ప్రాణాలతో ఉండటం హక్కు...భిక్ష కాదు!
మనది మంచి కుటుంబ వ్యవస్థే. కానీ అది పటిష్టంగా ఉంటే ఎంత మేలు జరుగుతుందో, బలహీనమైతే అంతగానూ నష్టం వాటిల్లుతోంది. కలిసిమెలసి ఉన్నపుడు ఎంతో అందంగా, ఆనందదాయకంగా కనిపించిన ఈ బంధం, కలహాలు మనస్పర్ధలు వచ్చినపుడు అంతే భయంకరంగా మారుతోంది. కలిసి ఉండలేని పరిస్థితి వచ్చినపుడు కూర్చుని పరిష్కరించుకునేంత పరిణతి, విశాలదృష్టి మనకు చాలా తక్కువ. వివాహ బంధం, లేదా ప్రేమ బంధాలు విచ్ఛిన్నమైనా జీవితం ఉంటుంది…అనే విషయం ఇంకా మనవాళ్లకు తెలియడం లేదు. ఎంత గొప్ప […]
మనది మంచి కుటుంబ వ్యవస్థే. కానీ అది పటిష్టంగా ఉంటే ఎంత మేలు జరుగుతుందో, బలహీనమైతే అంతగానూ నష్టం వాటిల్లుతోంది. కలిసిమెలసి ఉన్నపుడు ఎంతో అందంగా, ఆనందదాయకంగా కనిపించిన ఈ బంధం, కలహాలు మనస్పర్ధలు వచ్చినపుడు అంతే భయంకరంగా మారుతోంది. కలిసి ఉండలేని పరిస్థితి వచ్చినపుడు కూర్చుని పరిష్కరించుకునేంత పరిణతి, విశాలదృష్టి మనకు చాలా తక్కువ. వివాహ బంధం, లేదా ప్రేమ బంధాలు విచ్ఛిన్నమైనా జీవితం ఉంటుంది…అనే విషయం ఇంకా మనవాళ్లకు తెలియడం లేదు. ఎంత గొప్ప విషయాలైనా జీవితంలో ఒక భాగం అవుతాయి…కానీ, మొత్తం జీవితమే అవి అయిపోవనే విషయమూ అర్థం కావడం లేదు.
ఒక వ్యక్తితో పడనప్పుడు, ఒక వ్యక్తితో అనుబంధంలో పొరపొచ్చాలు వచ్చినపుడు అందులోంచి నిష్ర్కమించడం ఎలాగో మనవాళ్లకు అర్థం కావడం లేదు. ఈ సందర్భంలో ప్రేమ, పెళ్లి అనే బంధాలను జీవితం కంటే ఎక్కువైన బంధాలుగా చూడటం పొరబాటు. అవసరమైనపుడు, ఆ బంధాలు ప్రతిబంధకంగా మారినపుడు వాటిలోంచి మనకు, అవతలివారికీ కూడా నష్టం కలగకుండా బయటకు వెళ్లిపోవడం అనేది…నిజమైన మానసిక పరిణతి…నాగరికత అవుతుంది. అంతేకానీ దాంట్లోంచి బయటపడలేని గుంజాటనతో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడటం, ముక్కుపచ్చలారని చిన్నారులను హతమార్చడం…ఇవన్నీ మన సమాజం వెనుకబడి ఉన్నదనడానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
తిరుపతి, పల్లెవీధిలో నివసించే పద్మజ అనే మహిళ భర్తతో మనస్పర్థలు వచ్చి ఇద్దరు చిన్నారులను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. పద్మజపై ఆమె భర్తకు అనుమానం ఉందని, వారిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. కరీంనగర్‌కి చెందిన సౌమ్య అనే పిజి విద్యార్థిని కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు గతనెల 27న వివాహమైంది. నిరోష అనే యాంకర్ అన్యాయంగా ప్రాణాలు తీసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ అమ్మాయి విషయంలో కూడా కాబోయే భర్తతో వచ్చిన మనస్పర్థలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
ప్రాణాలు పోయే పరిస్థితి వైవాహిక బంధంలోకానీ, ప్రేమబంధంలో కానీ దాపురించినపుడు ఎలా ముందుకు వెళ్లాలి…అనే విషయంలో మన సమాజంలో ఇంకా స్పష్టత రావాలి. వైవాహిక బంధంలోంచి బయటకు వచ్చిన మహిళలకు మన దగ్గర సామాజిక భద్రత, గౌరవాలు అందకపోవడం ఇంకా ఉంది. అలాగే ముందు చెప్పుకోవలసింది… ఆర్థిక భద్రత. ఆధారపడే స్థితిలో ఉన్నప్పుడే ఏ మనిషైనా సవ్యంగా ఆలోచించలేడు. ఇతరులపై ఆధారపడుతున్నప్పుడు ఎమోషన్లను నిభాయించుకునే శక్తి ఉండదు. తమపట్ల తమకు జాలి ఉంటుంది. ఆత్మస్థయిర్యం, ఆత్మవిశ్వాసం ఇవేమీ ఉండవు. వీరు తమని తాము బాధితులుగా మాత్రమే చూసుకోగలగుతారు. ఇలాంటపుడే ఆత్మహత్యా ఆలోచనలు వస్తాయి.
అయితే సంపాదిస్తూ తమ కాళ్లమీద తాము నిలబడుతున్న మహిళలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు కారణం ఆత్మగౌరవ లోపం. ఆత్మగౌరవం అంటే ఏమిటో, దాన్ని ఎలా పొందాలో, ఎలా కాపాడుకోవాలో…తెలుసుకుని ఉంటే ఆత్మహత్యా ఆలోచనలు రావు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, మన పట్ల మనకు ప్రేమ ఇవన్నీ ఉన్నప్పుడు ఎంతపెద్ద సమస్య అయినా ప్రాణాలు తీసేంతదిగా కనిపించదు. ఇవన్నీ ఉన్నపుడు మనసు గాయపడకుండా బతకడం ఎలాగో కూడా అర్థమవుతుంది.
ఈ ప్రపంచంలో అందరికీ జీవించే హక్కుఅనేది ఒకటి ఉంటుంది. అది ఎవరో పెట్టిన భిక్షకాదు, అలాగే ఎవరూ దాన్ని మననుండి లాక్కోలేరు. మనకు మనంగా వదిలేస్తే తప్ప. ఆడవాళ్లు అభివృద్ధి చెందటం అంటే వందలచీరలు, తులాల కొద్దీ బంగారం, ఇంటినిండా వస్తువులు, ఉద్యోగం, జీతం…ఇవేమీ కాదు…అఫ్‌కోర్స్ ఇవీ అవసరమే…కానీ…తనని తాను గౌరవించుకోవడం, తనను తాను సంతోషంగా ఉంచుకోవడం…ఇవి…చాలా ముఖ్యం. తనకు కావాల్సినవి పొందడం, అక్కర్లేనివి వదిలేయడం, ముఖ్యంగా నో చెప్పాల్సిన పరిస్థితుల్లో గట్టిగా ఉండటం…ఇవీ మనిషి మానసిక స్వేచ్ఛతో బతుకుతున్నామనేందుకు నిదర్శనాలు. అంతేకానీ దేశంలో వాడుతున్న ఫోన్ల సంఖ్యని, నెటిజన్ల సంఖ్యని లెక్కలు వేసుకుని అభివృద్ధి సాధించేశామని చెప్పుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది.
పిల్లలు అందంగా తయారవడం, సెల్ఫీలు దిగి ఫేస్‌బుక్కుల్లో పెట్టటం, ఎవరన్నా లెక్కలేకుండా మాట్లాడటం…వీటిని చూస్తూ వారు ఆనందంగా, స్వేచ్ఛగా ఉంటున్నారు కదా…అనుకునే తల్లిదండ్రులు… పిల్లల మనసులను స్కాన్ చేసి చూస్తుండాలి. వారు రిలేషన్లను ఎలా చూస్తున్నారు, కొత్త రిలేషన్లలోకి వెళుతున్నారా, అవి సక్సెస్ కాకపోతే అంతే సులువుగా బయటకు వచ్చేయగలరా…ఇలాంటివి కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులు అంతలోతుగా వెళ్లడం ఇప్పటి పరిస్థితుల్లో తప్పదు, తప్పులేదు. ఆ విషయంలో బలహీనంగా ఉన్న పిల్లలకు అండగా నిలబడటమే ఇది. వారిని కించపరచడం కాదు. ఆత్మహత్యల వరకు వెళ్లేదాకా, పిల్లల మనసుల్లోని సంఘర్షణని తల్లిదండ్రులు గుర్తించడం లేదంటే…ఇక మన కుటుంబ వ్యవస్థ గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? కనీసం తాము ప్రాణాలతో ఉండటానికి తాము మాత్రమే బాధ్యులమనే అవగాహన కూడా లేనపుడు మహిళలు ముందుకు వెళుతున్నారని ఎలా అనగలం!!!
-వడ్లమూడి దుర్గాంబ