ఇష్టానుసారం కాంట్రాక్టు అంచనాల పెంపుకు ఇకపై చెక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన దిశగా కీలక ముందడుగు వేసింది. న్యాయపరమైన ముందస్తు సమీక్షకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇది చట్ట రూపం దాలిస్తే కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి దాదాపు ఉండదని ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లును శాసనమండలి, గవర్నర్ కూడా ఆమోదిస్తే ఏపీలో వంద కోట్లు, లేదా ఆపై విలువైన పనులన్నీ న్యాయసమీక్ష అనంతరమే కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. 100 కోట్లకు మించిన పనుల తాలూకూ టెండర్ పత్రాలను […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన దిశగా కీలక ముందడుగు వేసింది. న్యాయపరమైన ముందస్తు సమీక్షకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇది చట్ట రూపం దాలిస్తే
కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి దాదాపు ఉండదని ప్రభుత్వం చెబుతోంది.
ఈ బిల్లును శాసనమండలి, గవర్నర్ కూడా ఆమోదిస్తే ఏపీలో వంద కోట్లు, లేదా ఆపై విలువైన పనులన్నీ న్యాయసమీక్ష అనంతరమే కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. 100 కోట్లకు మించిన పనుల తాలూకూ టెండర్ పత్రాలను తొలుత న్యాయమూర్తి పరిశీలనకు పంపుతారు. అనంతరం టెండర్‌కు సంబంధించిన వివరాలను వారం రోజుల పాటు వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచుతారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారు. అలా ఏడు రోజుల్లో ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలపై న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ పరిశీలన చేస్తుంది.
న్యాయమూర్తికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు 8మంది సభ్యులతో నిపుణుల బృందం ఉంటుంది. వీరిని ప్రభుత్వమే నియమిస్తుంది. ఒకవేళ న్యాయమూర్తి ఇతర నిపుణులు కావాలని కోరితే వారిని నియమిస్తారు. వీరికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది.
న్యాయమూర్తి నేతృత్వంలోని ఈ బృందం ఎనిమిది రోజుల పాటు టెండర్లను పరిశీలించి ఆమోదించడం లేదా మార్పులను సూచించడం చేస్తుంది. అలా జ్యుడిషియరీ కమిటీ సూచించిన మార్పులు, చేర్పులు చేసిన తర్వాతే టెండర్‌ను ఫైనల్ చేస్తారు. ప్రజల నుంచి సలహా తీసుకోవడానికి వారం రోజులు, కమిటీ పరిశీలనకు ఎనిమిది రోజులు కలిపి 15 రోజుల్లో ఈ పక్రియ ముగుస్తుంది.
మరి వంద కోట్ల విలువైన పనిని ప్యాకేజీలుగా విభజించి న్యాయ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు కదా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కూడా బిల్లులో స్పష్టత ఇచ్చారు. ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ వంద కోట్లు దాటితే దాన్ని తప్పనిసరిగా న్యాయ సమీక్షకు పంపుతామని ప్రభుత్వం వివరించింది.
గతంలో ఇలాంటి పారదర్శక విధానం లేకపోవడం వల్ల కొందరు అధికారులు ఇష్టానుసారం అంచనాలు పెంచి టెండర్లు పిలిచేవారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెండర్ వివరాలను ఏడు రోజుల పాటు పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతారు కాబట్టి… అధికారులు కూడా జాగ్రత్తగానే అంచనాలను కట్టక తప్పని పరిస్థితి. భారీగా అంచనాలు పెంచేందుకు ప్రయత్నిస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆయా రంగాల్లో అవగాహన ఉన్న వారు వెంటనే న్యాయ సమీక్ష బృందానికి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంటుంది.
కొందరు దురుద్దేశంతో న్యాయ సమీక్షకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తే దాన్ని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే వెసులుబాటును కమిటీకి నాయకత్వం వహించే న్యాయమూర్తికి అప్పగించింది ప్రభుత్వం. కమిటీకి న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపిక చేస్తారు.