35 మందికి ఒక జత బాక్సింగ్ గ్లౌజులు.... ఒలింపిక్స్‌కి వెళతామంటున్నారు!
దాదాపు 100మందికి పైగా ఆడపిల్లలు… తమకు ఎలాంటి వనరులు, వసతులు లేకపోయినా ఆశతో ఆశయంతో బాక్సింగ్‌ని నేర్చుకుంటున్నారు. ఏదో ఒకరోజు ఒలింపిక్స్‌కి వెళతామంటున్నారు. ఆ 100 మంది అమ్మాయిల గురించి చెప్పాలంటే ముందు నర్మద (23) గురించి చెప్పుకోవాలి. ఆమె ఒకప్పటి రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్. తన స్నేహితులతో కలిసి నిరుపేద జాలరుల ఆడపిల్లలకు బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తోంది. చైన్నైలోని కన్నగి నగర్ ప్రాంతంలో సాయంత్రమైతే చాలు ఆడపిల్లలు బాక్సింగ్ దుస్తులలో అక్కడ ప్రత్యక్ష మవుతారు. అయితే […]
దాదాపు 100మందికి పైగా ఆడపిల్లలు… తమకు ఎలాంటి వనరులు, వసతులు లేకపోయినా ఆశతో ఆశయంతో బాక్సింగ్‌ని నేర్చుకుంటున్నారు. ఏదో ఒకరోజు ఒలింపిక్స్‌కి వెళతామంటున్నారు. ఆ 100 మంది అమ్మాయిల గురించి చెప్పాలంటే ముందు నర్మద (23) గురించి చెప్పుకోవాలి. ఆమె ఒకప్పటి రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్. తన స్నేహితులతో కలిసి నిరుపేద జాలరుల ఆడపిల్లలకు బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తోంది. చైన్నైలోని కన్నగి నగర్ ప్రాంతంలో సాయంత్రమైతే చాలు ఆడపిల్లలు బాక్సింగ్ దుస్తులలో అక్కడ ప్రత్యక్ష మవుతారు. అయితే 100కు పైగా పిల్లలకు కలిపి ఉన్నది మూడే జతల బాక్సింగ్ గ్లవుజులు. అంటే ప్రతి 35మందికి ఒక జత గ్లవుజులు ఉన్నట్టు లెక్క. అంతేకాదు, బాక్సింగ్ రింగ్ కానీ, పంచింగ్ బ్యాగులు కానీ వారికి లేవు.
పేదిళ్ల పిల్లలైన ఆ అమ్మాయిలు పోషకాహారం కూడా తీసుకోలేరు. వీరంతా అక్కడి జాలర్లు, రోజుకూలీల పిల్లలు. వీరికి శిక్షణనిస్తున్న నర్మద కూడా అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న అమ్మాయే. ఇన్ని ఆటంకాల నడుమ కూడా వారిలో స్ఫూర్తిని నింపుతూ శిక్షణ ఇస్తోంది నర్మద. ఈ పిల్లలు కన్నగి నగర్‌లో జరిగిన డివిజినల్ స్థాయి బాక్సింగ్ టోర్నమెంటులో పాల్గొన్నారు. మంచి ప్రదర్శన ఇచ్చారు.
కొన్ని నెలల శిక్షణతోనే వారు కాంచీపురం జిల్లాలో జరిగిన బాక్సింగ్ టోర్నమెంటులో పాల్గొని ఒక బంగారు, మూడు వెండి పతకాలు సాధించారు.
నర్మదతో పాటు ఆమె బాక్సింగ్ స్నేహితులు సైతం పిల్లలకు బాక్సింగ్‌లో శిక్షణ నిస్తున్నారు. పాథ్రమిక, ఉన్నత పాఠశాల చదువుల్లో ఉన్న ఆ పిల్లలకు వారి స్కూళ్ల నుండి ఎలాంటి సహాయం లభించడం లేదు. అయితే మేజిక్ బస్ అనే స్వచ్ఛంద సంస్థ మాత్రం తమకు అండగా ఉందని నర్మద తెలిపింది. నర్మద ప్రస్తుతం అందులో స్వచ్ఛందంగా పనిచేస్తోంది.
నర్మద 2007, 08ల్లో జాతీయ స్థాయిలో కాంస్య పతకాలు సాధించింది. 2008లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ బాక్సర్ అనే గుర్తింపుని పొందింది. 2006, 07, 08, 09ల్లో రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించింది. చెన్నై కార్పొరేషన్ నడుపుతున్న స్కూళ్లలో బాక్సింగ్‌తో పాటు కరాటే, జూడో లాంటి రక్షణకు సంబంధించిన ఆటలు, విద్యలు ఆడపిల్లలకోసం ప్రవేశ పెట్టడంతో నర్మదకు బాక్సింగ్ అంటే ఏమిటో తెలిసింది. ఆరవ తరగతి నుండి బాక్సింగ్ నేర్చుకున్న నర్మద మంచి విజయాలు చవిచూసింది.
తరువాత బిఎస్‌సి ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి మేజిక్ బస్ సంస్థలో చేరింది. ఈ స్వచ్ఛంద సంస్థ ఆటల ద్వారా పిల్లల్లో మంచి మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తోంది. నర్మద తనని తాను పోషించుకోవడానికి ఉదయం పూట ఒక జిమ్‌లో శిక్షకురాలిగా పనిచేస్తోంది. ప్రస్తుతం నర్మద తన పిల్లలకోసం ( ఆమె ఆ పిల్లలను అలాగే సంబోధిస్తుంది) కొన్ని జతల గ్లవుజులు, బాక్సింగ్ బ్యాగులు సంపాదించాలనే ధ్యేయంతో ఉంది. ప్రస్తుతం ఉన్న మూడు జతల గ్లవుజులు కూడా నర్మద, తన స్నేహితులు కలిసి కొన్నారు. ఒక్క గ్లవుజుల జత 2వేలు, ఒక్క బాక్సింగ్ బ్యాగు ధర 2,800 రూపాయలు. ఎవరైనా సహృదయంతో ముందుకు వచ్చి తమకు వీటిని అందిస్తారని నర్మద ఎదురుచూస్తోంది.
బాక్సింగ్, అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం నింపుతుందని, వారు ధైర్యంగా ముందుకు వెళ్లేలా చేస్తుందని, వారు గెలిచినప్పుడల్లా మరింత ఆత్మగౌరవాన్ని సంతరించుకుంటారని నర్మద చెబుతోంది. భవిష్యత్తులో తమ పిల్లలు అద్భుతాలు చేస్తారని ఈ యువతి నమ్ముతోంది. ఆమె నమ్మకం నిజం కావాలని, వారికి ఆర్థిక అండ దొరకాలని ఆశిద్దాం.