ప్రపంచకప్ అర్థ శతకాలలో సచినే టాప్
ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో 15 హాఫ్ సెంచరీలు సచిన్ తర్వాతి స్థానంలో జాక్ కలిస్ ప్రపంచకప్ లో 9 హాఫ్ సెంచరీల కలిస్ 8 హాఫ్ సెంచరీల మొనగాళ్లలో అజరుద్దీన్ నాలుగేళ్లకోసారి జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనటమే జీవితలక్ష్యంగా..వివిధ దేశాల క్రికెటర్లు సాధన చేస్తూ ఉంటారు. అయితే…ప్రపంచకప్ లో పాల్గొనటమే కాదు…హాఫ్ సెంచరీలు, సెంచరీలతో చెలరేగిపోడం ద్వారా రికార్డుల్లో చేరిన క్రికెటర్లు మాత్రం అతికొద్దిమందే ఉంటారు. 1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి 2015 ప్రపంచకప్ వరకూ…అత్యధిక […]
- ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో 15 హాఫ్ సెంచరీలు
- సచిన్ తర్వాతి స్థానంలో జాక్ కలిస్
- ప్రపంచకప్ లో 9 హాఫ్ సెంచరీల కలిస్
- 8 హాఫ్ సెంచరీల మొనగాళ్లలో అజరుద్దీన్
నాలుగేళ్లకోసారి జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనటమే జీవితలక్ష్యంగా..వివిధ దేశాల క్రికెటర్లు సాధన చేస్తూ ఉంటారు. అయితే…ప్రపంచకప్ లో పాల్గొనటమే కాదు…హాఫ్ సెంచరీలు, సెంచరీలతో చెలరేగిపోడం ద్వారా రికార్డుల్లో చేరిన క్రికెటర్లు మాత్రం అతికొద్దిమందే ఉంటారు.
దటీజ్ మాస్టర్ సచిన్…
క్రికెట్ చరిత్రలోనే అసాధారణ ఆటగాడు, భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు…వన్డే ప్రపంచకప్ తో విడదీయరాని అనుబంధమే ఉంది.
1992 బెన్సన్ అండ్ హెడ్జస్ ప్రపంచకప్ నుంచి 2011 ప్రపంచకప్ వరకూ మొత్తం ఆరుటోర్నీల్లో పాల్గొన్న సచిన్ డాషింగ్ ఓపెనర్ గా హాఫ్ సెంచరీల మోత మోగించాడు.
తమ కెరియర్ లో ఆడిన ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో సచిన్ మొత్తం 15 హాఫ్ సెంచరీలు సాధించాడు. 1992 నుంచి 2011 వరకూ 45 ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడిన మాస్టర్ 2వేల 278 పరుగులు సాధించాడు. కళ్లు చెదిరే స్థాయిలో ఏకంగా 57 సగటు సైతం నమోదు చేశాడు.
సచిన్ సాధించిన మొత్తం 15 హాఫ్ సెంచరీలలో…పాక్ ప్రత్యర్థిగా మూడు, ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వేలపై రెండేసి, న్యూజిలాండ్, వెస్టిండీస్, బెర్ముడా, నెదర్లాండ్స్, ఇంగ్లండ్, కెన్యాల పైన సైతం అర్థశతకాలు బాదాడు.
మొత్తం మీద..ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
సచిన్ తర్వాతి స్థానంలో కలిస్…
సచిన్ తర్వాత అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జాక్ కలిస్ గుర్తింపు తెచ్చుకొన్నాడు. తన కెరియర్ లో 18 సంవత్సరాలపాటు ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న జాక్ మొత్తం 36 మ్యాచ్ ల్లో 9 హాఫ్ సెంచరీలు, 21 వికెట్లు నమోదు చేసి అత్యుత్తమ ఆల్ రౌండర్ గా రికార్డుల్లో చేరాడు. 1996నుంచి 2011 ప్రపంచకప్ వరకూ కలిస్ పాల్గొంటూ వచ్చాడు.
గ్రాహం గూచ్ 8 హాఫ్ సెంచరీలు…
ఇంగ్లండ్ డాషింగ్ ఓపెనర్ గ్రాహం గూచ్ ..మొత్తం 21 మ్యాచ్ లు ఆడి 8 హాఫ్ సెంచరీలతో సంయుక్త తృతీయస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం ..మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనే గూచ్ 897 పరుగులు సాధించాడు.
మార్టిన్ క్రో మ్యాజిక్…
న్యూజిలాండ్ ఆల్ టైమ్ గ్రేట్ మార్టిన్ క్రో సైతం ప్రపంచకప్ లో 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. కేవలం 21 మ్యాచ్ ల్లోనే 8 హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మార్టిన్ క్రోకే దక్కుతుంది. 1992 ప్రపంచకప్ లో మార్టిన్ క్రో విశ్వరూపమే ప్రదర్శించాడు. 448 పరుగులు సాధించాడు.
హెర్షల్ గిబ్స్ 8 హాఫ్ సెంచరీలు..
సౌతాఫ్రికా డాషింగ్ ఓపెనర్ హెర్షల్ గిబ్స్ 28 ప్రపంచకప్ మ్యాచ్ ల్లో 8 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 1999, 2003, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రమే పాల్గొన్న గిబ్స్ దూకుడుగా ఆడుతూ పరుగుల మోత మోగించిన ఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు.
ప్రపంచకప్ లో ఎనిమిదేసి హాఫ్ సెంచరీలు సాధించిన ఇతర ప్రముఖ క్రికెటర్లలో…ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు మైకేల్ క్లార్క్,ఆడం గిల్ క్రిస్ట్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్, కెన్యా కెప్టెన్ స్టీవ్ టికోలో, భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ ఉన్నారు.