ప్రాంతీయ నగల దుకాణాల దెబ్బకు... రిలయన్స్ వెనుకంజ!
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వ్యాపార సంస్థ తమ బంగారు నగల దుకాణాలను మూసేందుకు సిద్ధమవుతోంది. ఈ రిటైల్ మార్కెటింగ్ సంస్థ స్థానికంగా ఉన్న బంగారు నగల వ్యాపారులతో పోటీ పడలేక పోవటంతో నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 50 కి పైగా బంగారు షాపులను నెలకొల్పి నిర్వహిస్తోంది. అయితే ఇది బంగారు వ్యాపారం నుండి విరమించుకునే క్రమంలో ఇప్పటికే 10 నగల దుకాణాలను మూసేసింది. ఇందులో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న షాపులు […]
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వ్యాపార సంస్థ తమ బంగారు నగల దుకాణాలను మూసేందుకు సిద్ధమవుతోంది. ఈ రిటైల్ మార్కెటింగ్ సంస్థ స్థానికంగా ఉన్న బంగారు నగల వ్యాపారులతో పోటీ పడలేక పోవటంతో నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 50 కి పైగా బంగారు షాపులను నెలకొల్పి నిర్వహిస్తోంది. అయితే ఇది బంగారు వ్యాపారం నుండి విరమించుకునే క్రమంలో ఇప్పటికే 10 నగల దుకాణాలను మూసేసింది. ఇందులో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న షాపులు కూడా ఉన్నాయి.
దక్షిణ ముంబయిలో అంబానీ 27 అంతస్తుల భవనానికి దగ్గరలో ఉన్నస్టోరు, కోల్కతాలో పార్క్స్ట్రీట్లో ఉన్న అతిపెద్ద షోరూములను కూడా మూసేశారు. వచ్చే రెండేళ్లలో ఈ వ్యాపారం నుండి పూర్తిగా తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానికంగా పాతుకుపోయి, నమ్మకంతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థల ధాటికి నిలబడలేకే రిలయన్స్ తన రిటైల్ బంగారు నగల దుకాణాలను మూసేస్తోందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు.
మనదేశంలో 3.5లక్షల కోట్ల రూపాయల బంగారు నగల మార్కెట్ ఉందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్వెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ చెబుతోంది. కేరళకు చెందిన కల్యాణ్, ఢిల్లీకి చెందిన పిసి జ్వెల్లర్స్, కోల్కతా సెంకో, ముంబయిలోని త్రిభువన్ దాస్ భీమ్జీ జవేరి…తదితర కంపెనీలు తమ సత్తా చాటుతుండగా రిలయన్స్ రిటైల్ వాటి పోటీకి తట్టుకుని నిలబడలేకపోతున్నది. ఇవి కాక టాటా గ్రూపు నుండి వచ్చిన తనిష్క్ నగల దుకాణాలు దేశవ్యాప్తంగా పేరు పొందాయి. 2008లో లూథియానాలో మొదటి షాపుతో రిలయన్స్ రిటైల్ బంగారం వ్యాపారంలోకి వచ్చింది. అయితే గత రెండేళ్లుగా రిలయన్స్ రిటైల్… బంగారమే కాదు. ఫర్నిచర్, నిత్యావసరాల షాపులను సైతం మూసేస్తూ వస్తోంది. దేశంలో అతిపెద్ద రిటైల్ వ్యాపార సంస్థగా పేరుపొందిన రిలయన్స్ రిటైల్, 679 నగరాల్లో 3,383 స్టోరులను నడుపుతోంది.