తిక్క పుట్టించే సినిమా
రివ్యూ: తిక్క రేటింగ్: 1/5 తారాగణం: సాయి ధరమ్ తేజ్, లారిస్సా, రాజేంద్రప్రసాద్, సప్తగిరి, మన్నర చోప్రా, అలీ, రఘుబాబు, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, ముమైత్ ఖాన్, అజయ్, తదితరులు సంగీతం: ఎస్.ఎస్. థమన్ నిర్మాత: డా|| సి. రోహిన్‌రెడ్డి దర్శకత్వం: సునీల్‌రెడ్డి విడుదల తేదీ: ఆగస్టు 13, 2016 నిజంగా ఇది తిక్క సినిమానే… దీనికి రేటింగ్ ఇవ్వడం కూడాతిక్కతనమే అవుతుందేమో..! అప్పుడెప్పుడో బాలకృష్ణ చెప్పిన “నీకు తిక్క రేగాలేమో… నాకు అది 24 […]
రివ్యూ: తిక్క
రేటింగ్: 1/5
తారాగణం: సాయి ధరమ్ తేజ్, లారిస్సా, రాజేంద్రప్రసాద్, సప్తగిరి, మన్నర చోప్రా, అలీ, రఘుబాబు, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, ముమైత్ ఖాన్, అజయ్, తదితరులు
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నిర్మాత: డా|| సి. రోహిన్‌రెడ్డి
దర్శకత్వం: సునీల్‌రెడ్డి
విడుదల తేదీ: ఆగస్టు 13, 2016
నిజంగా ఇది తిక్క సినిమానే… దీనికి రేటింగ్ ఇవ్వడం కూడాతిక్కతనమే అవుతుందేమో..!
అప్పుడెప్పుడో బాలకృష్ణ చెప్పిన “నీకు తిక్క రేగాలేమో… నాకు అది 24 గంటలూ ఆన్ లో ఉంటుందిరా” అన్న డైలాగ్ గుర్తొస్తుంది. ఈ సినిమా చూస్తే, సినిమాకు వచ్చిన ప్రేక్షకుడికి తిక్క లేని వారికి కూడా తిక్క తెప్పిస్తుంది… అల్‌రెడీ తిక్క ఉన్న వారికి ఈ సినిమాకు వచ్చినందుకు తిక్క కుదిరేలా చేస్తుంది.
తెలుగు సినిమా రైటర్స్, దర్శకులు, సినిమా పెద్ద కుటుంబాలు ప్రేక్షకులపై పగపట్టినట్టే ఉన్నాయి. తెలుగు సినిమారంగం గొప్పతనాన్ని, తెలుగు సినీరంగం ప్రాముఖ్యం గురించి గొప్పలు కేవలం చెప్పడానికే పనికొచ్చేలాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసబెట్టి వస్తున్న (కొన్ని మంచి సినిమాలు తప్పితే వాటిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.) సినిమాలు చూస్తే అర్థమవుతుంది. తెలుగు సినిమాలంటేనే జనాలు చీదరించుకునే రోజులు ఎంతో దూరం లేవని ఇలాంటి సినిమాలు చూస్తే అర్ధమౌతుంది. రోజురోజుకు మారుతున్న టెక్నాలజీ, ఇంటర్‌నెట్, టెలివిజన్‌తో సినిమా థియేటర్లకు వచ్చే జనం చాలావరకూ తగ్గింది. ఇలాంటి సినిమాలే తీస్తే బిజీ లైఫ్ గడుపుతున్న జనాలు ఏదో వీకెండ్‌లో అహ్లాదంకోసం వస్తున్నవారు కూడా రెండున్నర గంటల సమయం దండగా, వెళ్లడం అనవసరం అని అనుకునేరోజులు చాలా దగ్గరపడ్డాయనే చెప్పాలి. తెలుగు సినిమా పరిశ్రమే కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. సినిమా రైటర్స్‌కు తోచకపోతే ఇలా స్టోరీలు రాసి జనాలపై వదిలే కన్నా రామకోటి రాసుకుంటే కాస్తయినా పుణ్యమైనా వస్తుందేమో అలోచిస్తే మంచిదేమో! సినిమా నిర్మించేవారు మొదటగా ఇన్సురెన్స్ కంపెనీతో ఇన్సురెన్స్ చేయించుకుంటారో లేదో కానీ ఖచ్చితంగా అమృతాంజన్, జెండుబాంబ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా చూశాక తల బొప్పి కట్టాల్సిందే… వీటిని కొని వాడాల్సిందే… వాళ్ల సేల్స్ పెరగాల్సిందే…
ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే సెన్సార్ బోర్డ్ పనితనం. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చిందో, బోర్డు సభ్యులకు సినిమాలమీద ఉన్న అవగాహన ఎంటో అర్ధమవుతుంది. సినిమా అనేది సామాన్య జనానికి రెండున్నర గంటల కాలక్షేపం ఒక్కటే కాదు, నిజజీవితంతో సంబంధం ఉండాలి, ఆ సినిమాలోని పాత్రలను అనుసరించే వాళ్లూ ఉంటారు.ప్రభుత్వాలు డ్రంక్ & డ్రైవ్ నేరమంటూ, దీని వల్ల జరిగే అనర్ధాల గురించి ప్రకటనలతో ప్రచారంచేసి జనాల్ని మేల్కొలుపుతుంటే, ఇలాంటి సినిమాలకు సర్టిఫికేట్ ఇచ్చి జనాల్ని బజ్జోపెడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలు సెన్సార్ బోర్డ్ సభ్యుల బుర్రకెక్కలేదు అనుకుంటా. వాళ్లకు సామాజిక పరిస్థితులమీద ఎంత అవగాహన ఉందో అర్ధమవుతుంది. సినిమాలో సగానికి పైగా హీరో డ్రంక్ & డ్రైవ్ చేస్తుంటే వాళ్లకు ఆ ప్రకటనలు గుర్తు రాలేదు అనుకుంటా..! చిన్న సినిమా అయి ఉంటే ఆ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వడం కష్టమే. ప్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన హీరో కాబట్టే ఈసినిమాకు చూసి చూడనట్టుగా సర్టిఫికేట్ ఇచ్చారనిపిస్తోంది.
ఈ సినిమా గురించి చెప్పాలంటే మెగా ఫ్యామిలీ వారసుల్లో ఒక్కడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సాయిధరమ్ తేజ్. కేవలం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకే ఒక్క కారణమే కాబోలు ఈ సినిమాకు పబ్లిసిటీ, మొదటిరోజు కలెక్షన్‌లు వచ్చాయి. మామూలు హీరో అయివుంటే ఈ సినిమాను రెండోరోజే థియేటర్లోనుంచి తీసేసేవారు. సాయిధరమ్ తేజ్ ఇదివరకు వచ్చిన సినిమాలు పరవాలేదని అనిపించినా, ఈ సినిమా కూడా బాగుంటుందనే ఆశతో వచ్చిన ప్రేక్షకుడిని తిక్క రేగేలా చెసిందనే చెప్పాలి. ఇలాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులపై వదిలితే ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా వెండితెరపై కనుమరుగవడం ఖాయం. అలాంటి వారిని ఎంతో మందిని చూశాము కూడా..! ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఇక అంతే..!
ఈ సినిమాలో చెప్పడానికి కథా, కథనం అంటూ ఏమీ లేదు. ఫస్ట్ అఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్‌తో ప్రేక్షకుల పల్స్ రేట్‌ను పడేసి అసహనానికి గురిచేశాడు. హీరో ఆదిత్య (సాయిధరమ్ తేజ్) రియల్ ఎస్టేట్ ఎనలిస్ట్ గా, హీరోయిన్ అంజలితో (లారిస్సా బోనేసి) ప్రేమ ప్లాష్ బ్యాక్ మొదలవుతుంది. “వంద మంది అమ్మాయిలతో తిరగడం ప్రేమ కాదు… ఒక్క అమ్మాయితో వంద సంవత్సరాలు గడపాలనుకోవడమే ప్రేమ… అది ఎంత కష్టమో” అనే డైలాగ్‌తో మొదలైన కథ ఎక్కడికి వెళుతుందో, థియేటర్‌లో ప్రేక్షకులను ఎక్కడికి తీసుకెళుతుందో ఈ సినిమా దర్శకుడు, హీరోకే తెలియాలి. ఈ సినిమాలో కమెడియన్స్ ఆలీ, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, పోసాని, అజయ్, రఘుబాబు వంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పటికి వాళ్లు నటించడానికి కథలేదు, కథనంలో వాళ్లు ఎప్పుడు వస్తారో… ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. థమన్ ఇచ్చిన వెస్ట్రన్ సంగీతం కొంచెం వినసొంపుగా వున్నా పాటలు అర్థం కావు. అలా ఫస్ట్ ఆఫ్ కంప్లీట్.
ఇక సెకెండ్ ఆఫ్ కూడా అంతే. ఎవరి క్యారెక్టర్లు ఎందుకు ఎప్పుడు వస్తాయో తెలీదు. పోలీస్ ఆఫీసర్‌గా పోసానికి స్టోరి అంటూ లేకపోయినా ఆయన ఎంటరైన సమయంలో ఆయనకు ఉన్నంతలో నటించాడు. రఘుబాబు(రౌడీ) అరవం బాషతో ఆకట్టుకోలేక పోయాడు. ఇక అజయ్ (మరో రౌడీ) ఆయనకు సినిమాలో నటించడానికి ఏమీ లేదు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే పాటలకోసమే తప్ప నటించడానికి ఏమీ లేదు. ముమేత్‌ఖాన్ చాలా రోజుల తరువాత ఈ సినిమాలో నటించినా ఎవరికి ఆ క్యారెక్టర్ గుర్తుండదు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటకిరీటి రాజేంద్రపసాద్ క్యారెక్టర్ (హీరో తండ్రి). రాజేంద్రప్రసాద్ ఆయన సినీ జీవితంలో ఇలాంటి క్యారెక్టర్‌లో నటిస్తానని కలలో కూడా అనుకోని ఉండరేమో… అంత చెత్త క్యారెక్టర్ కనుక..! అమ్మాయిలు, మద్యపానానికి ఎడిక్ట్ అయినవాడిగా ఇలాంటి క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నాడో ఆయనకే తెలియాలి. అక్కడక్కడ బూతు డైలాగులు, ఎవరిని ఎవరు కిడ్నాప్ చేస్తారో ఎవరికీ తెలీదు. క్లయిమాక్స్‌లో దర్శకుడు థియేటర్‌లో ప్రేక్షకుడిని కన్‌ఫ్యూజ్ చేసి సర్‌ప్రైజ్ చేద్దామని అనుకున్నారేమో కానీ ఆయనే కన్‌ఫ్యూజ్ అయి ప్రేక్షకుడు ఈ సినిమాకు వచ్చినందకు మాకు బాగా తిక్క కుదిరింది అనుకునేలా… అలా అలా… సెకండాఫ్ కంప్లీట్. కానీ ఫైనల్‌గా క్లయిమాక్స్‌లో హీరోయిన్ తండ్రి తన కూతురిని హీరో చేతిలో పెడతాడు అంతే… కథ సమాప్తం.
చెత్త తెలుగు సినిమాలకే ఈ తిక్క ఒక పరాకాష్ట అని చెప్పాలి.
-సర్వేశ్వర్ రెడ్డి