పాక్‌లో ఆత్మాహుతి దాడి...69మంది దుర్మరణం!
క్రికెటర్ల మీద ఆగ్రహమనే అనుమానకోణం! పాకిస్తాన్‌లో ఉగ్రవాదం మరోసారి తన పంజా విసిరింది. అభంశుభం తెలియని చిన్నారులతో సహా 69మందిని పొట్టనబెట్టుకుంది. పంజాబ్ ప్రావిన్సు రాజధాని లాహోర్‌లోని గుల్షాన్-ఇ-ఇక్బాల్ పార్కులో ఆదివారం సాయంత్రం 6.40 గం.లకు ఆత్మాహుతిదాడికి పాల్పడ్డ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆ ప్రాంతాన్ని మృత్యునిలయంగా మార్చాడు. మరణించిన 69మందిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. దాదాపు 300మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రుల వర్గాలు వెల్లడించాయి. […]
క్రికెటర్ల మీద ఆగ్రహమనే అనుమానకోణం!
పాకిస్తాన్‌లో ఉగ్రవాదం మరోసారి తన పంజా విసిరింది. అభంశుభం తెలియని చిన్నారులతో సహా 69మందిని పొట్టనబెట్టుకుంది. పంజాబ్ ప్రావిన్సు రాజధాని లాహోర్‌లోని గుల్షాన్-ఇ-ఇక్బాల్ పార్కులో ఆదివారం సాయంత్రం 6.40 గం.లకు ఆత్మాహుతిదాడికి పాల్పడ్డ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆ ప్రాంతాన్ని మృత్యునిలయంగా మార్చాడు. మరణించిన 69మందిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. దాదాపు 300మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రుల వర్గాలు వెల్లడించాయి. ఈస్టర్, ఆదివారం కలిసిరావడంతో క్రైస్తవులతో పాటు ఎక్కువ మంది జనం పార్కుకి రావడంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరిగిందని పోలీసులు తెలిపారు.
పార్కు ప్రధాన గేటువద్ద ఆత్మాహుతి దాడి సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడని లాహోర్ పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హైదర్ అష్రాఫ్ తెలిపారు. ఆ వ్యక్తిదిగా భావిస్తున్న తలను ఘటనా స్థలం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8నుండి 10 కిలోల పేలుడు పదార్థాలను దాడిలో ఉపయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. క్రైస్తవులే లక్ష్యంగా దాడి జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, చిన్నారులే లక్ష్యంగా దాడిచేసి ఉంటారని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఘటన జరిగిన ప్రాంతమంతా అత్యంత భీతావహంగా మారిపోయింది. ప్రమాదాన్ని చూసి చలించిపోయిన ప్రజలు అందుబాటులో ఉన్న ఆటోలు, రిక్షాల్లో గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించారు. నగరంలోని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రక్తదానం చేయాల్సిందిగా ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దాడి జరిగిన పార్కుకి ముఖ్యంగా చిన్నపిల్లల పార్కుగా పేరుంది. పార్కు విశాలంగా ఉండటంతో పాటు ద్వారాలు ఎక్కువ, భద్రత తక్కువగా ఉండటంతో దాడికి మరింత అవకాశం పెరిగిందని భావిస్తున్నారు. అయితే టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఓటమిని చవిచూసి పాక్ క్రికెటర్లు ఇంటిదారిపట్టిన రోజునే ఈ దాడి జరగటంతో దీనిపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. సరిగ్గా పాక్ జట్టు లాహోర్ విమానాశ్రాయంలో దిగి అక్కడినుండి వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఆత్మాహుతి దాడి చోటుచేసుకోవడంతో దీనిపై భిన్న అనుమానాలతో కూడిన కథనాలు వినబడుతున్నాయి. కాగా దాడికి పాల్పడింది తామేనని తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీలిక విభాగమైన జమాతుల్ అహ్రర్ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా పాక్‌లో తాలిబన్ తిరుగుబాట్లు, క్రిమినల్ ముఠాల ఘాతుకాలు, మతహింస చెలరేగిపోతున్నాయి.