ఐ యామ్ బ్యూటిఫుల్...అనలేరా?
తమ అందంపై అతివల్లో శృతిమించిన సందిగ్దం మీరు చాలా అందంగా ఉన్నారు… అని ఎవరైనా ఒక అమ్మాయిని పొగిడితే మొహమాటంగా నవ్వుతూ, మాట మార్చే రోజులు కావివి. అవును నాకు తెలుసు అంటూ ఒప్పుకునేంత ఆత్మ విశ్వాసం మహిళల్లో కనబడుతోంది. అయితే ఇక్కడ ఆత్మ విశ్వాసం సరైన పదమా కాదా అనే విషయంలోనే కాస్త ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే అందంగా ఉండి తీరాలి…అదే ఆడవారికి మొదటి గుర్తింపు అనే కంపల్షన్ సైతం ఈ నాటి స్త్రీలలో బాగా […]
తమ అందంపై అతివల్లో శృతిమించిన సందిగ్దం
మీరు చాలా అందంగా ఉన్నారు… అని ఎవరైనా ఒక అమ్మాయిని పొగిడితే మొహమాటంగా నవ్వుతూ, మాట మార్చే రోజులు కావివి. అవును నాకు తెలుసు అంటూ ఒప్పుకునేంత ఆత్మ విశ్వాసం మహిళల్లో కనబడుతోంది. అయితే ఇక్కడ ఆత్మ విశ్వాసం సరైన పదమా కాదా అనే విషయంలోనే కాస్త ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే అందంగా ఉండి తీరాలి…అదే ఆడవారికి మొదటి గుర్తింపు అనే కంపల్షన్ సైతం ఈ నాటి స్త్రీలలో బాగా పెరిగింది. పెరుగుతున్న మేకప్ సామగ్రి, సర్జరీలతో అతికించుకుంటున్నకృత్రిమ అందాలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.నువ్వు ఎలా ఉన్నావో అలాగే నిన్ను నీవు అంగీకరించు…అనేది ఎప్పటికీ పాతబడని ఆత్మవిశ్వాసపు కొలమానం. దాన్ని అక్షరాలా పాటించగలిగితే ఈ ప్రపంచంలో అందవిహీనులు (ఎవరి దృష్టిలో వారు) అంటూ ఉండరు. మొత్తానికి నిత్యం మనల్ని అత్యంత ప్రభావితం చేసే ఒక వైరుధ్య అంశమిది. ఒక్కటి నిజం ఈ ప్రశ్నకు ఎవరు ఏ సమాధానం చెప్పినా..అది ఒక పూర్తి స్థాయి వాస్తవం కాబోదు… మన యాటిట్యూడ్‌కి ప్రతిబింబం మాత్రమే అవుతుంది.
సౌందర్యసాధనాల ఉత్పత్తుల తయారీ కంపెనీ డోవ్ కి ఈ విషయంలో ఒక సందేహం వచ్చింది. ఎంతమంది తమని తాము అందంగా ఉన్నామని అంగీకరిస్తారు? ఎంతమంది ఒప్పుకోలేరు అనే విషయంమీద వారు ఇటీవల పలుదేశాల్లో ఒక అధ్యయనం లాంటి ప్రయోగాన్ని చేశారు. లండన్, ఢిల్లీ, శాన్ ఫ్రాన్సిస్కో, షాంఘై తదితర ప్రాంతాల్లో ఆ కంపెనీ దీన్ని ఒక ప్రచార కార్యక్రమంగా నిర్వహించింది. కొన్ని రద్దీ ప్రదేశాల్లో పక్కపక్కనే బ్యూటిఫుల్, యావరేజ్ అని రాసి ఉన్న రెండు తలుపులను ఏర్పాటు చేసింది. దేంట్లోంచి వెళ్లాలి అనేది కేవలం మహళల ఛాయిస్ అన్నమాట. ప్రతిరోజూ ఏ గేట్‌లోంచి ఎంతమంది వెళుతున్నారు అనే విషయాన్ని ఆ కంపెనీ నమోదు చేయటం మొదలుపెట్టింది. తాను యావరేజ్ అనే తలుపు లోంచి వెళ్లాలనుకున్నా తన తల్లి తనను బ్యూటిఫుల్ అనే డోర్‌లోంచి తీసుకువెళ్లిందని ఒక టీనేజి అమ్మాయి తెలిపింది. ఆ తల్లి అందుకు సమాధానం ఇస్తూ తాము అందంగా ఉన్నామని అమ్మాయిలు తెలుసుకోవాలని చెప్పింది. యావరేజ్ తలుపులోంచి తన బాబుతో పాటు కలిసి వెళ్లిన ఒక మహిళ, ఇప్పటివరకు తన గురించి ఇతరులు అన్నమాటలను, తన గురించి తాను నమ్ముతున్నదాన్ని బట్టి ఆ తలుపులోంచి వెళ్లానని తెలిపింది. యావరేజ్ తలుపులోంచి వెళ్లిన చాలామంది తరువాత తమ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సారి ఛాన్స్ వస్తే బ్యూటిఫుల్ నుండి వెళతామన్నారు. ఈ కంపెనీ నిర్వహించిన మరొక సర్వేలో 96శాతం లండన్ మహిళలు, 86శాతం చైనా, 61శాతం అమెరికా మహిళలు తాము ఎలా కనబడుతున్నాం అనే విషయం తమని ఆందోళన పరుస్తోందన్నారు. అలాగే 56శాతం భారతమహిళలు సైతం తాము అందంగా లేమేమో అనే భయం ఉన్నట్టుగా తెలిపారు. ఇందులో చాలామంది ప్రతిమహిళలోనూ ఏదో ఒక అందం ఉంటుంది. కానీ వారు దాన్ని అంగీకరించలేరని ఒప్పుకున్నారు.