హరీశ్ మాటలతో ఇరుకునపడ్డ బాబు
భూనిర్వాసితుల చెల్లింపు విషయంలో టీడీపీ అనుసరిస్తోన్న రెండుకళ్ల సిద్ధాంతంపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలతో ఏపీ సీఎం చంద్రబాబు ఇరుకునపడ్డారు. ఏపీలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా.. రైతుల నుంచి వేలాది ఎకరాలు బలవంతంగా సేకరించి.. ఇక్కడికొచ్చి అదే చట్టం ప్రకారం.. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం ఏంటని హరీశ్ వేసిన ప్రశ్నకు తెలుగుదేశం నేతలు దిక్కులు చూస్తున్నారు. ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా వ్యవహరించే చంద్రబాబు కపట నాటకాలు ఇక్కడ సాగవని హరీశ్‌రావు స్పష్టం చేశారు. […]
Advertisement
భూనిర్వాసితుల చెల్లింపు విషయంలో టీడీపీ అనుసరిస్తోన్న రెండుకళ్ల సిద్ధాంతంపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలతో ఏపీ సీఎం చంద్రబాబు ఇరుకునపడ్డారు. ఏపీలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా.. రైతుల నుంచి వేలాది ఎకరాలు బలవంతంగా సేకరించి.. ఇక్కడికొచ్చి అదే చట్టం ప్రకారం.. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం ఏంటని హరీశ్ వేసిన ప్రశ్నకు తెలుగుదేశం నేతలు దిక్కులు చూస్తున్నారు. ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా వ్యవహరించే చంద్రబాబు కపట నాటకాలు ఇక్కడ సాగవని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రాజెక్టులు అడ్డుకోవడానికి చేస్తోన్న కుట్రలు ఇప్పటికైనా ఆపాలని, ఎవరెన్ని కుట్రలు పన్నినా మల్లన్నసాగర్ కట్టి తీరుతామని స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో రేవంత్ రెడ్డి దీక్ష, ఇతర నేతల కామెంట్లపై ఆయన ఘాటుగా స్పందించారు. అలాంటి తెలుగుదేశం నేతలంతా చంద్రబాబు బ్రోకర్లు, శిఖండులుగా అభివర్ణించారు. నాడు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నాడు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు నిత్యం కుట్రలు చేస్తూనే ఉన్నాడని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
మల్లన్నసాగర్ విషయంలో టీడీపీది ద్వంద వైఖరి అని ఆయన దుయ్యబట్టారు. ఏపీలో ఒకరకంగా పరిహారం చెల్లిస్తూ.. తెలంగాణలో మరో రకంగా పరిహారం చెల్లించాలని ఉద్యమాలు చేయడం ఆపార్టీ రెండు కళ్ల సిద్ధాంతానికి నిదర్శనం అన్నారు. తెలంగాణలో రైతులకు జరిగేది అన్యాయమైతే.. ఏపీలో ఇప్పటికే 34 వేల ఎకరాలు లాక్కున్నదానిపై నోరు మెదపరెందుకు? అని ఆయన ప్రశ్నించారు. 2013 చట్టం ప్రకారం..చెల్లింపులు వద్దని కేంద్రానికి లేఖరాసింది మీరు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ చట్టాన్ని ఎత్తేయడానికి బీజేపీ బిల్లు పెడితే.. టీడీపీ మద్దతివ్వలేదా? ఇప్పుడు ఏముఖం పెట్టుకుని ఇక్కడ అదే చట్టాన్ని అమలు చేయాలని అడుగుతున్నారు? అని నిలదీశారు. మేం మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు మెరుగైన సాయాన్ని అందిస్తూనే ఉన్నాం. ప్రతి ఎకరాకు రూ.7లక్షలు, డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇతర సదుపాయాలు కల్పిస్తాం అని చెబుతుంటే.. దీనిపై టీడీపీ రాద్దాంతం తగదని హితవు పలికారు. మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల ఐదు గ్రామాలు ముంపునకు గురైనా తెలంగాణలోని మెదక్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు పూర్తిగా సస్యశ్యామలమవుతాయన్నారు. ఆరునూరైనా మల్లన్న ప్రాజెక్టును కట్టి తీరుతామని, ఏడాదిన్నరలోగా నీళ్లందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
Advertisement