ప్రపంచకప్ లో రిష్ట్ స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లు
భారత స్పిన్ ట్విన్స్ చాహల్, కుల్దీప్ సఫారీ తురుపుముక్క ఇమ్రాన్ తాహీర్ అప్ఘన్ జాదూ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇంగ్లండ్ లెగ్ స్పిన్ గుగ్లీ బౌలర్ అదిల్ రషీద్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఆరువారాలపాటు సాగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం…వివిధజట్లలోని స్పిన్ జాదూలు ఎనలేని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తమదైన రోజున మ్యాచ్ విన్నర్లుగా నిలవాలన్న పట్టుదలతో ఉన్నారు. బౌలింగ్ కు ఏమాత్రం అనువుకాని ఇంగ్లీష్ పిచ్ లపై భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అప్ఘన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా […]
- భారత స్పిన్ ట్విన్స్ చాహల్, కుల్దీప్
- సఫారీ తురుపుముక్క ఇమ్రాన్ తాహీర్
- అప్ఘన్ జాదూ స్పిన్నర్ రషీద్ ఖాన్
- ఇంగ్లండ్ లెగ్ స్పిన్ గుగ్లీ బౌలర్ అదిల్ రషీద్
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఆరువారాలపాటు సాగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం…వివిధజట్లలోని స్పిన్ జాదూలు ఎనలేని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తమదైన రోజున మ్యాచ్ విన్నర్లుగా నిలవాలన్న పట్టుదలతో ఉన్నారు.
బౌలింగ్ కు ఏమాత్రం అనువుకాని ఇంగ్లీష్ పిచ్ లపై భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అప్ఘన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల రిష్ట్ స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు కావాలని కలలు కంటున్నారు.
2019 వన్డే ప్రపంచకప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ స్టేడియాలలోని బ్యాటింగ్ పిచ్ లపై పరుగుల మోత మోగడానికి రంగం సిద్ధమయ్యింది.
సిక్సర్లు, బౌండ్రీలతో విరుచుకుపడుతుతూ…పరుగుల పండుగ చేసుకోడానికి ఓ వైపు బట్లర్, గేల్, బెయిర్ స్టో, రోహిత్ శర్మ,విరాట్ కొహ్లీ, క్రిస్ గేల్, యాండ్రీ రసెల్ , వార్నర్, స్మిత్ లాంటి వీరబాదుడు ఆటగాళ్లు తమతమ బ్యాట్లకు పదును పెడుతుంటే…మరోవైపు.. వివిధజట్లకు చెందిన మణికట్టు మాంత్రికులు, రిష్ట్ స్పిన్నర్లు… రకరకాల అస్త్రాలతో ఎదురుచూస్తున్నారు.
రిష్ట్ స్పిన్నర్లే కీలకం…
బౌలర్లకు ఏమాత్రం అనువుకాని ఇంగ్లీష్ పిచ్ లపై తమ అమ్ములపొదిలోని లెగ్ బ్రేక్, గుగ్లీ, టాప్ స్పిన్, ఫ్లిప్పర్ లాంటి విలక్షణ అస్త్రాలతో లెగ్ స్పిన్నర్లు సై అంటున్నారు.
ఇంగ్లండ్ తురుపు ముక్క రషీద్ ఖాన్….
హాట్ ఫేవరెట్, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు…లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ను ప్రస్తుత ప్రపంచకప్ లో ప్రధాన అస్త్రంగా ప్రయోగించనుంది.
గత నాలుగేళ్ల కాలంగా ఇంగ్లండ్ స్ట్రయిక్ బౌలర్ గా ఉన్న రషీద్..2015 ప్రపంచకప్ తర్వాత ఆడిన మ్యాచ్ ల్లో 127 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన లెగ్ స్పిన్నర్ గా నిలిచాడు.
అఫ్ఘన్ వండర్ స్పిన్నర్ రషీద్ ఖాన్…
వన్డే క్రికెట్ ప్రపంచకప్ లో రెండోసారి పాల్గొంటున్న పసికూన అప్ఘనిస్థాన్ పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో సంచలన విజయాలకు
ఎదురుచూస్తోంది. తన అమ్ములపొదిలోని ప్రధాన అస్త్రం రషీద్ ఖాన్ తో ప్రత్యర్థిజట్లకు సవాలు విసురుతోంది.
లెగ్ బ్రేక్, గుగ్లీలతో కీలక వికెట్లు పడగొట్టే రషీద్ ఖాన్ గత నాలుగేళ్ల కాలంలో ఆడిన వన్డేలలో ఏకంగా 123 వికెట్లు పడగొట్టాడు.
తమజట్టు నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు.
సఫారీ స్టార్ బౌలర్ తాహీర్
ప్రపంచకప్ సాధించాలన్న పట్టుదలతో పోటీకి దిగుతున్న సౌతాఫ్రికా జట్టు ప్రపంచ బౌలర్ నంబర్ వన్ రబాడాతో పాటు.. లెగ్ బ్రేగ్- గుగ్లీ బౌలర్ ఇమ్రాన్ తాహీర్ ను తురుపుముక్కగా ప్రయోగించబోతోంది.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు సాధించిన మొనగాడిగా నిలిచిన ఇమ్రాన్ తాహీర్ తమజట్టు జయాపజయాలలో కీలకంకానున్నాడు. గత నాలుగేళ్ల కాలంలో 92 వికెట్లు పడగొట్టిన రికార్డు తాహీర్ కు ఉంది.
ఇమ్రాన్ తాహీర్ ఏస్థాయిలో రాణించగలడన్నదానిపైనే సౌతాఫ్రికా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.
టీమిండియా ట్విన్ స్పిన్నర్స్…
ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ జట్టుగా ఉన్న టీమిండియా…రిష్ట్ స్పిన్ జోడీ యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ల జోడీతో టైటిల్ వేటకు దిగుతోంది.
గత నాలుగేళ్ల కాలంలో టీమిండియాకు ఎన్నో సిరీస్ విజయాలు అందించిన చాహల్, కుల్దీప్ జోడీకి ప్రపంచకప్ టోర్నీ అసలు సిసలు పరీక్షకానుంది. ఇప్పటి వరకూ ఆడిన వన్డే మ్యాచ్ ల్లో కుల్దీప్ యాదవ్ 87వికెట్లు పడగొట్టాడు.
కుల్దీప్ చైనామన్ స్పిన్…
23 ఏళ్ల చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన కెరియర్ లో ఆడిన మొత్తం 44 వన్డేల్లో 87 వికెట్లు పడగొట్టాడు.
అంతేకాదు…భారత్ విజేతగా నిలిచిన 29 మ్యాచ్ ల్లో కుల్దీప్ 65 వికెట్లు సాధించాడు. కుల్దీప్ వికెట్లు పడగొట్టిన ప్రతిసారీ భారతజట్టు విజయాలు సొంతం చేసుకొంది.
ఇక….భారత్ ఓడిన 12 మ్యాచ్ ల్లో కుల్దీప్ కేవలం 17 వికెట్లు మాత్రమే పడగొట్టడం చూస్తే..ఎటాకింగ్ స్పిన్నర్ గా కుల్దీప్ భారత్ బౌలింగ్ ఎటాక్ కు ఎంత కీలకమో మరి చెప్పాల్సిన పనిలేదు.
కుల్దీప్ అత్యుత్తమంగా 25 పరుగులకే 6 వికెట్లు పడగొట్టడం విశేషం. లెగ్ బ్రేక్-గుగ్లీ స్టార్ చాహల్… ఇక…27 ఏళ్ల లెగ్ బ్రేక్- గుగ్లీ బౌలర్ యజువేంద్ర చాహల్ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది.
చాహల్ తన కెరియర్ లో ఇపట్టి వరకూ ఆడిన మొత్తం 41 వన్డేల్లో 72 వికెట్లు పడగొట్టాడు. భారత్ నెగ్గిన 31 మ్యాచ్ ల్లో 67 వికెట్లు… ఓడిన 9 మ్యాచ్ ల్లో 4 వికెట్లు మాత్రమే చాహల్ సాధించాడు.
ఇద్దరూ చెలరేగితేనే…
జీవం లేని ఇంగ్లండ్ అండ్ వేల్స్ పిచ్ లపై భారత్ ప్రపంచకప్ విజేతగా నిలవాలంటే…చాహల్- కుల్దీప్ జోడీ స్థాయికి తగ్గట్టుగా రాణించక తప్పదు. ఈ ఇద్దరి జోడీ కలసి భారత్ కు 103 వికెట్లు అందించారు. కుల్దీప్ 28 వన్డేల్లో 60 వికెట్లు..చాహల్ 28వన్డేల్లో 43 వికెట్లు పడగొట్టారు.
కంగారూలకు జంపా…కివీలకు సోధీ
ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా ఆరో ప్రపంచకప్ టైటిల్ కు ఉరకలేస్తోంది. లెగ్ స్పిన్నర్ ఆడం జంపాతో ప్రత్యర్థుల పని పట్టడానికి సిద్ధమవుతోంది. ఇంగ్లండ్ వికెట్లపై జంపాను స్ట్రయిక్ బౌలర్ గా ఉపయోగించుకొనే వ్యూహాలను సిద్ధం చేసుకొంది.
మరోవైపు …ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ సైతం తన లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీతో పోటీకి సిద్ధమయ్యింది.
పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో న్యూజిలాండ్ జయాపజయాలను లెగ్ స్పిన్ -గుగ్లీ బౌలర్ సోధీ తీవ్రంగా ప్రభావితం చేయనున్నాడు. ఆరువారాలపాటుసాగే ఈ ప్రపంచకప్ టోర్నీలో ..లెగ్ స్పిన్ కమ్ రిష్ట్ స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తారా? .. వేచిచూడాల్సిందే.