ఇది ప్యాకేజా?.... చీకటి ఒప్పందమా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. ఏ రాజకీయ పార్టీకి ఎవరు మద్దతు పలుకుతున్నారో… ఎవరికి ఎవరు సహకరిస్తున్నారో మెల్లి మెల్లిగా బయటపడుతోంది. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన పవన్ కల్యాణ్ ఈ సారి తానే ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఆయన మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉండదని భావించారు. కొన్ని నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఇదే పరిస్దితి […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. ఏ రాజకీయ పార్టీకి ఎవరు మద్దతు పలుకుతున్నారో… ఎవరికి ఎవరు సహకరిస్తున్నారో మెల్లి మెల్లిగా బయటపడుతోంది.
గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన పవన్ కల్యాణ్ ఈ సారి తానే ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఆయన మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉండదని భావించారు. కొన్ని నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఇదే పరిస్దితి నెలకొంది.
గడచిన కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారంలో నాయకుల ప్రసంగాలలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులతో, జరుగుతున్న పరిణామాలతో ఎవరు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నారు, ఎవరు రహస్యంగా మద్దతు పలుకుతున్నారు అనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ ఈ ఎన్నికలలో విడిగా పోటీ చేస్తోంది. “ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి కావాలా? కానిస్టేబుల్ కుమారుడు ముఖ్యమంత్రి కాకూడదా?” అంటూ పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. గడచిన 20 రోజులుగా మాత్రం పవన్ ప్రచార శైలిలో మార్పు వచ్చింది. ఈ మార్పే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో చీకటి ఒప్పందాలపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
ప్రచారంలో భాగంగా ఓ నాయకుడు పోటీ చేస్తున్న స్థానం నుంచి మరో నాయకుడు ప్రచారం చేయడం లేదు. దీనికి ఇటీవల జరిగిన ప్రచార సభలే ఉదాహరణగా చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేయలేదు. అలాగే పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నవిశాఖ జిల్లాలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేయలేదు.
వీరిద్దరూ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేసారు. అలాగే జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేసారు.
ఇలా ఒకరి నియోజక వర్గంలోకి మరొకరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడాన్ని వారికి ఇచ్చే మద్దతు గానే పరిగణించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఇరు పార్టీల మధ్య కుదిరిన ప్యాకేజీగానే చూడాలా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.