కత్తులన్నీ ఒకే ఒరలో... అందరి లక్ష్యం ఒకటే
బెజవాడ, రేబాల, దొడ్ల, ఆనం, నల్లపరెడ్డి, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి, తిక్కవరపు… ఇవన్నీ నెల్లూరు జిల్లా అంతటికీ చిరపరిచితమైన కుటుంబాలు. రేబాల దశరథరామిరెడ్డి అసెంబ్లీ మాజీ స్పీకర్. బెజవాడ గోపాల్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రులుగా విధులు నిర్వర్తించారు. బెజవాడ గోపాలరెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా కూడా రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. అయితే కాలక్రమంలో బెజవాడ కుటుంబం, రేబాల కుటుంబం నుంచి వారసులెవరూ రాజకీయాల్లోకి రాలేదు. దొడ్ల కుటుంబీకుల వారసులు జిల్లాలో ఉన్నప్పటికీ క్రియాశీలక […]
బెజవాడ, రేబాల, దొడ్ల, ఆనం, నల్లపరెడ్డి, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి, తిక్కవరపు… ఇవన్నీ నెల్లూరు జిల్లా అంతటికీ చిరపరిచితమైన కుటుంబాలు. రేబాల దశరథరామిరెడ్డి అసెంబ్లీ మాజీ స్పీకర్. బెజవాడ గోపాల్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రులుగా విధులు నిర్వర్తించారు.
బెజవాడ గోపాలరెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా కూడా రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. అయితే కాలక్రమంలో బెజవాడ కుటుంబం, రేబాల కుటుంబం నుంచి వారసులెవరూ రాజకీయాల్లోకి రాలేదు. దొడ్ల కుటుంబీకుల వారసులు జిల్లాలో ఉన్నప్పటికీ క్రియాశీలక రాజకీయాల్లో కనిపించడం లేదు.
ఇక ప్రస్తుత ప్రధాన రాజకీయ యవనిక మీద ప్రముఖంగా కనిపిస్తున్నది ఆనం, నల్లపరెడ్డి, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి కుటుంబాలు మాత్రమే. ఆశ్చర్యం ఏమిటంటే… వాళ్లంతా ఇప్పుడు ఒకే జెండా పట్టుకోవడం, అందరూ కలిసి కట్టుగా ఒకటే అజెండాతో గెలుపు రేసులో పరుగులు తీయడం.
మేకపాటి వర్సెస్
ఒకప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెరొక పార్టీ తరఫున ముఖాముఖి పోటీ పడ్డారు. అలాగే ఆదాల ప్రభాకరరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా చెరో పార్టీ గుర్తు మీద పోటీకి దిగారు. ఇదే రాజమోహన్ రెడ్డి… వంటేరు వేణుగోపాల్ రెడ్డితోనూ పోటీ చేశారు. ఇప్పుడు వాళ్లు నలుగురూ వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్నారు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి, ఆదాల నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మేకపాటి, వంటేరు వైఎస్ఆర్‌సీపీ విజయానికి కృషి చేస్తున్నారు.
నేదురుమల్లి వారసులు
నేదురుమల్లి జీవితకాలమంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వారసురాలిగా ఆయన భార్య రాజ్యలక్ష్మి కొంతకాలం రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. నేదురుమల్లి మరణం తర్వాత ఆమె వేగం తగ్గించారు. వారసత్వాన్ని కొనసాగించడంలో వారి కుమారుడు రామ్‌కుమార్ రెడ్డి చూపించాల్సినంత చొరవ చూపించలేదనే చెప్పాలి. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొంతకాలానికే బీజేపీకి బైబై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీలో చేరినప్పటికీ తన నియోజకవర్గం టికెట్ మీద పట్టు పట్టకుండా ఎక్కడికక్కడ రాజీ పడిపోతూ ఉన్నారు. ప్రస్తుతం వెంకటగిరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి విజయానికి సహకరిస్తున్నారు.
అనంతంగా… ఆనం
ఆనం కుటుంబం కాంగ్రెస్, టీడీపీల్లో రెండుసార్లు అటూ ఇటూ మారిన తర్వాత ప్రస్తుతం వైసీపీ గూటికి చేరింది. ఆనం సోదరుల్లో పెద్దవాళ్లిద్దరూ కొంతకాలం ఏకకాలంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వివేకానంద రెడ్డి మరణం తర్వాత మాజీ మంత్రి హోదాలో రామనారాయణ రెడ్డి మాత్రమే రాష్ట్ర ముఖచిత్రంలో కనిపిస్తున్నారు. కానీ మరో ఇద్దరు తమ్ముళ్లు జయవిజయులు (కవలలు) నెల్లూరు కార్పొరేటర్లుగా హవా కొనసాగిస్తుండేవారు. ఈ సోదరులు నలుగురూ రెండు పార్టీల్లో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం వివేకానంద రెడ్డి తనయుడు రంగ్‌మయూర్ రెడ్డితోపాటు ఆనం సోదరులంతా వైఎస్ఆర్‌సీపీ గొడుగు కిందనే ఉన్నారు.
వైఎస్ఆర్సీపీ మద్దతుగా నల్లపరెడ్డి
నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కీలకమైన మంత్రి పదవులు నిర్వహించారు. తర్వాత ఎన్టీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు ప్రసన్న కుమార్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు.
ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. ఎన్టీఆర్ పోయిన తర్వాత తదనంతర పరిణామాల్లో టీడీపీలో ఇమడలేని ప్రసన్న కుమార్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ మరణంతో జగన్మోహన్‌రెడ్డికి బాసటగా నిలిచి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఇప్పుడు కోవూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.
వీళ్లే కాకుండా నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఇద్దరూ వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకులు, పార్టీ నాయకులకు మార్గదర్శనం చేస్తున్నారు.
టీఎస్ తెరవెనుక…
నెల్లూరు జిల్లాకు చెందిన మరో ప్రముఖుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. అయితే ఆయన జిల్లా క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించరు. ఒకసారి నెల్లూరు లోక్‌సభకు పోటీ చేసినప్పటికీ విజయానికి దూరంగా ఉండిపోవడంతో ఆయన తిగిరి జిల్లా వైపు చూడనే లేదు. జిల్లా రాజకీయాల్లో ఆయన పాత్ర ఉన్నట్లు జిల్లా వాసులే గుర్తించరు.
ఏడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఒక గొడుగు కింద పని చేయని ట్రాక్ రికార్డు నెల్లూరు రెడ్లది. ఒకరు ఒక పార్టీలో ఉంటే… మరో కుటుంబం ప్రత్యర్థి పార్టీలో ఉండేది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అనే నానుడిని నూటికి నూరుపాళ్లు నిజం చేస్తున్నట్లు ఉండేవారు. ఆ అభిప్రాయాన్ని చెరిపేస్తూ ఇప్పుడు అందరూ సమన్వయంతో పని చేస్తున్నారు. అందరూ వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ విజయం కోసమే పని చేస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే… బొడ్లో కత్తులు పెట్టుకుని కౌగలించుకోవడాలు కూడా లేవిప్పుడు. మనసా వాచా కర్మణా పని చేస్తున్నారు. వారిలో ఆ సమన్వయాన్నిసాధించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుంది. వైఎస్ఆర్ కూడా సాధించలేని ఈ ఐక్యత జగన్‌కు సాధ్యమైంది.
– వాకా మంజులారెడ్డి