నేడు లేదా రేపు సచివాలయం పోస్టుల ఫలితాలు
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. దాదాపు 20 లక్షల మంది ఈ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారు. వీటి ఫలితాలు గురువారం లేదా శుక్రవారం వెలువడే అవకాశం ఉంది. గురువారమే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావించారు. కానీ కొన్ని పోస్టులకు వెయిటేజ్ మార్కులను కలిపే పక్రియ ఇంకా ఉండడంతో మరోరోజు పట్టవచ్చని చెబుతున్నారు. బుధవారం సాయంత్రానికి ఈ పక్రియ […]
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. దాదాపు 20 లక్షల మంది ఈ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారు. వీటి ఫలితాలు గురువారం లేదా శుక్రవారం వెలువడే అవకాశం ఉంది.
గురువారమే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావించారు. కానీ కొన్ని పోస్టులకు వెయిటేజ్ మార్కులను కలిపే పక్రియ ఇంకా ఉండడంతో మరోరోజు పట్టవచ్చని చెబుతున్నారు. బుధవారం సాయంత్రానికి ఈ పక్రియ ముగియలేదు. దాంతో వెయిటేజ్ మార్కులను కలపడం పూర్తయిన వెంటనే ఆలస్యం లేకుండా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఒక వేళ ఆ పక్రియ నేడు త్వరగా ముగిస్తే సాయంత్రమే ఫలితాలు వెల్లడించే చాన్స్ ఉంది.
మొత్తం 19 రకాల పోస్టులకు ఇటీవల పరీక్షలు నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5, రూరల్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వారి సర్వీస్ కాలం ఆధారంగా వెయిటేజ్ మార్కులు ఉంటాయని అధికారులు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
ఇప్పుడు ఆ దిశగానే అధికారులు పనిచేస్తున్నారు. కేవలం రెండు రకాల ఉద్యోగాలకు సంబంధించిన వెయిటేజ్ మార్కులను కలపడమే మిగిలి ఉంది. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగానే విడుదల చేయించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
అక్టోబర్ రెండు నుంచే గ్రామ సచివాలయాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రతి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుంది.