అదానీ విరాళంపై రేవంత్ యూటర్న్
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో రూ.100 కోట్లు వాపస్
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో అదానీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం కార్పస్ ఫండ్ కింద విరాళాలు సేకరించాలని నిర్ణయించిందని, అదానీ సహా అనేక సంస్థలు విరాళం ఇచ్చాయని తెలిపారు. కానీ కొందరు ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అప్పనంగా ఇచ్చినట్టు అనవసర చర్చలకు తావిస్తున్నది.. అందుకే అదానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఇచ్చిన రూ.100 కోట్ల తిరస్కరిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వ అధికారి జయేశ్ రంజన్ ద్వారా విరాళం వాపస్ తీసుకోవాలని ఇప్పటికే లేఖ రాశాడని తెలిపారు. తప్పుడు ప్రచారానికి తావు ఇవ్వొద్దని, తాను తన మంత్రివర్గ సహచరులు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విరాళాలతో లక్షలాది మంది యువతకు నైపుణ్యాలు కల్పించే అవకాశం ఉన్నా.. రాజకీయ విమర్శల నేపథ్యంలోనే విరాళాన్ని వాపస్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు అదానీ వ్యవహారంలో బయట జరుగుతున్న పరిణామాలకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అదానీ విరాళం మాత్రమే వాపస్ చేస్తున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణలో అదానీ పెట్టుబడుల విషయంలో ఎలా ముందుకెళ్తున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.