ప్రేమను నిరాకరించిందని...ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచాడు!
తన ప్రేమని అంగీకరించలేదనే కోపంతో ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, సదరు అమ్మాయి పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఎకౌంట్లు తెరిచాడు. వాటిలో అసభ్యకరమైన ఫొటోలు, విషయాలు పోస్ట్ చేస్తూ ఆమెని వేధించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఎన్. సాయి శంతన్ అనే ఈ టెక్ మోసగాడు ఆ అమ్మాయి పేరుమీద ఏకంగా 12 నకిలీ ప్రొఫైల్స్ సృష్టించాడు. వాటిలో ప్రొఫైల్ పిక్‌గా ఆ అమ్మాయి ఫొటోలు పోస్ట్ చేయడం, తరువాత ఆమె కాల్‌గర్ల్ అనే భ్రమ కలిగించేలా అసభ్యకరమైన […]
తన ప్రేమని అంగీకరించలేదనే కోపంతో ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, సదరు అమ్మాయి పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఎకౌంట్లు తెరిచాడు. వాటిలో అసభ్యకరమైన ఫొటోలు, విషయాలు పోస్ట్ చేస్తూ ఆమెని వేధించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఎన్. సాయి శంతన్ అనే ఈ టెక్ మోసగాడు ఆ అమ్మాయి పేరుమీద ఏకంగా 12 నకిలీ ప్రొఫైల్స్ సృష్టించాడు. వాటిలో ప్రొఫైల్ పిక్‌గా ఆ అమ్మాయి ఫొటోలు పోస్ట్ చేయడం, తరువాత ఆమె కాల్‌గర్ల్ అనే భ్రమ కలిగించేలా అసభ్యకరమైన ఫొటోలను, వీడియోలను, మ్యాటర్‌ని షేర్ చేయడం…ఇలా ఆమెకి తీవ్రమైన మనోవేదన కలిగించాడు. చివరికి ఆమె మొబైల్ నెంబర్‌ని కూడా ఫేస్‌బుక్ పేజీల్లో ఉంచాడు.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం సాయి శంతన్, బాధితురాలైన ఆ యువతి ఇంటర్‌మీడియట్ చదువుతున్నపుడు క్లాస్‌మేట్స్. చాలా మంచి స్నేహితులు కూడా. దాంతో ఆ సమయంలో ఆమెకి తెలియకుండా అతను అనేక ఫొటోలు, వీడియోలు తీశాడు. తరువాత ఆమెని ప్రేమిస్తున్నట్టుగా చెప్పాడు. ఆ అమ్మాయి తనకు కొంత సమయం కావాలని కోరింది. తరువాత ఇద్దరూ పై చదువులకోసం విడిపోయారు. అయితే గత ఏడాది సాయి శంతన్ మళ్లీ ఆమెను కలిసి తన ప్రేమ విషయం అడిగాడు.
ఆమె తనకు ఇష్టంలేదని చెప్పి, అతడిని దూరంగా పెట్టడం మొదలుపెట్టింది. ఆ కోపంతో అతను ఆమె పేరుమీద ఫేస్‌బుక్ ఎకౌంట్లు తెరిచాడు. ఆమె కుటుంబానికి అతనిపై అనుమానం వచ్చింది. కానీ అతను ఆ అమ్మాయి కుటుంబాన్ని కలుస్తూనే ఉన్నాడు. తనకేమీ తెలియనట్టుగా నటించేవాడు. అంతేకాదు, ఆ మోసగాడెవడో తాను తెలుసుకుంటానని కూడా వారితో చెప్పాడు. అదే సమయంలో ఆమె మనసు మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరుతూ, బెదిరిస్తూ మెసెజ్‌లు పంపేవాడు.
ఒక నెల క్రితం ఆ అమ్మాయి, సైబరాబాద్ పోలీసులకు ఫేస్‌బుక్ ఎకౌంట్ల మీద కంప్లయింట్ ఇచ్చింది. దాంతో ఆ ఎకౌంట్లన్నింటీనీ పోలీసులు డీయాక్టివేట్ చేయించారు. అయితే శంతన్ మరో మూడు ఎకౌంట్లు తెరిచి తిరిగి వేధించసాగాడు. మొదటి నుండి ఆ అమ్మాయి కుటుంబానికి అతనిమీద అనుమానం ఉండటం, అతను ఇంకా బెదిరింపు మెసేజ్‌లు చేస్తుండటంతో పోలీసులు ఆ వైపు నుండి విచారణ చేయగా శంతన్ మోసం బయటపడింది.
పోలీసులు అతని ల్యాప్‌టాప్‌ని, మొబైల్‌ని, పెన్‌డ్రైవ్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఫోన్, ల్యాప్ టాప్‌ల్లో డాటాని బట్టి అతను అనేక మంది అమ్మాయిలతో స్నేహం చేసి తరువాత ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా తేలింది. ప్రస్తుతం శంతన్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నాడు.