రమణ్యం స్వామి సూచించారు. అలా దావా వేస్తే లక్ష్మీనారాయణపై కూడా వేయాల్సి ఉంటుంది.
సురేష్ ప్రభు జగన్‌ను కలిసి మోడీ, అమిత్ షాల ఆలోచన చెప్పారు. అందుకే రాజధానిపై జగన్ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోలేకపోయారు అని మరికొందరి ప్రచారం. సురేష్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు గతంలో ఎంపికయ్యారు. బహుశా మరోసారి ఆ ప్రయత్నాలు చేసుకునేందుకు జగన్ వద్దకు వచ్చారేమో గానీ… వార్నింగ్ ఇచ్చేందుకు అయితే కాదనిపిస్తోంది. ఒకవేళ అందుకే వచ్చి ఉంటే తన వెంట సతీమణిని కూడా తీసుకుని వచ్చి… జగన్ దంపతులతో ప్రత్యేకంగా ఎందుకు సమావేశం అవుతారు. వారి వద్ద ఆతిథ్యం ఎందుకు తీసుకుంటారు?.
అసలు ఇక్కడ సుజనాచౌదరి జగన్ నిర్ణయాన్ని కేంద్రం ఒప్పుకోదు అని గర్జిస్తున్నారే గానీ… వైసీపీ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు శత్రుత్వాన్ని కోరుకుంటుంది. కేంద్రంలో ప్రతి బిల్లుకు వైసీపీ పార్లమెంట్‌లో మద్దతు ఇస్తూనే ఉంది. పైగా బీజేపీ ఇప్పుడు దేశంలో 71 శాతం నుంచి 40శాతం ప్రాంతానికి పడిపోయింది. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పకపోవొచ్చు.
ఇలాంటప్పుడు ఏ కూటమిలో లేకుండా తటస్థంగా ఉంటున్న వైసీపీతో ఎందుకు బీజేపీ గొడవ పెట్టుకుంటుంది అన్నది కూడా ఆలోచించాలి. సుజనాచౌదరి, కన్నా లక్ష్మీనారాయణ తీరు ఎలా ఉందంటే… ఎదుటివారిని సొంతంగా భయపెట్టే సామర్థ్యం లేనప్పుడు… పలాన పెద్దలు మాకు తెలుసు వారి ద్వారా మీ సంగతి తేలుస్తామని బెదిరిస్తున్నట్టుగా ఉంది.
ఎవరు అడ్డుపడినా… వెనక్కు తీసుకోలేని స్టెప్ జగన్ వేసేశారు. మూడు రాజధానుల అంశంపై ముందుకెళ్తే అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే జగన్‌కు నష్టం జరగవచ్చు… కానీ ముందుకు వెళ్లకపోతే 9 జిల్లాల్లో నష్టం తప్పదు. కాబట్టి ఎవరెన్ని చెప్పినా విశాఖ పరిపాలన రాజధాని కావడం ఖాయమే..!