“శ్రీరస్తు శుభమస్తు” సినిమా రివ్యూ

టైటిల్ : “శ్రీరస్తు శుభమస్తు” సినిమా రివ్యూ రేటింగ్: 2.75 తారాగణం : అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ సంగీతం : తమన్ దర్శకత్వం : పరుశురాం నిర్మాత‌లు: అల్లు అరవింద్ కుటుంబం అనే పదం భారతీయ సంస్కృతిలో విడదీయలేనిది. కుటుంబ కధా చిత్రాలకి ఎప్పుడూ ఆదరణ‌ వుంటుంది. చూసిన సినిమాలే మళ్ళీ చూసినా బోర్ కొట్టవు. ఆ ధైర్యంతోనే దర్శకుడు పరుశురాం శ్రీరస్తు శుభమస్తు తీసాడు. నేను శైలజ, బొమ్మరిల్లు […]

Advertisement
Update:2016-08-05 09:00 IST

టైటిల్ : “శ్రీరస్తు శుభమస్తు” సినిమా రివ్యూ
రేటింగ్: 2.75
తారాగణం : అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్
సంగీతం : తమన్
దర్శకత్వం : పరుశురాం
నిర్మాత‌లు: అల్లు అరవింద్

కుటుంబం అనే పదం భారతీయ సంస్కృతిలో విడదీయలేనిది. కుటుంబ కధా చిత్రాలకి ఎప్పుడూ ఆదరణ‌ వుంటుంది. చూసిన సినిమాలే మళ్ళీ చూసినా బోర్ కొట్టవు. ఆ ధైర్యంతోనే దర్శకుడు పరుశురాం శ్రీరస్తు శుభమస్తు తీసాడు. నేను శైలజ, బొమ్మరిల్లు సినిమాలను అటుఇటు మిక్సీ లో ఆడించాడు. కొంత సక్సెసయ్యాడు. కొంత విఫలమయ్యాడు. సినిమా పడిపోతూ లేస్తూ వుటుంది. క్లైమాక్స్ లో సినిమా నిలబడింది.

మధ్య తరగతి అమ్మాయిలు డబ్బున్న అబ్బాయిలకు వలవేసి పెళ్ళిచేసుకుంటారని ప్రకాశ్ రాజ్ నమ్మకం. పెద్దకొడుకు ప్రేమపెళ్ళిని ఆయన ఇష్టపడడు. కోడలు ఇంట్లో ఉండడానికి అభ్యంతరం లేదుకాని ఆమెతో మాట్లాడడు, చూడడు. రెండో కొడుకు అల్లు శిరీష్ లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తాడు. కాశ్మీర్ లో ఆమెని చూసిన తొలిక్షణమే ప్రేమిస్తాడు. ప్రమాదానికి గురైన ఆమెని రక్షించి ఆస్పత్రిలో చేరుస్తాడు. తనని రక్షించింది శిరీషేనని హీరోయిన్ కి తెలియదు. సినిమా అయిపోయేవరకూ కూడా తెలియదు. అందువల్ల ఈ సీన్ సినిమాలో ఎందుకు ఉందో మనకి అర్ధంకాదు.

రెండో కొడుకు ప్రేమవిషయం తెల్సిన ప్రకాశ్ రాజ్ ఎగతాళి చేస్తాడు. ఆ అమ్మాయి నీ డబ్బును ప్రేమిస్తుందే కాని నిన్ను కాదు అంటాడు. దాంతో తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా హీరోయిన్ కి పరిచయమవుతాడు. హీరోయిన్ కి తండ్రి అంటే చాలా ప్రేమ. తండ్రి (రావు రమేష్) మాట జవదాటదు. ఇంటర్ వెల్ సమయానికి ఆమె హీరోని ప్రేమిస్తుంది. ఆ విషయం చెబుదామనుకునేలోగా తండ్రి ఒక సంబంధం ఫిక్స్ చేస్తాడు.తండ్రికోసం ఒప్పుకుంటుంది. హీరో అంటే ఇష్టం లేదని చెబుతుంది.

సెకండాఫ్ లో హీరోయిన్ ఇంట్లో హీరో చేరి పెళ్ళి పనులు చూస్తూవుంటాడు. ఆ తరువాత ఓ డజన్ సినిమాల్లో చూసిన సన్నివేశాలు మళ్ళిమళ్ళీ వస్తూవుంటాయి. చివరలో బొమ్మరిల్లు తరహా క్లైమాక్స్. ఈ సినిమా బలమంతా హీరోయిన లావణ్య త్రిపాఠినే. ఆమె చాలా అద్భుతంగా నటించింది. శిరీష్ కొన్ని చోట్ల తేలిపోయినట్టు అనిపించినా క్లైమాక్స్ లో మెచ్యూర్డ్ గా చేసాడు.

తండ్రి పాత్రల్లో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ఎంత గొప్పగా నటిస్తారో మనకు తెలుసు. తల్లిగా సుమలత ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. సినిమా శుభ్రంగా వుండడానికి కారణం అనవసరమైన్ హీరోయిజం లేకపోవడమే. హీరో అతి సాధారణంగా వుంటాడు. మనం ఆ పాత్రను ప్రేమిస్తున్నప్పుడు సరిగ్గా ఆల్లువారి అబ్బాయి, అక్కినేని కుర్రాడు అని పాటలు పెట్టి వాళ్ళెవరో గుర్తుచేసి మూడ్ చెడగొట్టదం మనసినిమాల అలవాటు. అదృష్టవశాత్తు అలాంటి పాటలు లేవు. హీరో గుణగణాలు పొగుడుతూ ఇంట్రడక్షన్ సాంగ్ కూడాలేదు. అయితే వెడ్డింగ్ ప్లానర్ గా వున్న అలీరూపంలో అల్లు అర్జున్ ఫోటో చూపించి దర్శకుడు సరదా తీర్చుకున్నాడు.

అలి కామెడి అక్కడక్కడ బాగుంది. ఒక మంచి సినిమా తీయడానికి ఫిక్స్ అయిన డైరెక్టర్ అక్కడక్కడ డబుల్ మీనిం డైలాగులు ఎందుకు ప్రయోగించాడో అర్ధంకాదు. పాటలు, ఫోటోగ్రఫి బాగుంది. నటుడిగా నిలదొక్కుకోవడానికి శిరీష్ కి ఈ సినిమా ప్లస్. ఫస్టాఫ్ లో ప్రభాస్ సీను కామెడీ బాగుంది. క్లైమాక్స్ లో ఆడియన్స్ కనెక్టైతే సినిమా బాగా ఆడుతుంది. లేదంటే యావరేజ్.

-జీఆర్. మహర్షి

Also Read “పెళ్ళి చూపులు” సినిమా రివ్యూ

 

Tags:    
Advertisement

Similar News