టీమిండియా వరుస విజయాలకు ఆసీస్ బ్రేక్
విశాఖలో టీమిండియాకు కంగారూ షాక్ టీ-20లో 7 వరుస విజయాల తర్వాత టీమిండియా ఓటమి 50 వికెట్ల క్లబ్ లో జస్ ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాతో రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను …ఆతిథ్య టీమిండియా ఓటమితో ప్రారంభించింది. స్టీల్ సిటీ విశాఖలోని ACA-VDCA స్టేడియం వేదికగా ముగిసిన హోరాహోరీ సమరంలో విరాట్ సేన తుదివరకూ పోరాడి.. ఆఖరి బాల్ పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ లో కీలక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 […]
- విశాఖలో టీమిండియాకు కంగారూ షాక్
- టీ-20లో 7 వరుస విజయాల తర్వాత టీమిండియా ఓటమి
- 50 వికెట్ల క్లబ్ లో జస్ ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియాతో రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను …ఆతిథ్య టీమిండియా ఓటమితో ప్రారంభించింది. స్టీల్ సిటీ విశాఖలోని ACA-VDCA స్టేడియం వేదికగా ముగిసిన హోరాహోరీ సమరంలో విరాట్ సేన తుదివరకూ పోరాడి.. ఆఖరి బాల్ పరాజయం చవిచూసింది.
ఆసీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ కోల్టర్ నైల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరి టీ-20 బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 27న జరుగుతుంది.
మయాంక్ కు టీ-20 క్యాప్…
పంజాబ్ యువలెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే …టీమిండియా 79వ అంతర్జాతీయ టీ-20 క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.
రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా…విశాఖ ACA స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ద్వారా 21 ఏళ్ల మయాంక్ అరంగేట్రం చేశాడు.
టీ-20 క్యాప్ ను అందుకొన్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 31 పరుగులిచ్చినా కనీసం ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోయాడు.
గత సీజన్ ఐపీఎల్ తో పాటు…దేశవాళీ రంజీక్రికెట్లోనూ నిలకడగా రాణించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన మయాంక్ మార్కెండే అనూహ్యంగా టీమిండియా జట్టులో చోటు సంపాదించడమే కాదు… టీ-20 క్యాప్ ను సైతం అందుకోగలిగాడు.
విశాఖ లో కొహ్లీ ఫ్లాప్….
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ …తనకు ఎంతగానో అచ్చివచ్చిన విశాఖలోని ACA స్టేడియంలో తొలిసారిగా విఫలమయ్యాడు.
రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో… కేవలం 24 పరుగులకే అవుటయ్యాడు.
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ కావడంతో…క్రీజులోకి వచ్చిన విరాట్ కొహ్లీ… 17 బాల్స్ లో 3 బౌండ్రీలతో 24 పరుగుల స్కోరుకు… లెగ్ స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్ లో… కౌల్టర్ నైల్ పట్టిన క్యాచ్ కు అవుటయ్యాడు.
ఈమ్యాచ్ కు ముందు వరకూ…విశాఖ వేదికగా వన్డే, టెస్ట్, టీ-20 మ్యాచ్ లు ఆడిన కొహ్లీకి నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సాధించిన అరుదైన రికార్డు ఉంది.
ఆసీస్ రెండో గెలుపు….
టీ-20 క్రికెట్ ఐదోర్యాంకర్ ఆస్ట్రేలియా….భారత గడ్డపై రెండో విజయం నమోదు చేసింది. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో ఆతిథ్య టీమిండియాను కంగు తినిపించడం ద్వారా కంగారూ టీమ్ ఈ విజయం సాధించింది.
భారత్ తో భారత గడ్డపై ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిది టీ-20 మ్యాచ్ ల్లో టీమిండియా 5 విజయాలు, ఆస్ట్రేలియా 2 విజయాలు సాధించగా… ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
అశ్విన్ సరసన బుమ్రా….
టీమిండియా యువఫాస్ట్ బౌలర్ , యార్కర్ల కింగ్… జస్ ప్రీత్ బుమ్రా…టీ-20 క్రికెట్లో 50 వికెట్లు పడగొట్టిన భారత రెండో బౌలర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.
ఏసీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో..బుమ్రా తన కోటా 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
ఆట 19వ ఓవర్లో బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి 2వికెట్లు పడగొట్టడం ద్వారా కంగారూ విజయాన్ని ఆఖరి ఓవర్ వరకూ తీసుకురాగలిగాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, మిడిలార్డర్ ఆటగాళ్లు కౌల్టర్ నైల్ ల వికెట్లను బుమ్రా పడగొట్టాడు.
టీ-20 క్రికెట్ చరిత్రలో 50 వికెట్ల ఘనత సాధించిన భారత తొలిబౌలర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కాగా…. భారత తొలిఫాస్ట్ బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా రికార్డుల్లో చేరాడు.