భరించువాడు లేకపోతేనే... భారం దిగిపోతుందట!
భరించువాడు భర్త అని అంటారు కానీ అది శుద్ధ అబద్దమని మనకు చాలా సందర్భాలు నిరూపిస్తుంటాయి. ఇంట్లో మహిళ… తాను తినే తిండి, కట్టుకునే బట్టల విలువకు ఎన్నో రెట్లు విలువైన పనులు ఇంట్లో చేస్తుంది… కనుక భర్త, భార్యని ఆర్థికపరంగా భరిస్తున్నాడు అనలేము. ఇక ఆమె సంపాదనాపరురాలైతే అసలే అనలేము. గృహహింస విషయంలోనూ భర్తలే భార్యలను హింసిస్తారు కనుక…అక్కడా భరించేవాడు భర్త అనలేము. ఇవన్నీ కాకుండా భర్త కూడా…. నివసించే ఇంటిని ఇల్లులా, శుభ్రంగా మెయింటైన్ […]
భరించువాడు భర్త అని అంటారు కానీ అది శుద్ధ అబద్దమని మనకు చాలా సందర్భాలు నిరూపిస్తుంటాయి. ఇంట్లో మహిళ… తాను తినే తిండి, కట్టుకునే బట్టల విలువకు ఎన్నో రెట్లు విలువైన పనులు ఇంట్లో చేస్తుంది… కనుక భర్త, భార్యని ఆర్థికపరంగా భరిస్తున్నాడు అనలేము. ఇక ఆమె సంపాదనాపరురాలైతే అసలే అనలేము. గృహహింస విషయంలోనూ భర్తలే భార్యలను హింసిస్తారు కనుక…అక్కడా భరించేవాడు భర్త అనలేము. ఇవన్నీ కాకుండా భర్త కూడా…. నివసించే ఇంటిని ఇల్లులా, శుభ్రంగా మెయింటైన్ చేయడం, వంట, బట్టలు ఉతకడం, పిల్లల పెంపకం…ఇవి చాలవన్నట్టుగా ఆయనగారి వస్తువులను సర్ది, సమాయానికి అందించడం, అనారోగ్యం వస్తే సేవలు చేయటం….చాదస్తం ఉంటే మౌనంగా సహించడం……ఇవన్నీ ఇల్లాలి డ్యూటీలే కనుక ఇక్కడ కూడా ఆయనేమీ భరించడం లేదు. ఏదైతేనేం మొత్తానికి వైవాహిక జీవితంలో ఎక్కువగా భరిస్తున్నది భార్యే.
చెప్పుకోవడానికి విషాదమే అయినా…భర్త మరణం తరువాత కాస్త ఒళ్లుచేసే ఆడవారు ఉంటారు. దానికి మనవాళ్లు పలకడానికి వీలులేని ఒక నెగెటివ్ పేరుపెట్టినా (చాలా దుర్మార్గం)…అందులో ఉన్న వాస్తవం…వృద్ధాప్యంలోనో, అనారోగ్యంతోనో ఉన్న భర్తకు ఏళ్ల తరబడి సేవచేసిన ఆమెకు…అతని మరణంతో… గుండెలనిండా దుఃఖమే మిగిలినా…ఒక నిర్వేదంతోనో, వైరాగ్యంతోనో ఒత్తిడి తగ్గిపోతుంది. ఒక్కసారి మన పెద్దవాళ్లను గుర్తు చేసుకుంటే ఈ విషయం మనకు అనుభవంలోకి వస్తుంది. అయితే ఇదే విషయాన్ని ఇటలీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు. భర్త మరణం తరువాత భార్యలు ఒత్తిడిలేకుండా జీవిస్తున్నారని, అదే భార్యను పోగొట్టుకున్న భర్తలు మాత్రం తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని వారు చెబుతున్నారు.
అనారోగ్యం, వయోభారంతో ఉన్న భర్తకు సేవలు, ఇంటి పనిభారం భార్యని కుంగదీస్తాయి. ఆడవారికి వయసుమీదపడుతున్నా చాలావరకు ఏదో ఒక పని, బాధ్యత ఉంటాయి. అందుకే అతని మరణంతో ఆమె నిస్తేజానికి గురయినా, పని విషయంలో కాస్త వెసులుబాటు రావటంతో కాలక్రమంలో కోలుకుంటుంది. కానీ భార్యలను కోల్పోయిన భర్తలకు…జీవితం అక్కడితో ఆగిపోయినట్టుగా ఉంటుంది. కొన్ని వాస్తవాలను యధాతథంగా మాట్లాడుకుంటే…మనిషికి మనిషి తోడు చాలా అవసరం…కానీ అంతకంటే అత్యవసరం మూడుపూటలా ఆరోగ్యకరమైన ఆహారం, శుభ్రమైన పరిసరాలు, ఏదికావాలన్నా చేతికి అందిస్తూ సహాయం చేసే ఒక వ్యక్తి….ఇవన్నీ భర్తకు భార్యవలన సమకూరుతాయి. దాంతో భార్య మరణంతో జీవితం ముందుకు నడిచేందుకు కావాల్సిన కనీస వసతులే కష్టంగా మారతాయి. అందుకే భార్య పోగానే భర్తలో కుంగుబాటు ఉంటుంది. అందుకు కారణం…ఆమె పోవడమే కాదు…ఆయన జీవితం ఆగడం కూడా. ఇటలీలో వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ పురుషులను నాలుగున్నరేళ్లపాటు పరిశీలించి ఈ విషయాలను కనుగొన్నారట. నిత్యం మన కళ్లముందు కనబడే జీవితాలను చూస్తే అవగతమై పోతుందీ విషయం.
-వడ్లమూడి దుర్గాంబ
Click on Image to Read: