శాఫ్ గేమ్స్ సూపర్ పవర్ భారత్...
దక్షిణాసియా సమాఖ్య దేశాల క్రీడల్లో భారత్ మరోసారి సత్తా చాటుకొంది. నేపాల్ రాజధాని ఖాట్మండూ వేదికగా ముగిసిన 13వ శాఫ్ గేమ్స్ లో పతకాల పంట పండించుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిదేశాల అథ్లెట్లు తలపడిన ఈ క్రీడల్లో తనకు పోటీనే లేదని, తనకుతానే మాత్రమే సాటని నిరూపించుకొంది. ఒలింపిక్స్ కు సన్నాహకంగా… టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే 2020 ఒలింపిక్స్ కు సన్నాహకంగా నేపాల్ లోని ఖాట్మండూ, ఫోక్రా, జనక్ పూర్ వేదికలుగా జరిగిన 2019 దక్షిణాసియా […]
దక్షిణాసియా సమాఖ్య దేశాల క్రీడల్లో భారత్ మరోసారి సత్తా చాటుకొంది. నేపాల్ రాజధాని ఖాట్మండూ వేదికగా ముగిసిన 13వ శాఫ్ గేమ్స్ లో పతకాల పంట పండించుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిదేశాల అథ్లెట్లు తలపడిన ఈ క్రీడల్లో తనకు పోటీనే లేదని, తనకుతానే మాత్రమే సాటని నిరూపించుకొంది.
ఒలింపిక్స్ కు సన్నాహకంగా…
టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే 2020 ఒలింపిక్స్ కు సన్నాహకంగా నేపాల్ లోని ఖాట్మండూ, ఫోక్రా, జనక్ పూర్ వేదికలుగా జరిగిన 2019 దక్షిణాసియా క్రీడలు భారత్ ఆధిపత్యానికి అద్దం పడుతూ ముగిసాయి.
నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అప్ఘనిస్థాన్ దేశాలకు చెందిన అథ్లెట్లు తలపడిన పదిరోజుల ఈ క్రీడాసంరంభంలో భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. మొత్తం 27 రకాల క్రీడాంశాలలో భారత్ కు ఎదురేలేకుండా పోయింది.
1984 నుంచి 2019 వరకూ….
నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్, ఆసియాక్రీడలు, కామన్వెల్త్ దేశాల క్రీడల తరహాలోనే… దక్షిణాసియా ప్రాంత దేశాలు 1984 నుంచి శాఫ్ గేమ్స్ పేరుతో.. ప్రత్యేకంగా క్రీడోత్సవాలు నిర్వహించుకొంటూ వస్తున్నాయి.
రెండేళ్ల కోసారి జరిగే ఈ క్రీడలకు తొలిసారిగా 1984లో నేపాల్ వేదికగా అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచి ప్రస్తుత 2019 శాఫ్ గేమ్స్ వరకూ 13సార్లు వివిధ దేశాలు ఆతిథ్యమిస్తూ వచ్చాయి.
1984 ఖాట్మండూ గేమ్స్ నుంచి 2019 ఖాట్మండూ గేమ్స్ వరకూ భారత్ సంపూర్ణ ఆధిపత్యమే కొనసాగింది. ఒలింపిక్స్ క్రీడాంశాలతో పాటు…దక్షిణాసియా దేశాలకే పరిమితమైన కబడ్డీ, ఖో-ఖో లాంటి క్రీడల్ని సైతం శాఫ్ గేమ్స్ అంశాలలో భాగంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
భారత్ విశ్వరూపం…
శాఫ్ గేమ్స్ పరంపరలో భాగంగా జరిగిన ప్రస్తుత 13వ దక్షిణాసియా క్రీడల్లో భారత్ 312 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో సగానికి పైగా బంగారు పతకాలు ఉండటం విశేషం.
మొత్తం 10 రోజుల ఈ క్రీడల్లో చివరి ఎనిమిదిరోజులూ భారత్ సంపూర్ణ ఆధిపత్యమే కొనసాగింది. పోటీల మొదటి ఎనిమిది రోజుల్లోనే 159 స్వర్ణాలతో సహా 294 పతకాలు సాధించడం చూస్తే భారత అథ్లెట్ల జోరు ఏస్థాయిలో సాగిందీ మరి చెప్పాల్సిన పనిలేదు.
మొత్తం 174 బంగారు పతకాలతో సహా 312 పతకాలు సాధించి..శాఫ్ గేమ్స్ లో సరికొత్త రికార్డు నమోదు చేసింది.
వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ, ఫెన్సింగ్, ఈత, షూటింగ్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, టేబుల్ టెన్నిస్, ఉషు,కరాటే, ట్రాక్ అండ్ ఫీల్డ్, బాక్సింగ్, మహిళల ఫుట్ బాల్ అంశాలు భారత్ కు బంగారు పంటనే పండించాయి.
కబడ్డీలో డబుల్ గోల్డ్…
శాఫ్ గేమ్స్ కబడ్డీ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లే బంగారు పతకాలు అందుకొన్నాయి. పురుషుల ఫైనల్లో భారతజట్టు 51-18తో శ్రీలంకను, మహిళల టైటిల్ సమరంలో నేపాల్ ను 50- 13 పాయింట్లతో చిత్తు చేసి విజేతలుగా నిలిచాయి.
మహిళల ఫుట్ బాల్ గోల్డ్ మెడల్ పోటీలో భారత్ 2-0 గోల్స్ తో నేపాల్ ను ఓడించడం ద్వారా వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. కేవలం షూటింగ్ క్రీడలోనే భారత షూటర్లు 18 స్వర్ణ, 7 రజత, 4 కాంస్య పతకాలు సాధించారు.
పురుషుల, మహిళల కుస్తీలోని మొత్తం 14 విభాగాలలోనూ భారత వస్తాదులే విజేతలుగా నిలిచారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో సైతం భారత ప్లేయర్లే స్వర్ణ, రజత పతకాలు అందుకొన్నారు.
1984 ప్రారంభ శాఫ్ గేమ్స్ నుంచి 2016 లో ముగిసిన 12వ శాఫ్ గేమ్స్ వరకూ భారత్..మొత్తం 1100 స్వర్ణాలతో సహా 2 వేల 86 పతకాలు సాధించండం ద్వారా దక్షిణాసియా దేశాల క్రీడాశక్తిగా పదేపదే చాటుకొంటూ వస్తోంది.
ప్రస్తుత 2019 క్రీడల్లో సైతం భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకోడం ద్వారా టోక్యో ఒలింపిక్స్ కు సన్నాహాలు ప్రారంభించింది.
ఖేలో ఇండియా ద్వారా వెలుగులోకి వచ్చిన వందలాదిమంది యువక్రీడాకారులు శాఫ్ గేమ్స్ ద్వారా తమ సత్తాను చాటుకోడం విశేషం.
భారత అథ్లెట్లు ఇదే జోరును 2020 టోక్యో ఒలింపిక్స్ లో సైతం కొనసాగించగలిగితే ఖేలో ఇండియా పథకం సాకారమైనట్లేనని మరి చెప్పాల్సిన పనిలేదు.