టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటాపోటి ?
టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి త్వరలో ఉత్తమ్ కుమార్ వైదొలుగుతున్నాడన్న ప్రచారం ఊపందుకుంది. ఈ వార్త విశ్వసనీయత ఎలా ఉన్నా.. తరువాత అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందన్న చర్చ మాత్రం కాంగ్రెస్ ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురింపజేసేలా చేస్తోంది. కాంగ్రెస్ తదుపరి బాస్ ఎవరన్న దానిపై గాంధీభవన్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదేసమయంలో ఓ ఆసక్తికర ప్రచారం మొదలైంది. అదేంటంటే.. తెలంగాణ రాష్ట్ర నూతన టీపీసీసీ అధ్యక్ష పదవి ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గానికే దక్కనుందన్నది […]
టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి త్వరలో ఉత్తమ్ కుమార్ వైదొలుగుతున్నాడన్న ప్రచారం ఊపందుకుంది. ఈ వార్త విశ్వసనీయత ఎలా ఉన్నా.. తరువాత అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందన్న చర్చ మాత్రం కాంగ్రెస్ ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురింపజేసేలా చేస్తోంది. కాంగ్రెస్ తదుపరి బాస్ ఎవరన్న దానిపై గాంధీభవన్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదేసమయంలో ఓ ఆసక్తికర ప్రచారం మొదలైంది. అదేంటంటే.. తెలంగాణ రాష్ట్ర నూతన టీపీసీసీ అధ్యక్ష పదవి ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గానికే దక్కనుందన్నది దాని సారాంశం. అది కూడా హైదరాబాద్‌కు చెందిన నేత,
పార్టీకి అత్యంత విధేయుడు, ఆర్థిక, అంగబలం ఉన్న నేత అని సమాచారం.
ఇప్పటికే టీపీసీసీ రేసులో తొలిసారిగా వినిపించిన పేరు డీకే అరుణ. ఈ విషయమై పార్టీ డీకే అరుణ అభిప్రాయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, పార్టీ పగ్గాలు చేపట్టేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ, దానికి ఇది సమయం కాదని అరుణ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా టీపీసీసీ బరిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ పగ్గాలు తనకు అప్పగిస్తే.. తప్పకుండా మార్పు సాధించి చూపెడతానని ఆమె ధీమాగా ఉన్నారట. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ తాము బరిలో ఉన్నామంటూ.. ఇప్పటికే మీడియా ముందే ప్రకటించారు. అధిష్టానం ఆశావహుల ఆలోచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది.
అధిష్టానం తెలంగాణలో పార్టీ పరిస్థితిపై మాత్రం తీవ్ర ఆందోళనలో ఉంది. ఇక్కడ సీనియర్లు, జూనియర్లు, రెడ్డి-బీసీలంటూ నిట్టనిలువునా చీలిపోయారు. దీంతో పార్టీలో అనైక్యత రాజ్యమేలుతోంది. ప్రశాంత్ కిశోర్ సూచనలు ఇంతవరకూ అమలు కాలేదు. పార్టీలో యువనాయకులకు పెద్దపీట వేయలేదు. గ్రామస్థాయి నుంచి ప్రక్షాళన చేపడతామని ఇటీవల తీర్మానించినా.. ఇంకా అమలు చేయడం లేదు. పార్టీ సంక్లిష్ట స్థితిని చూసి వీటన్నింటిని ఎదుర్కొనే సత్తా ఉన్న మరో రెడ్డిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఆయన నియామకానికి అడ్డంకులు తొలగి త్వరలోనే ఆ పేరు బయటికి వస్తుంది. లేదంటే.. పైనున్న ఆశావహుల్లో ఎవరినైనా పదవి వరించవచ్చు.