అమ్మ‌లూ ....గుర్తుంచుకోండి!

నాక్కాస్త న‌మ్మ‌క‌మివ్వు… అనే గొప్ప‌ క‌విత ఒక‌టి కవిత్వ ప్రేమికుల‌కు గుర్తుండే ఉంటుంది. ఈ ప్ర‌పంచంలో ఎంత ఖ‌రీదైన వ‌స్తువుల‌నైనా ఒక‌రికొక‌రు ఇచ్చి పుచ్చుకునే అవ‌కాశం ఉంది. కానీ మ‌న‌మీద మ‌న‌కు న‌మ్మ‌కాన్ని ఇచ్చే మ‌నుషులు అరుదుగా ఉంటారు. త‌మ మీద త‌మ‌కు న‌మ్మ‌కం, ఆత్మ విశ్వాసం ఉన్న మ‌నుషులే ఈ ప్ర‌పంచానికి కావాలి. మ‌రి అలాంటి వ్య‌క్తులు ఎక్క‌డ నుండి వ‌స్తారు? అమ్మ నుండే…అమ్మ జ‌న్మ నిచ్చిన‌ట్టే…ఆత్మ విశ్వాసాన్నీ, న‌మ్మ‌కాన్నీ ఇస్తే అలాంటి మ‌నుషులు త‌యార‌వుతారు. గోరు […]

Advertisement
Update:2018-09-28 04:55 IST

నాక్కాస్త న‌మ్మ‌క‌మివ్వు… అనే గొప్ప‌ క‌విత ఒక‌టి కవిత్వ ప్రేమికుల‌కు గుర్తుండే ఉంటుంది. ఈ ప్ర‌పంచంలో ఎంత ఖ‌రీదైన వ‌స్తువుల‌నైనా ఒక‌రికొక‌రు ఇచ్చి పుచ్చుకునే అవ‌కాశం ఉంది. కానీ మ‌న‌మీద మ‌న‌కు న‌మ్మ‌కాన్ని ఇచ్చే మ‌నుషులు అరుదుగా ఉంటారు. త‌మ మీద త‌మ‌కు న‌మ్మ‌కం, ఆత్మ విశ్వాసం ఉన్న మ‌నుషులే ఈ ప్ర‌పంచానికి కావాలి. మ‌రి అలాంటి వ్య‌క్తులు ఎక్క‌డ నుండి వ‌స్తారు? అమ్మ నుండే…అమ్మ జ‌న్మ నిచ్చిన‌ట్టే…ఆత్మ విశ్వాసాన్నీ, న‌మ్మ‌కాన్నీ ఇస్తే అలాంటి మ‌నుషులు త‌యార‌వుతారు. గోరు ముద్ద‌ల నాటినుండే అమ్మ ఈ ప్ర‌య‌త్నం చేయాలి. రోజంతా పిల్ల‌ల‌తో ఎన్నో మాట‌లు మాట్లాడే త‌ల్లులు త‌మ చిన్నారుల‌తో రోజుకి ఒక్క‌సారైనా ఈ కింది మాట‌లు చెప్పాలి. ఇవి నాన్న అభిప్రాయాలు కూడా అని వారికి అర్థ‌మ‌య్యేలా చేయాలి.

నువ్వు చేయ‌గ‌ల‌వు…ఈ మాట త‌ల్లిదండ్రుల నోటివెంట విన్న‌పుడు పిల్ల‌ల‌కు త‌మ‌పై త‌మ‌కు న‌మ్మ‌కం క‌లుగుతుంది. ల‌క్ష్యాల‌ను చూసి భ‌య‌ప‌డ‌రు. సాధిస్తామ‌నే ధీమాతో కృషి చేస్తారు. నాకు నీమీద న‌మ్మ‌కం ఉంది…త‌ల్లిదండ్రుల‌కు పిల్ల‌ల‌పై ఉన్న న‌మ్మ‌కం వారిలో ఆత్మ గౌర‌వాన్ని పెంచుతుంది. త‌మ‌కు ఈ ప్ర‌పంచంలో గౌర‌వం, అవ‌కాశాలు ఉంటాయ‌నే భ‌రోసా పెరుగుతుంది. వాటిని అందుకునే వ్య‌క్తులుగా ఎదుగుతారు.

నువ్వేమ‌నుకుంటున్నావు…పిల్ల‌ల అభిప్రాయాలు అడిగిన‌పుడు తామూ ఈ ప్రపంచంలో ముఖ్య‌మైన‌ వ్య‌క్తుల‌మ‌ని గుర్తిస్తారు. ఆలోచ‌నా శ‌క్తి పెరుగుతుంది. వారి మాట‌లు మీరు విన‌డం వ‌ల‌న త‌మ‌ప‌ట్ల తాము మంచి ఫీలింగ్ తో ఉంటారు.

నువ్వు అందంగా ఉన్నావు…. ఇలాంటి మాట‌ల‌తో అందానికి ప్రాధాన్య‌త ఉన్న ఈ స‌మాజంలో పిల్ల‌లు త‌మ ప‌ట్ల తాము సంతృప్తిగా ఉంటారు. పోలిక లేకుండా త‌మ‌లోని ప్ర‌త్యేక‌త‌ల‌ను గుర్తిస్తారు. దాంతో వారి అంతః సౌంద‌ర్యం పెరుగుతుంది.

చాలా మంచి ప‌నిచేశావు….ఈ మాట‌లు వారిని ఉత్తేజ ప‌రుస్తాయి. ఓట‌మిని త‌ట్టుకునే శ‌క్తి పెరుగుతుంది. నిన్ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా…దీంతో అమ్మానాన్న త‌మ‌ని ఎలా ఉన్నా ఆమోదిస్తార‌నే న‌మ్మ‌కం పిల్ల‌ల్లో పెరుగుతుంది. త‌ల్లిదండ్రులు త‌మ‌ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్న‌పుడు పిల్ల‌లు ఆత్మ విశ్వాసం తో ముంద‌డుగు వేస్తారు. ఫెయిల్యూర్స్ స‌హ‌జ‌మ‌ని అర్థం చేసుకుంటారు.

నీ మ‌న‌సు నాకు తెలుసు…వాళ్లు త‌మ త‌ప్పులు తెలుసుకుని బాధ‌ప‌డుతున్న‌పుడు…నీ బాధ నాక‌ర్ధ‌మైంది అని అండ‌గా నిల‌వండి. ఏదిఏమైనా త‌ల్లిదండ్రులు త‌న‌తో ఉంటార‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగించండి.

మంచి మాట‌లు అల‌వాటుగా…పిల్ల‌ల‌తో ప్లీజ్‌, సారీ, థాంక్యూ లాంటి మాట‌ల‌ను వాడండి. వారిలో హుందాత‌నం పెరుగుతుంది. మీరు త‌ప్పు చేసిన‌పుడు సారీ చెప్ప‌డం ద్వారా, అందులో ఉన్న గొప్ప‌త‌నాన్ని పిల్లల‌కు చెప్పిన‌ట్టు అవుతుంది.

ఐ ల‌వ్ యు…ఇది చాలా ముఖ్యం. పిల్ల‌లు తాము ప్రేమించ‌ద‌గిన వ్య‌క్తులుగా త‌మ‌ని తాము గుర్తించాలి. ప్రేమించ‌డం, ప్రేమ‌ని ఫీల‌వ‌డం వారికి చిన్న‌త‌నం నుండే అర్థం కావాలి.

Tags:    
Advertisement

Similar News