20 ఏళ్లుగా పోలీసులకు సవాల్.... దొరికిన 'తెలంగాణ వీరప్పన్'

గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే దేశమంతా తెలుసు. ఒక నెట్‌వర్క్ సృష్టించుకొని కొన్ని ఏండ్ల పాటు అడవులను ఏలాడు. అలాంటి వ్యక్తే తెలంగాణలో కూడా ఉన్నాడు. అతడు ఎడ్ల శ్రీను. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడ్ల శ్రీను అంటే ఎవరు అని అనుమానంగా చూస్తారు. అదే ‘తెలంగాణ వీరప్పన్’ అంటే సామాన్యుడి నుంచి పోలీసు అధికారుల వరకు తెలుసు. రామగుండం పరిధిలో ఫెర్టిలైజర్ వ్యాపారం చేసే ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను వ్యాపారంలో […]

Advertisement
Update:2019-04-09 14:30 IST

గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే దేశమంతా తెలుసు. ఒక నెట్‌వర్క్ సృష్టించుకొని కొన్ని ఏండ్ల పాటు అడవులను ఏలాడు. అలాంటి వ్యక్తే తెలంగాణలో కూడా ఉన్నాడు. అతడు ఎడ్ల శ్రీను. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడ్ల శ్రీను అంటే ఎవరు అని అనుమానంగా చూస్తారు. అదే ‘తెలంగాణ వీరప్పన్’ అంటే సామాన్యుడి నుంచి పోలీసు అధికారుల వరకు తెలుసు.

రామగుండం పరిధిలో ఫెర్టిలైజర్ వ్యాపారం చేసే ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను వ్యాపారంలో నష్టాలు రావడంతో కలప స్మగ్లింగ్‌కు తెరలేపాడు. రాజకీయ నాయకులు, అటవీ శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకొని 20 ఏళ్లుగా ఉత్తర తెలంగాణ అడవుల నుంచి విలువైన కలపను అమ్మేస్తున్నాడు. అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక హరిత తెలంగాణ పేరుతో అటవీ సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది.

అదే సమయంలో తెలంగాణ వీరప్పన్ ఎడ్ల శ్రీను గురించి ఉన్నతాధికారులు సీఎంకు చెప్పారు. దీంతో ఎలాగైనా అతడిని అరెస్టు చేసి పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నా ఆచూకీ లేదు. రెండు నెలల నుంచి విజయవాడ, విశాఖపట్నం, అన్నవరం ప్రాంతాలు తిరిగిన శ్రీను రెండు రోజుల క్రితం భద్రాచలం చేరుకున్నాడు.

మరోవైపు ఎడ్ల శీను సేకరించిన విలువైన కలపను మంథని మండలంలోని విలోచవరం అనే గ్రామంలో దాచి పెట్టాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఇక్కడికి వెళ్లడం అంత సురక్షితం కాదని అటవీ శాఖా అధికారులు డ్రోన్ కెమేరాల సహాయంతో ఆ డంప్‌ను కనిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎడ్ల శ్రీను విలోచవరం వచ్చి డంప్‌ను మాయం చేయాలని ప్రయత్నించాడు.

ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పోలీసులు కాపుగాసి అతడిని పట్టుకున్నారు. ఎడ్ల శ్రీనుతో పాటు అతని అనుచరులు వడ్ల సంతోష్ కుమార్, మధుకర్, కిషన్, శ్రీనివాస్‌లను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. గత 20 ఏండ్లుగా అటవీశాఖ, పోలీసు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఎడ్ల శీను అలియాస్ తెలంగాణ వీరప్పన్‌ను పట్టుకున్నందుకు ఉన్నతాధికారులు అభినందించారు. ఇతడితో అనుబంధం ఉన్న రాజకీయ పార్టీ నాయకులు, పోలీసు, అటవీశాఖ అధికారుల లిస్టును ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News