చంద్రబాబు గజనీ.... లోకేష్ ఘోరీ... " వైయస్ఆర్ సీపీ నేత "దాడి"
“తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గజనీ… ఆయన కుమారుడు నారా లోకేష్ ఘోరీ” అని అభివర్ణించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అవంతి శ్రీనివాస్ సన్మాన సభలో పాల్గొన్న దాడి వీరభద్రరావు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లపై విరుచుకుపడ్డారు. ఎన్నికలలో ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఖజానా ఖాళీ […]
“తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గజనీ… ఆయన కుమారుడు నారా లోకేష్ ఘోరీ” అని అభివర్ణించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు.
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అవంతి శ్రీనివాస్ సన్మాన సభలో పాల్గొన్న దాడి వీరభద్రరావు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లపై విరుచుకుపడ్డారు.
ఎన్నికలలో ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని, జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఖజానాలో పైసా కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలించిన ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని నాశనం చేశారని, సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని దాడి వీరభద్ర రావు విమర్శించారు.
ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలన ఎలా ఉంటుందో, ఎంత జనరంజకంగా ఉంటుందో చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అవంతి శ్రీనివాస్ ను విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్మానించారు.
సన్మానం అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ… మంత్రి వర్గం అంటే ఎలా ఉంటుందో జగన్ దేశానికి చూపించారని అన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు.
దేశంలో ఇంత వరకూ ఏ ముఖ్యమంత్రీ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో ప్రజలు నానా అగచాట్లు పడేలా చేశారని విమర్శించారు.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలన పారదర్శకతతో ఉంటుందని, జనరంజకమైన పాలన అంటే ఏమిటో జగన్మోహన్ రెడ్డి చూపిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.