నన్ను “పీకే” స్తారా?.... చంద్రబాబును వెంటాడుతున్న"పీకే"

దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల కంటే తానే అత్యంత సీనియర్ నాయకుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు…. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం తన సొంతమని ప్రకటించుకుంటున్న చంద్రబాబు నాయుడు…. రాజకీయంగా తనను దెబ్బతీయడం ఎవరికీ సాధ్యం కాదని మాటిమాటికీ చెప్పుకునే చంద్రబాబు నాయుడు…. అంతటి రాజకీయ నాయకుడినీ…. రెండంటే రెండు అక్షరాల పేరు వెంటాడుతోంది. ఆయన రాష్ట్రానికి చెందిన నాయకుడు కాదు… కాకలు తీరిన రాజకీయ యోధుడూ కాదు. అయినా ఆ రెండు అక్షరాల రాజకీయ […]

Advertisement
Update:2019-03-17 06:12 IST

దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల కంటే తానే అత్యంత సీనియర్ నాయకుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు…. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం తన సొంతమని ప్రకటించుకుంటున్న చంద్రబాబు నాయుడు…. రాజకీయంగా తనను దెబ్బతీయడం ఎవరికీ సాధ్యం కాదని మాటిమాటికీ చెప్పుకునే చంద్రబాబు నాయుడు…. అంతటి రాజకీయ నాయకుడినీ…. రెండంటే రెండు అక్షరాల పేరు వెంటాడుతోంది.

ఆయన రాష్ట్రానికి చెందిన నాయకుడు కాదు… కాకలు తీరిన రాజకీయ యోధుడూ కాదు. అయినా ఆ రెండు అక్షరాల రాజకీయ సలహాదారు చంద్రబాబు నాయుడుకు నిద్ర పట్టనివ్వటం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రెండు అక్షరాల నాయకుడు ఎవరనుకుంటున్నారా! అన్నట్లు ఆయన నాయకుడు కాదు. ప్రజల నాడిని పట్టుకుని వాస్తవ పరిస్థితులను వెల్లడించే ఓ సర్వే సంస్థ కు అధిపతి. ఆయనే పీకే… ప్రశాంత్ కిషోర్.

ఈయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ప్రశాంతతను దూరం చేస్తున్నాడు అంటున్నారు తెలుగుదేశం నాయకులు. అలా అనడమే కాదు… సాక్షాత్తు చంద్రబాబు నాయుడు “పీకే… పీకే… పీకే..” అంటూ ప్రతి సభలోనూ, ప్రతి సమావేశంలోనూ వైరి భక్తిని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.

ఉత్తరాదికి చెందిన ప్రశాంత్ కిషోర్ ప్రజల నాడిని పట్టుకోవడంలో విశేషమైన అనుభవం ఉన్నవారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి ఎన్నికల వేళ తన సేవలను అందించి “ఇదీ మీ పరిస్థితి… తస్మాత్ జాగ్రత్త” అని వారి రాజకీయ అడుగులకు దశా దిశా చూపించారు. ఇప్పుడు ఆయనే వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా ఉన్నారు.

గడచిన రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితిని ఎప్పటి కప్పుడు సర్వేలు చేస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవాలో జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్. రాజకీయ నాయకులు, పార్టీలలో పీకే అనే సూక్ష్మనామంతో పిలుచుకునే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే ఫలితాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు ఇబ్బందులు కలుగ చేస్తున్నాయి అంటున్నారు.

దీని వల్లే ఇటీవల చంద్రబాబు నాయుడు పాల్గొన్న అన్ని సభల్లోనూ, సమావేశాల్లోనూ పీకే పై విరుచుకు పడుతున్నారని అంటున్నారు. రాజకీయాలు తప్ప… ప్రజల నాడి తెలుసుకోవడం తప్ప మరొకటి తెలియని పీకే ఐటీగ్రిడ్స్ పై దాడులు, జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య వంటి అంశాలను ప్రస్తావించే సందర్భంలో కూడా పీకేపై చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో బీహార్ నుంచి వచ్చిన పీకే పీకే పీకే అంటూ మాటిమాటికి ప్రస్తావించడాన్ని తెలుగుదేశం నాయకులు కూడా తప్పు పడుతున్నారు.

ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే వివరాలను పరిశీలించిన చంద్రబాబు నాయుడు పీకే పై మండి పడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం నుంచి తనను “పీకే’స్తారా అనే గుబులు చంద్రబాబు నాయుడుని వెంటాడుతోంది అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News