కూటమిలో కుదరని సీటు... పాలమూరు పీఠం ఎవరిదో?
దక్షిణ తెలంగాణలో కీలకమైన జిల్లా మహబూబ్‌నగర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగు జిల్లాలుగా విడిపోయిన ఈ జిల్లా కేంద్రం ఇప్పటికీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అయితే మిగతా ప్రాంతాల్లో వర్షాభావం…. వలసలు వంటి సమస్యలు ఉన్నా…. ఈ నియోజకవర్గంలో అధిక భాగం పట్టణ ప్రాంతం కావడంతో ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంతో పాటు హన్వాడ మండలం మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం పరిధిలో ఉంది. మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక […]
దక్షిణ తెలంగాణలో కీలకమైన జిల్లా మహబూబ్‌నగర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగు జిల్లాలుగా విడిపోయిన ఈ జిల్లా కేంద్రం ఇప్పటికీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది.
అయితే మిగతా ప్రాంతాల్లో వర్షాభావం…. వలసలు వంటి సమస్యలు ఉన్నా…. ఈ నియోజకవర్గంలో అధిక భాగం పట్టణ ప్రాంతం కావడంతో ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంతో పాటు హన్వాడ మండలం మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం పరిధిలో ఉంది.
మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇది ఒకటి. ఉద్యమ కాలంలో కీలకపాత్ర పోషించిన టీజీవో నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి బరిలో దిగారు. 2014 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నాయకుడు యెన్నం శ్రీనివాస రెడ్డి పై 3,139 ఓట్ల స్వల్ప మెజార్టీతో నెగ్గారు.
అయితే ఈ సారి బీజేపీ తరపున జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి బరిలో నిలుస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో యెన్నం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక ఇక్కడ ప్రతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఓడిపోయే సయ్యద్ ఇబ్రహీం ఈ సారి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉండటం విశేషం.
ఇక మహాకూటమి తరపున ఈ సీటును టీజేఎస్ కోరినా… టీడీపీ, టీజేఎస్ మధ్య సయోధ్య కుదరక ఇరు పార్టీలు బీ-ఫామ్స్ ఇచ్చాయి. టీడీపీ తరపున ఎర్ర శేఖర్, టీజేఎస్ నుంచి జి. రాజేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు.
మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా సిట్టింగు ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ మీద కాస్త వ్యతిరేకత ఉంది. మహాకూటమి తరపున ఒకే పార్టీ నిలిచి ఉంటే గట్టి పోటీ ఇచ్చి ఉండేది. కాని టీడీపీ, టీజేఎస్ నిలబడుతుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి సిట్టింగ్ ఎమ్మెల్యేకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఇక గత ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ సారి ఎలాగైనా ఈ సీటు బీజేపీ ఖాతాలో పడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాని గత ఎన్నికల్లో బీజేపీ తరపున నిలబడిన యెన్నం ఈ సారి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటంతో బీజేపీ ఓట్లు చీలే అవకాశం ఉంది.
ఏదేమైనా ఈ సారి సిట్టింగు స్థానాన్ని కాపాడుకోవాలని టీఆర్ఎస్ కూడా క్షేత్ర స్థాయిలో బలంగా ప్రచారం చేస్తోంది. మరి ఈ పాలమూరు పీఠాన్ని అధిరోహించేది ఎవరో మరో రెండు వారాల్లో తెలిసిపోతుంది.