రజనీకాంత్ కటౌట్లు, పాలాభిషేకాలకు... కోర్టు… నో!
జులాయి సినిమాలో ఒక సందర్భంలో బ్రహ్మానందం, ఫ్యాన్స్‌కి ఎమోషన్సే తప్ప లాజిక్కులుండవు అంటాడు. ఈ డైలాగు విన్నపుడు మనకు, ఫ్యాన్స్‌కే కాదు, సినిమా నిర్మాతలకు, దర్శకులకు, నటులకు ఎవరికీ లాజిక్కులుండవు కదా…అనిపిస్తుంది. హీరో లాజిక్కులేకుండా ఒంటిచేత్తో వందమందిని కొడతాడు, ఫ్యాన్స్ వంద అడుగుల హీరో కటౌట్ పెట్టి దానిపై వేల లీటర్ల పాలు పోస్తారు. మరో పక్క పోషకాహార లోపంతో భారతదేశంలో ఎంతమంది చిన్నారులు మరణిస్తున్నారు…అనే గుండెలు ద్రవించిపోయే నిజాలు యునిసెఫ్ వెల్లడిస్తూ ఉంటుంది. ప్రపంచం ప్రాక్టికల్‌గా […]
జులాయి సినిమాలో ఒక సందర్భంలో బ్రహ్మానందం, ఫ్యాన్స్‌కి ఎమోషన్సే తప్ప లాజిక్కులుండవు అంటాడు. ఈ డైలాగు విన్నపుడు మనకు, ఫ్యాన్స్‌కే కాదు, సినిమా నిర్మాతలకు, దర్శకులకు, నటులకు ఎవరికీ లాజిక్కులుండవు కదా…అనిపిస్తుంది. హీరో లాజిక్కులేకుండా ఒంటిచేత్తో వందమందిని కొడతాడు, ఫ్యాన్స్ వంద అడుగుల హీరో కటౌట్ పెట్టి దానిపై వేల లీటర్ల పాలు పోస్తారు. మరో పక్క పోషకాహార లోపంతో భారతదేశంలో ఎంతమంది చిన్నారులు మరణిస్తున్నారు…అనే గుండెలు ద్రవించిపోయే నిజాలు యునిసెఫ్ వెల్లడిస్తూ ఉంటుంది. ప్రపంచం ప్రాక్టికల్‌గా లేదని మనమంతా ఎమోషనల్ ఫూల్స్‌లా ప్రవర్తిస్తున్నామని తెలిపే ఇలాంటి నిజాలు మనచుట్టూ ఎన్నో ఉంటాయి. అలాంటి ఓ నిజాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లాడు ఓ పెద్దమనిషి.
రజనీకాంత్‌కి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా, ఆయన పురస్కారం అందుకున్న రోజున సిటీలో పాలాభిషేకాలు జరగకుండా ఆదేశించాలని కోరుతూ ఐఎమ్ఎస్ మణివన్నన్ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థనని పరిశీలించిన కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ మధ్యంతర తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. రజనీకాంత్ కటౌట్లను, ఫ్లెక్సీ బ్యానర్లను పెట్టటం, వాటిపై పాలాభిషేకాలు చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.
రాష్ట్రంలో పిల్లలు పోషకాహారలోపంతో మరణిస్తుంటే అభిమానం పేరుతో వేలాది లీటర్ల పాలను వృథా చేస్తున్నారంటూ మణివన్నన్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. నిర్హేతుకమైన హీరో వర్షిప్‌కి పాలను వృథా చేస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంటున్న రజనీ కాంత్ ఈ విషయంమీద నోరు విప్పాలని, ఇకపై అలా జరగకుండా చూడాలని ఆయన కోరారు. అలాగే పాలను వృథా చేయకుండా అభిమానులు తాము తాగడమో, పిల్లలకు ఇవ్వడమో చేయాలని కూడా మణివన్నన్ ఆశించారు.
ఈ కేసులో కోర్టు రజనీకాంత్‌కి కూడా ఒక అత్యవసర నోటీసుని జారీ చేసింది. దీనిపై ఆయన స్పందనని తెలియజేయాలని కోర్టుకోరింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 11న జరుగుతుంది. పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 28న జరిగింది. అయితే రజనీకాంత్‌తో పాటు ప్రియాంకా చోప్రా, సానియా మీర్జా ఇంకా మరికొందరికి అవార్డులను అందించే కార్యక్రమం వచ్చే నెలలో జరగనుంది.