రాజ్ తరుణ్‌కిది కీలక తరుణం!
కొత్త హీరోలు రెండుమూడు హిట్‌లు ఇవ్వగానే సినీ పరిశ్రమ వారిని నెత్తిన పెట్టుకోవడం ఎప్పుడూ జరుగుతున్నదే. ఉదయకిరణ్ నుండి వరుణ్ సందేశ్ వరకు… ఈ వరుసలో మనకు చాలామంది కనబడతారు. అయినా కాలక్రమంలో అలాంటి వారు కనుమరుగయిపోతున్నారు. చిన్న సినిమాలు కొన్ని హిట్టయినా వాటి హీరోలు మాత్రం ఎదగలేకపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో రాజ్‌తరుణ్ మళ్లీ ఒక్కసారిగా ఓ కెరటంలా దూసుకువచ్చాడు. రాజ్ తరుణ్ నటనతో పాటు, భాషలోని యాస, పక్కింటి అబ్బాయి అనిపించే […]
కొత్త హీరోలు రెండుమూడు హిట్‌లు ఇవ్వగానే సినీ పరిశ్రమ వారిని నెత్తిన పెట్టుకోవడం ఎప్పుడూ జరుగుతున్నదే. ఉదయకిరణ్ నుండి వరుణ్ సందేశ్ వరకు… ఈ వరుసలో మనకు చాలామంది కనబడతారు. అయినా కాలక్రమంలో అలాంటి వారు కనుమరుగయిపోతున్నారు. చిన్న సినిమాలు కొన్ని హిట్టయినా వాటి హీరోలు మాత్రం ఎదగలేకపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో రాజ్‌తరుణ్ మళ్లీ ఒక్కసారిగా ఓ కెరటంలా దూసుకువచ్చాడు. రాజ్ తరుణ్ నటనతో పాటు, భాషలోని యాస, పక్కింటి అబ్బాయి అనిపించే రూపం… ఇవన్నీ అతనికి ప్లస్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు సీతమ్మ అందాలు…ఆడకపోవడంతో అతను తన స్పీడుకి తానే బ్రేక్ వేసుకుని ఆచితూచి అడుగువేయాల్సిన సమయం వచ్చేసింది.
ఈ లోపలే రాజ్ తరుణ్ కొత్త సినిమాలు అంటూ కొన్ని కాంబినేషన్లు ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు, వంశీ లాంటి ఉద్ధండుల ప్రాజెక్టుల్లో అతనికి అవకాశాలు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజ్ తరుణ్ జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణుతో కలిసి నటిస్తున్నాడు. కెరీర్ భయం అతనిలో ప్రవేశించినట్టే అనిపిస్తోంది. వంశీ దర్శకత్వంలో చేయాలనుకున్న ప్యాషన్ డిజైనర్, స్క్రిప్ట్ సరిగ్గా కుదరక పోవడంతో రాజ్ తరుణ్ పక్కనపెట్టినట్టుగా తెలుస్తోంది.
అతనిప్పుడు ప్రేక్షకులకు నచ్చిన నటుడు కాబట్టి ప్రముఖ దర్శక నిర్మాతలు, క్రేజీ ప్రాజెక్టులు వెతుక్కుంటూ రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ అతను స్వయం కృషితో పైకొచ్చిన నటుడు. అది అతనికి ప్లస్ పాయింటే, కానీ అదే మైనస్ కూడా. అందుకే ఇప్పుడు ఆచితూచి మంచి చిత్రాలను ఎంపిక చేసుకోలేకపోతే, మంచి హిట్లు ఇచ్చినా కెరీర్‌లో రాణించలేకపోయిన యువనటుల జాబితాలో చేరాల్సి వస్తుంది.
ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఇది వారసుల రంగం. దర్శకుల. నిర్మాతల, హీరోల పిల్లల సినిమాలు ఒకటి రెండు ఫ్లాఫయినా వారిని కమర్షియల్ హీరోగా నిలబెట్టే వరకు తండ్రులు కష్టపడతారు. రాజ్ తరుణ్ లాంటి యువ హీరోల విషయంలో అలాకాదు. అతనికి వెల్లువెత్తుతున్న అవకాశాలు వరుసగా ఒకటిరెండు ఫ్లాఫులు వస్తే కనిపించకుండా పోవచ్చు. అందుకే రాజ్ తరుణ్‌కిది నటజీవితంలో కీలక తరుణం. సినీ రంగానికి సంబంధం లేకుండా బయటనుండి వచ్చి కమర్షియల్ హీరోలుగా రాణించిన హీరోలు మనకు ఒకరిద్దరు తప్ప లేనే లేరు. కాబట్టి అతను తన రూటేమిటో పదికాలాలు ఇక్కడ పదిలంగా ఉండాలంటే ఎలాంటి పాత్రలు చేయాలో ఆలోచించాల్సిన తరుణం వచ్చేసింది.