ఈ ప్రశ్నలు ఆడవారినే ఎందుకు అడుగుతారు?
మరో మహిళా దినోత్సవం వచ్చేసింది. ప్రతిఏటా స్కేలు పెట్టి కొలిచినట్టుగా మహిళల జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా…అనే ప్రశ్న వేసుకోవడం, ఆ దిశగా మీడియాలో వార్తలు కథనాలు రాసుకోవడం, కార్యక్రమాలు ప్రసారం చేసుకోవడం, మీటింగులు పెట్టి మాట్లాడుకోవడం…ఇవన్నీ పరిపాటిగా మారింది. అంతా బాగున్నట్టుగానే, మహిళలకు మగవారితో సమానంగా అవకాశాలు వస్తున్నట్టుగానే భావించే సమాజంలో…పునాది స్థాయిలో కూడా మార్పు రాలేదని తెలిపే సంఘటనలు ఎప్పటికప్పడు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రేప్ చేస్తున్నవాడి కాళ్లు మొక్కమని ఒకడంటాడు…బయట తిరిగితే ఇలాగే ఉంటుందని […]
మరో మహిళా దినోత్సవం వచ్చేసింది. ప్రతిఏటా స్కేలు పెట్టి కొలిచినట్టుగా మహిళల జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా…అనే ప్రశ్న వేసుకోవడం, ఆ దిశగా మీడియాలో వార్తలు కథనాలు రాసుకోవడం, కార్యక్రమాలు ప్రసారం చేసుకోవడం, మీటింగులు పెట్టి మాట్లాడుకోవడం…ఇవన్నీ పరిపాటిగా మారింది. అంతా బాగున్నట్టుగానే, మహిళలకు మగవారితో సమానంగా అవకాశాలు వస్తున్నట్టుగానే భావించే సమాజంలో…పునాది స్థాయిలో కూడా మార్పు రాలేదని తెలిపే సంఘటనలు ఎప్పటికప్పడు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రేప్ చేస్తున్నవాడి కాళ్లు మొక్కమని ఒకడంటాడు…బయట తిరిగితే ఇలాగే ఉంటుందని మరొకరు హెచ్చరిస్తారు. కడుపులు చేయండి…అని ఒక ప్రజాప్రతినిధి ఉద్బోధిస్తారు.
స్త్రీల జీవితాలను, శరీరాలను, మనసులను ఇంకా ఇంకా శోధిస్తూ, అవేవో ప్రపంచానికి అంతుచిక్కని రహస్యాల్లా భావించడం ఇప్పటికీ జరుగుతోంది. మగవారు నా జీవితం తెరచిన పుస్తకం…అంటే ఎవరూ ఏమీ అనుకోరు…కానీ ఒక స్త్రీ అలా ఉంటే మాత్రం తట్టుకునే శక్తి పురుషాధిక్య సమాజానికి ఉండదు. మహిళలు తెరచిన పుస్తకాల్లా ఉండకూడదు, గుంభనంగా గుట్టుగానే ఉండాలి (అలా ఉండాల్సిన అవసరం లేకపోయినా). అలా ఉన్నవారిని ఏవో ఒక పిచ్చి ప్రశ్నలు వేసి వేధించాలి.
మహిళలు మేము బాగానే ఉన్నాం… అని అన్నారంటే చాలామందికి భయం. ఒకేసారి నాలుగుపనులు చేస్తుంటే ఎలా చేస్తున్నారు అని అడుగుతారు, పదిమంది మగవారి మధ్య ఒక్కరే పనిచేస్తుంటే ఎలా ఫీలవుతున్నారు…అని అడుగుతారు… కెరీర్‌లో ముందుకు వెళుతుంటే ఇంటిని నిర్లక్ష్యం చేస్తున్న బాధ లేదా… అంటారు.
అంతెందుకు…కాస్త కొత్తరకం దుస్తులు ట్రై చేస్తే అదో వార్తగా మార్చేస్తారు. ఆడవారు ధరించే దుస్తులు ఎక్కడయినా వార్తే. ఒక చిన్న ఊళ్లో జరిగే పెళ్లిలో అయినా…ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో అయినా. ఏం దుస్తులు ధరిస్తున్నారు? ఏ డిజైనర్ వాటిని డిజైన్ చేశారు…అనే పశ్న అత్యంత సాధారణ ప్రశ్నలా రెడ్‌కార్పెట్‌మీద నడిచే బాలివుడ్ తారలను వెంటాడుతుంది. దీనిపట్ల వారిలో పూర్తిగా వ్యతిరేకత లేకపోయినా, మేమంటే మా దుస్తులే కాదు…అందమైన దుస్తులు ధరించిన మా శరీరాలకు తెలివైన మెదడు కూడా ఉంది. అందుకు తగిన ప్రశ్నలు కూడా వేయండి… అని ఇప్పటికే వారు చాలా గట్టిగానే అడుగుతున్నారు. రెడ్ కార్పెట్‌మీద నడిచే శరీరాలను వాటిని అల్లుకుని ఉన్న దుస్తులను, వాటితో ముడిపడి ఉన్న సెక్సిజాన్నే కాదు, కాస్త మా మనసులను కూడా చూడండి అని వారు స్పష్టంగానే చెబుతున్నారు.
గత సంవత్సరం ఆస్కార్ అవార్డుల వేడుకలో రీస్ విథర్‌స్పూన్, ఈ సాయంత్రం ఏం ధరిస్తున్నారు…అనే ప్రశ్నకు మించి ఇంకేమైనా విషయాలు మమ్మల్ని అడగండి అంటూ… యాష్‌టాగ్ ఆస్క్‌మిమోర్ కాంపైన్‌కి తన మద్ధతు పలికారు. ఇలాంటి ప్రశ్నలను సీరియస్‌గా తీసుకుంటే ఒత్తిడి కలుగుతుందని సోనాలీ బెంద్రె చెబుతోంది. ఇవి సెక్సియస్ట్ ప్రశ్నలు కాదు, వృథా ప్రశ్నలు అనేది నేహా ధూపియా అభిప్రాయం. అయితే వీటన్నింటినీ సెక్సిజంలాగే ఎందుకు చూస్తారు…మగవారు ఒక ప్యాంటు షర్టు తప్ప అదనంగా, మరింత ప్రత్యేకంగా ఏమీ ధరించలేరు. అదే స్త్రీ అయితే అలా కాదు కదా అని ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్ అన్నాడు. అలాగే స్త్రీ అందంగా ఉంటుంది కనుక ఆమెకు ఇలాంటి ప్రశ్నలు తప్పవనేది కొంతమంది అభిప్రాయం.
దుస్తుల విషయంలోనే కాదు, మహిళలకు భిన్న ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ఒక పెళ్లయిన హీరోని, హీరోయిన్‌ని అడిగినట్టుగా పిల్లలు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని అడగరెందుకని అని విద్యాబాలన్ అంటున్నారు.
కొన్నిసార్లు తమకు ఎదురయ్యే ప్రశ్నలు ఒకరకంగా ఉన్నా, వాటివెనకున్న నిగూఢార్థం వేరుగా ఉంటుందని కొన్ని రంగాల్లో పేరు సంపాదించిన మహిళలు చెబుతున్నారు. డిటెక్టివ్ రజనీ పండిట్‌ని చాలామంది, ఒక మహిళ అయిఉండి డిటెక్టివ్‌గా చాలామంది వైవాహిక జీవితాలు విచ్ఛి న్నం అవడానికి కారణం అవుతున్నారు కదా…ఏమీ అనిపించదా అని అడుగుతుంటారట. కానీ … ఒక మహిళగా మీరు శోధిస్తున్న వ్యక్తికి మెడికల్ ప్రాబ్లమ్ ఉందని ఎలా కనుగొంటారు…అనే క్యూరియాసిటీనే అసలు ప్రశ్న అని అంటున్నారామె. అలాగే వినీతా ముని అనే పర్వతాధిరోహకురాలు పర్వతాల్లో కొన్ని వారాలు, నెలలు స్నానం లేకుండా ఎలా ఉంటారు…అని అడుగుతుంటారని, వారి ఉద్దేశం మహిళలకు కావాల్సిన ప్రైవసీ ఎలా దొరుకుతుందని అడగడమేనని ఆమె అంటారు. అలాగే చిన్న గ్రూపులుగా పర్వత ప్రాంతాల్లో ఉండటం భయమనిపించదా అని అడుగుతారని, ప్రకృతిమాతకి అంత సన్నిహితంగా ఉన్నఅరుదైన, అద్భుతమైన సందర్భంలో కూడా తాము ఈ మగ ప్రపంచానికి భయపడుతూ ఉండాలని వారు భావిస్తుంటారని ఆమె అన్నారు. ఇలాంటి ప్రశ్నలేమీ మగవారికి ఎదురుకావు మరి. ఇన్ని ఉదాహరణలు కనబడుతుంటే వివక్ష లేదని ఎలా అనగలం. సాధించిన విజయాలతో పాటు ఇలాంటి వివక్షలు కూడా గుర్తుపెట్టుకుంటేనే లక్ష్యం మరింత స్పష్టంగా ఉంటుంది.
ముగింపు: అలాంటి దుస్తులు ఎవరు ధరించమన్నారు, ఇలాంటి ప్రశ్నలు ఎవరు ఎదుర్కోమన్నారు…అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి కదా….ఇది పురుషులు తయారుచేసిన ప్రపంచం. అధికారం ఇచ్చే చోట ఉన్న బాస్ అందమైన అమ్మాయిలకే ప్రాధాన్యతనిస్తుంటే చచ్చినట్టుగా అమ్మాయిలు అందంగానే కనిపించాలి. స్త్రీ మెదడుకంటే శరీరానికి గుర్తింపు ఎ క్కు వ వస్తుంటే అలాగే రూపాంతరం చెందాలి. ఎందుకంటే నచ్చిన వృత్తిలో రాణించడం, గుర్తింపు, ప్రశంసలు, డబ్బు, అధికారం, ఉనికిని నిలబెట్టుకోవడం ఇవన్నీ ప్రతిమనిషికి ఇష్టమైన విషయాలే…ఇంకా చెప్పాలంటే అవసరాలు, హక్కులు. వీ టి ని పొందే క్రమమే జీవితం. ఇవన్నీ వదులుకుంటే జీవితాన్ని వదులుకోవడమే….అందుకే స్త్రీలు ఈ పురుషాధిక్య సమాజంలో తమకు తెలియకుండానే వారి ఆలోచనలకు అనుగుణంగా బతికేస్తున్నారు…వారి మెదడులతోనే ఆలోచిస్తున్నారు.
-వడ్లమూడి దుర్గాంబ