బాలివుడ్ సినిమా కలలు...ఎటిఎమ్ లూటీలు!
మనదేశంలో పేదరికం ఉంది కానీ…అది మన సినిమాల్లో కానీ, టివి సీరియల్స్లో గానీ ప్రకటనల్లో గానీ ఎక్కడా కనిపించదు. దేశంలో ఇప్పుడు చలామణిలో ఉన్న ఈ సాంస్కృతిక రూపాలన్నీ విలాసవంతంగా ఎలా బతకాలి…అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి. మరి ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న యువతరానికి అవన్నీ కావాలని అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది. అయితే అలాంటి కలలు తీవ్రంగా ఉన్నవారు డబ్బుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దొంగతనాలు చేస్తున్నారు. రాజస్థాన్లో ఇలాంటి యువకులు గ్యాంగులుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని […]
మనదేశంలో పేదరికం ఉంది కానీ…అది మన సినిమాల్లో కానీ, టివి సీరియల్స్లో గానీ ప్రకటనల్లో గానీ ఎక్కడా కనిపించదు. దేశంలో ఇప్పుడు చలామణిలో ఉన్న ఈ సాంస్కృతిక రూపాలన్నీ విలాసవంతంగా ఎలా బతకాలి…అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి. మరి ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న యువతరానికి అవన్నీ కావాలని అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది. అయితే అలాంటి కలలు తీవ్రంగా ఉన్నవారు డబ్బుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దొంగతనాలు చేస్తున్నారు.
రాజస్థాన్లో ఇలాంటి యువకులు గ్యాంగులుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. బాలివుడ్ సినిమా హీరో అయిపోవాలని…ఖరీదైన దుస్తులు, ఫోన్లు కొనుక్కుని నగరాల్లో విలాసవంతంగా జీవించాలని వారు కలలు కంటున్నారని పోలీసులు అంటున్నారు. గత కొన్ని వారాల్లోనే ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ పోలీసులు ఆ వివరాలు వెల్లడించారు.
ఈ నెల ఏడో తేదీన జైపూర్ పోలీసులు 19ఏళ్ల సౌరభ్, ధర్మేంద్రలను ఎటిఎమ్లో దోపిడి చేయాలని ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు. దొంగతనం ఎందుకు చేయాలనుకున్నారు… అని అడిగితే వారు చెప్పిన విషయాలు… పోలీసులకే దిమ్మతిరిగిపోయేలా చేశాయి. వారిద్దరూ పేద కుటుంబాల నుండి వచ్చారు. దొంగతనం చేసి డబ్బుతీసుకుని ముంబయి వెళ్లిపోయి బాలివుడ్ సినిమాల్లో ప్రయత్నించాలనుకుంటున్నామని, సెలబ్రిటీల్లా జల్సాగా బతకాలని అనుకుంటున్నామని చెప్పారు. ఇలాంటి యువత డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారని…వారి ధ్యాసంతా విలాసవంతమైన జీవనశైలిపైనే ఉంటోందని ఒక పోలీస్ అధికారి అన్నారు.
వీరంతా డబ్బుకోసం ఎటిఎమ్ మెషిన్ల దోపిడీనే మార్గంగా ఎంచుకుంటున్నారు. వీరిలో చాలామంది ఎటిఎమ్ కార్డులు లేనివారు, ఆ మెషిన్లు ఎలా పనిచేస్తాయో తెలియనివారేనని…విత్‌డ్రాయల్ బాక్స్ని బద్దలు కొట్టేస్తే డబ్బు తీసుకోవచ్చని వారు భావిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అంతకుముందు జూన్లో నలుగురు కుర్రాళ్లు ఇలాగే సికార్ జిల్లాలో ఎటిఎమ్లో దొంగతనానికి ప్రయత్నించారు. అయితే అది కుదరక వారు ఎటిఎమ్ ముందున్న గార్డుని హత్యచేశారు. పోలీసులు ఆ నలుగురిని అరెస్టు చేసినపుడు సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు ఇంకా విలాసవంతమైన వస్తువులను కొనేందుకే దొంగతనం చేయాలనుకున్నామని వెల్లడించారు.
వీరిలో చాలామంది తొలిసారి దొంగతనాలు చేస్తున్నవారేనని, నగరాలకు వచ్చిన గ్రామీణ ప్రాంతాల యువకులు ఇక్కడి జీవనశైలిని చూసి ఆకర్షితులై ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని, వారి తల్లిదండ్రులేమో పిల్లలు చదువుకుంటున్నారని అనుకుంటున్నారని…ఒక అధికారి అన్నారు.