అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ పైకి

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Advertisement
Update:2024-11-27 17:47 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ.. చివరికి లాభాల్లో స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మన మార్కెట్‌కు కలిసి వచ్చింది.

సెన్సెక్స్‌ ఉదయం 80,11.03 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. పొద్దున కొద్దిసేపు ఒడుదొడుకులను ఎదుర్కొన్నది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో కొనసాగింది. చివరికి 230 పాయింట్ల లాభంతో 80,234 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 80 పాయింట్ల లాభంతో 24,274.90 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.44గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.33 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2673 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ముగిశాయి. టైటాన్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టపోయాయి.

అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ నేడు రాణించాయి. తమ గ్రూప్‌ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై ఆ గ్రూప్‌ వివరణ ఇచ్చిన నేపథ్యంలో సుమారు అన్ని స్టాక్స్‌ లాభాల్లో ముగిశాయి. అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ 20 శాతం చొప్పున లాభపడగా.. అదానీ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు 10 శాతం చొప్పున రాణించాయి. మిగిలిన షేర్లూ ఓ మోస్తరుగా లాభపడ్డాయి. 

Advertisement

Similar News