ఉత్సవం కాదు... ఉత్పాతం
టైటిల్ : బ్రహ్మోత్సవం రేటింగ్: 2.0 తారాగణం : మహేష్ బాబు, సమంత, కాజల్ , జయసుధ, పోసాని తదితరులు సంగీతం : మిక్కిజేమేయర్ దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల నిర్మాత : ప్రసాద్ వి. పొట్లూరు, మహేష్ బాబు నాగరికత పుట్టినప్పటినుంచి మనుషులు ఒక ఊహాజనిత స్వర్గాన్ని కోరుకుంటున్నారు. దీన్నే ఉటోపియా అంటారు. అందరూ బాగుండాలని, కుటుంబాలతో సంతోషంగా వుండాలని అందరూ మనసులో ఆశపడతారు. కానీ వాస్తవం వేరుగా ఉంటుంది. ఎందుకంటే పదిమంది శాంతిని కోరితే ఒకడు యుద్ధాన్ని కోరి మిగిలిన […]
టైటిల్ : బ్రహ్మోత్సవం
రేటింగ్: 2.0
తారాగణం : మహేష్ బాబు, సమంత, కాజల్ , జయసుధ, పోసాని తదితరులు
సంగీతం : మిక్కిజేమేయర్
దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత : ప్రసాద్ వి. పొట్లూరు, మహేష్ బాబు
నాగరికత పుట్టినప్పటినుంచి మనుషులు ఒక ఊహాజనిత స్వర్గాన్ని కోరుకుంటున్నారు. దీన్నే ఉటోపియా అంటారు. అందరూ బాగుండాలని, కుటుంబాలతో సంతోషంగా వుండాలని అందరూ మనసులో ఆశపడతారు. కానీ వాస్తవం వేరుగా ఉంటుంది. ఎందుకంటే పదిమంది శాంతిని కోరితే ఒకడు యుద్ధాన్ని కోరి మిగిలిన వాళ్ళ శాంతిని పోగొడతాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి ఊహాజనిత స్వర్గమంటే ఇష్టం. నలుగురితో కలిసి వుండాలని కుటుంబవిలువలతో జీవించాలని ఆయన ఆశపడతాడు. అందుకే సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా తీశాడు. అది బావుంది. దానికి ఎక్స్‌టెన్షనే బ్రహ్మోత్సవం. ఇది శ్రీకాంత్ అడ్డాలకి మాత్రమే బావుంటుంది. జనాలకి బావుండదు. దర్శకుడికి కుటుంబవిలువలపై అపారమైన గౌరవముంటే ఆయన కథ రాసుకోవచ్చు. కవిత్వమైతే ఇంకా సులభం. టైంవుంటే వేదికలెక్కి ఉపన్యాసం ఇచ్చుకోవచ్చు. అంతేకానీ కోట్లాది రూపాయల జనం డబ్బుని ఇలా వృధాచేయడం కరెక్ట్‌కాదు. మహేష్ బాబుకి వున్న ఇమేజ్‌ని చూసి ఉదయాన్నే సినిమాకి వెళ్ళిన వేలాదిమందిని బలిచేయడం శ్రీకాంత్‌కి న్యాయం కాదు.
ఇందులో కథంటూ ఏమీలేదు. సత్యరాజ్ గొప్పవాడు, ఆయన కొడుకు మహేష్ గొప్పవాడు అని సినిమా మొత్తం అన్ని పాత్రలు చెబుతూ వుంటాయి. వాళ్ళేం గొప్పపనులు చేసారో మనకెక్కడా అర్థం కాదు. సినిమా ప్రారంభంలోనే ఒక పెద్ద గుంపుని డైరెక్టర్ పరిచయం చేస్తాడు. కృష్ణవంశీ సినిమాలోని ఒక గ్రూప్ ఫొటోలాంటి ఫ్యామిలీని మన కళ్ళముందు వుంచేసరికి పదినిముషాలు అయిపోతాయి. తరువాత ఒక గ్రూప్‌సాంగ్, ఆ తరువాత కాజల్ ఆస్ట్రేలియా నుంచి వస్తుంది. కథ ముందుకి వెళుతుందని ఆశపడతాం. అదేంలేకుండా పసుపుకొమ్ములు దంచుతూ ఒక పాట స్టార్టవుతుంది. వెంటనే వెంకటేశ్వరస్వామి కళ్యాణం సీన్. అబ్బాయి తరపున కొందరు, అమ్మాయితరపున మరికొందరు గ్రూప్‌గా కూచుని వధూవరుల గుణగణాల గురించి చర్చించుకుంటారు. సత్యరాజ్ పెయింట్స్ ఫ్యాక్టరీని నడుపుతూ వుంటాడు. ఆ ఫ్యాక్టరీని కొనడానికి జయప్రకాష్‌రెడ్డి వస్తాడు. అమ్మాడానికి సత్యరాజ్ ఇష్టపడడు. ఈ పాయింట్ దగ్గర కథ మలుపుతిరుగుతుందని ఆశపడతాం. దర్శకుడు అదేం పట్టించుకోడు. కాజల్‌తో మహేష్ మట్లాడుతూ వుంటాడు. ఇద్దరూ అభిప్రాయాలు పంచుకుంటూ వుంటారు. అందరూ కలిసి టూర్ వెళ్ళి ఒక పాట పాడుతారు. ఇంతమంది జనం వున్న కుటుంబంతో తాను ఇమడలేనని కాజల్ బ్రేక్ అప్ చెబుతుంది. తన కూతుర్ని మహేష్‌కి ఇవ్వాలని ఆశపడిన మేనమామ రావురమేష్ కోపంతో సత్యరాజ్‌ని తిడతాడు.
సెకెండాఫ్‌లో సమంతా వస్తుంది. మహేష్ తన పూర్వీకుల గురించి తెలుసుకోడానికి సమంతాతో కలిసి దేశమంతా తిరుగుతాడు. దూరపు బంధువులందరిని కలుసుకుంటాడు. క్లైమాక్స్‌లో రావురమేష్ పిలవకపోయినా ఆయన కూతురి పెళ్ళికి మహేష్ వెళ్ళడంతో శుభం కార్డు పడుతుంది. ఈ కథ మనకెందుకు కనెక్ట్‌కాదంటే ఇందులో ఎలాంటి డ్రామాలేదు. సంఘర్షణలేదు. ప్లెయిన్‌గా నడుస్తుంది. సినిమాలో బోలెడంతమంది పెద్దనటులున్నారు. అందరూ అద్భుతంగా నటించారు. రేవతి, జయసుధ, తులసి, సీనియర్ నరేశ్, షాయాజీషిండే, ముకేశ్ రుషి, నాజర్, శరణ్య, పోసాని…. ఇలా ఇంతమంది వుంటే సినిమా ఎంత గొప్పగా వుండాలి. అదేంలేదు.
సినిమాలో అంతర్లీనంగా ఫిలాసఫివుంది. మంచి డైలాగులున్నాయి. కానీ సినిమా నిలబడదు. దీనికి కారణం దర్శకుడి గందరగోళమే. ఇంతమంది నటులుండడమే దీని మైనస్. ఇంటర్వెల్, క్లైమాక్స్‌ల్లో రావురమేష్ నటన సూపర్. మహేష్ బాబు చివర్లో కంటతడి పెట్టేస్తాడు. పెద్ద కథరాసుకుని ఎంత తీయాలో తెలియకపోతే ఇదే సమస్య. రివాల్వర్‌ని గాల్లో పేల్చడం వల్ల ప్రయోజనం లేదు. ఏదో ఒక టార్గెట్‌కి గురిచూడాలి.
ఏడు తరాలు నవలలాగా హీరో తన పూర్వికుల్ని వెతుక్కుంటూ వెళ్ళడమే మంచిపాయింట్. ఇదే కథకి ఆధారమై ఆ మలుపులే సినిమాగా మారుంటే బావుండేది.
ఉదయాన్నే బోలెడంతమంది అభిమానులు ఆశతో వచ్చారు. మహేష్ కనపడగానే పేపర్ ముక్కలు విసిరేశారు. మొదటి పాటకి ఆనందంతో అరిచారు. ఆ తరువాత అర్థమైంది వాళ్ళకి…. జోక్స్ వేయసాగారు.
అందులో కొన్ని
– అయ్య బాబోయ్ మళ్ళీ పాటా!
– ఎంతసేపు మాట్లాడుకుంటార్రా బాబూ (మహేష్ కాజల్ సీన్‌లో)
– నువ్వు డైరీ రాయకురా బాబూ (సత్యరాజ్ నుద్దేశించి)
– ఉదయాన్నే ఆఫీస్‌కి సెలవు పెట్టె వచ్చాన్రా…
– ఎడిటింగ్ ఎవర్రా బాబూ
– డైరెక్టర్‌కి కౌన్సిలింగ్ ఇవ్వండ్రా
– ఎందుకురా ఊళ్ళన్నీ తిప్పుతున్నారు
– యువరానర్ ఈ ముద్దాయికి బ్రహ్మోత్సవం సినిమా చూపించాల్సిందిగా శిక్షవిధిస్తున్నా
– జి ఆర్. మహర్షి
Click on Image to Read: