"మజ్ను" సినిమా రివ్యూ
రివ్యూ: మజ్ను రేటింగ్: 2.75/5 తారాగణం: నాని, అనూ ఇమాన్యుయేల్, ప్రియ శ్రీ తదితరులు సంగీతం: గోపి సుందర్ నిర్మాత: గీతాగోల, పి. కిరణ్ దర్శకత్వం: విరించి వర్మ ముక్కోణపు ప్రేమ కథలు ఈనాటివి కావు. కచదేవయాని కథతో మొదలయ్యాయి. మన తెలుగు సినిమాల్లో నాగేశ్వరావు, శోభన్ బాబు ఇలాంటి కథలకి ఫేమస్. ఉయ్యాలజంపాల లాంటి అందమైన సినిమా తీసిన దర్శకుడు విరించి వర్మ దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకుని తయారుచేసుకున్న మజ్ను కథ పాత చింతకాయ పచ్చడి. ఈ మధ్యనే నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మన్ […]
రివ్యూ: మజ్ను
రేటింగ్: 2.75/5
తారాగణం: నాని, అనూ ఇమాన్యుయేల్, ప్రియ శ్రీ తదితరులు
సంగీతం: గోపి సుందర్
నిర్మాత: గీతాగోల, పి. కిరణ్
దర్శకత్వం: విరించి వర్మ
ముక్కోణపు ప్రేమ కథలు ఈనాటివి కావు. కచదేవయాని కథతో మొదలయ్యాయి. మన తెలుగు సినిమాల్లో నాగేశ్వరావు, శోభన్ బాబు ఇలాంటి కథలకి ఫేమస్. ఉయ్యాలజంపాల లాంటి అందమైన సినిమా తీసిన దర్శకుడు విరించి వర్మ దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకుని తయారుచేసుకున్న మజ్ను కథ పాత చింతకాయ పచ్చడి. ఈ మధ్యనే నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మన్ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లుంటారు. మజ్ను చూస్తుంటే అందులో కొన్ని సీన్స్ యధాతధంగా గుర్తోస్తుంటాయి. గట్టిగా యూట్యూబ్‌లో నాలుగు సినిమాలు చూస్తే రెడీ అయ్యేకథకి యువదర్శకులు ఇన్నేళ్ళు గ్యాప్ ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు.
మొదటి పదిహేను నిముషాల్లోనే ఈ సినిమా ఏ దారిలో వెళుతూవుందో అర్ధమవుతుంది. ఇంటర్వెల్‌ని బట్టి క్లైమాక్స్‌ని కూడా సులభంగానే వూహించుకోవచ్చు. అయితే అక్కడక్కడ దర్శకుడి చమత్కారం, క్రియేటివిటి మెరుస్తూ వుండడం వల్ల మరీ బోర్ ఫీల్ కాకుండా యావరేజ్ అని ప్రేక్షకుడు కుర్చీలోంచి లేస్తాడు.
మామూలు సన్నివేశాల్లో కూడా నానీ కామెడి పండించడం ఒక ప్లస్‌పాయింటైతే ఇద్దరు హీరోయిన్లు అందంగా వుండడం, బాగా నటించడం కూడా ఇంకో ప్లస్‌పాయింట్. హీరో హీరోయిన్ల మధ్యే అన్ని సీన్స్ వుండడం, మిగతా క్యారెక్టర్లకి ప్రాధాన్యత లేకపోవడంతో సినిమా నత్తనడకన నడిచినట్టనిపిస్తుంది. లవ్ స్టోరీలో ఎలాంటి సంఘర్షణ లేకపోవడం బ్రేకప్‌కి గట్టి పునాది లేకపోవడంతో ప్రేక్షకులు సినిమాలో లీనమై చూడలేని పరిస్థితి. నాని అద్భుతంగా నటించినప్పటికీ అతని విజయ యాత్రకి ఇది కాస్త స్పీడ్ బ్రేకరే.
కథ విషయానికొస్తే ఆదిత్య (నాని) ఒక అసిస్టెంట్ డైరెక్టర్. రాజమౌళి దగ్గర పనిచేస్తుంటాడు. అతను ఒక సందర్భంలో సుమ(ప్రియశ్రీ)ని చూస్తాడు. ప్రేమలో పడతాడు. నాలుగేళ్ళక్రితం జరిగిన తన ప్రేమకథని ఆమెకి చెబుతాడు.
భీమవరంలో వుండే ఆదిత్య కిరణ్మయి (అనూ ఇమాన్యుయేల్)ని చూసి వెంటనే లవ్‌లో పడుతాడు. ఆమెకోసం కాలేజీలో లెక్చరర్‌గా చేరతాడు. ఇద్దరి మధ్య లవ్. కాశీ అనే స్నేహితుడికోసం ఆదిత్య ఎక్కువ టైం కేటాయిస్తుండడంతో కిరణ్మయి పొసెసివ్ నెస్ ఫీలై గొడవపడుతుంది. పెద్ద కారణమేమిలేకుండానే బ్రేకప్. ఈ ప్రేమ కథ వినిపిస్తుండగానే నానికి కిరణ్మయిపై తన ప్రేమ ఇంకా చావలేదని అర్ధమవుతుంది. కానీ ఈ కథ విన్నతరువాత సుమ లవ్‌లో పడుతుంది. సుమ, ఆదిత్యని ప్రేమిస్తే, ఆదిత్య కిరణ్మయిని ప్రేమిస్తూ వుంటాడు.
సెకెండాఫ్‌లో ఇద్దరూ అతని లైఫ్‌లోకి వస్తే ఏమవుతుందన్నది క్లైమాక్స్. మోహన్‌బాబు అల్లరి మొగుడు దగ్గరనుంచి అనేక సినిమాలు మనకి గుర్తొస్తే అది మన తప్పుకాదు, దర్శకుడి తప్పే.
సినిమాలో రాజ్‌తరుణ్ గెస్ట్‌రోల్‌లో ఉన్నాడు. పోసాని, సప్తగిరి వున్నప్పటికీ వాళ్ళ కామెడీ ఏమీలేదు. వెన్నెలకిషోర్ ఎపిసోడ్ నవ్విస్తుంది. థియేటర్‌లో అప్పుడప్పుడు నవ్వుల హోరు వినిపించడం వల్ల సినిమా కాస్త గట్టెక్కింది.
ఫొటోగ్రఫి బావుంది. పాటలు బావున్నాయి. డైలాగులు అక్కడక్కడ షార్ప్‌గా ఉన్నాయి. ఏమైనా విరించి వర్మ-నాని కాంబినేషన్‌లో ఎక్స్‌ఫెక్ట్ చేసిన సినిమా ఇది కాదు. మజ్ను అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు. లాజిక్ పనిచేస్తే క్రియేటివిటి తగ్గుతుంది. క్రియేటివిటి పనిచేస్తే లాజిక్ తగ్గుతుంది అని ఈ సినిమాలో ఒక డైలాగుంది. మరి సినిమాలో ఏం తగ్గిందో దర్శకుడికే తెలియాలి. కాజా ఆయన తిన్నాడా, మనం తిన్నామా అనేది ప్రశ్నార్ధకం.
– జి. ఆర్. మహర్షి