మొత్తానికి డిగ్గీ ఒప్పేసుకున్నారు!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ చాలా కాలానికి నిద్రలేచారు. ఇంతకాలం తమ పార్టీ జనంలోకి వెళ్లడం లేదన్న విషయాన్ని చాలా ఆయన ఆలస్యంగా గుర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా వెంటనే జనంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఎప్పుడూ గాంధీభవన్‌లోనే ఉండకూడదని టీపీసీసీ చీఫ్ కు హితబోధ చేశారు. మొత్తానికి తమ పార్టీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడటం లేదన్న విషయాన్ని డిగ్గీ రాజా చాలా ఆలస్యంగా గుర్తించినట్లు […]
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ చాలా కాలానికి నిద్రలేచారు. ఇంతకాలం తమ పార్టీ జనంలోకి వెళ్లడం లేదన్న విషయాన్ని చాలా ఆయన ఆలస్యంగా గుర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా వెంటనే జనంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఎప్పుడూ గాంధీభవన్‌లోనే ఉండకూడదని టీపీసీసీ చీఫ్ కు హితబోధ చేశారు. మొత్తానికి తమ పార్టీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడటం లేదన్న విషయాన్ని డిగ్గీ రాజా చాలా ఆలస్యంగా గుర్తించినట్లు ఉంది. ఎప్పుడూ గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లు, లేదా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాలం వెళ్లదీస్తున్నారు. రెండేళ్లలో నేతలు ఐక్యంగా పోరాడిన సందర్భాలు చాలా తక్కువ. ఈ విషయంలో డిగ్గీ చాలా ఆలస్యంగా మేల్కోన్నారని అనిపిస్తోంది.
పార్టీలో సమస్యల్ని అధిష్టానం చాలా ఆలస్యంగా గుర్తించిందని డిగ్గీ అంగీకరించారు. అందుకే, ఇప్పటికైనా మేల్కోవాలని రాష్ట్ర నాయకులకు సూచించారు. పార్టీ అంతర్గత సమస్యల్ని పరిష్కరిచండంలో రెండేళ్లు ఆలస్యమైందని చెబుతున్న డిగ్గీ ఇంతకాలం ఏం చేశారు? అన్న విషయం ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక.. సులువుగా గెలుస్తామనుకున్న కాంగ్రెస్ పార్టీకి 2014 సార్వత్రిక ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. తరువాత వచ్చిన రెండు పార్లమెంటు, రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బొక్క బోర్లా పడింది. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార పార్టీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. మరోవైపు పార్టీ నుంచి ఎన్నికైన నాయకులు అధికార పార్టీకి వెళుతుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేకపోయారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది డిగ్గీ వ్యవహారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా త్వరలోనే ఆయన పదవీకాలం ముగిసిపోనుంది. ఆ తరువాత ఆయన స్థానంలో కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సమయంలో కార్యకర్తలకు, టీపీసీసీ చీఫ్ జ్ఞానబోధ చేయడం విచిత్రంగా ఉందని సొంతపార్టీ నేతలే అంటున్నారు. ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ విధానాల్లో లోపాలను ఎండగట్టలేకపోయామని, దీనికి నేతల అనైక్యతే కారణమని ఇప్పటికైనా డిగ్గీ గుర్తించడంపై సీనియర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలకు వీడుకోలు పలకనున్న ఈ సమయంలో డిగ్గీ వ్యాఖ్యలను ఎంతమంది సీరియస్‌గా తీసుకుంటారు? అన్న విషయంలోనూ పలు అనుమానాలున్నాయి.