సౌఖ్యం కరువైన ప్రేక్షకులు

రేటింగ్‌: 2/5 విడుదల తేదీ : 24 డిసెంబర్‌ 2015 దర్శకత్వం : ఎ.యస్‌. రవికుమార్‌ చౌదరి ప్రొడ్యూసర్‌ : ఆనంద్‌ ప్రసాద్‌ బ్యానర్‌:  భవ్యా క్రియేషన్స్‌ సంగీతం :  అనుప్‌ రూబెన్స్‌ నటీనటులు : బ్రహ్మానందం, పృధ్వీ, పోసాని, కృష్ణభగవాన్‌, జీవా, రఘుబావు దర్శకుడు రవికుమార్‌ చౌదరి చక్కటి చికెన్‌ బిరియాని వండి ప్రేక్షకులకు వడ్డించాలనుకున్నాడు. శ్రీధర్‌ సీపాన, కోనవెంకట్‌, గోపీ మోహన్‌లాంటి ఉద్ధండ వంటవాళ్ళను రప్పించాడు. వాళ్ళు తమ పాకశాస్త్ర ప్రావిణ్యాన్ని ఉపయోగించి మసాలా నూరారు. బాస్మతి బియ్యం […]

Advertisement
Update:2015-12-24 12:13 IST

రేటింగ్‌: 2/5
విడుదల తేదీ : 24 డిసెంబర్‌ 2015
దర్శకత్వం : ఎ.యస్‌. రవికుమార్‌ చౌదరి
ప్రొడ్యూసర్‌ : ఆనంద్‌ ప్రసాద్‌

బ్యానర్‌: భవ్యా క్రియేషన్స్‌
సంగీతం : అనుప్‌ రూబెన్స్‌
నటీనటులు : బ్రహ్మానందం, పృధ్వీ, పోసాని, కృష్ణభగవాన్‌, జీవా, రఘుబావు

దర్శకుడు రవికుమార్‌ చౌదరి చక్కటి చికెన్‌ బిరియాని వండి ప్రేక్షకులకు వడ్డించాలనుకున్నాడు. శ్రీధర్‌ సీపాన, కోనవెంకట్‌, గోపీ మోహన్‌లాంటి ఉద్ధండ వంటవాళ్ళను రప్పించాడు. వాళ్ళు తమ పాకశాస్త్ర ప్రావిణ్యాన్ని ఉపయోగించి మసాలా నూరారు. బాస్మతి బియ్యం తెప్పించారు. కావలసిన దినుసులన్నీ వేశారు. అంతా బ్రహ్మాండమని భుజం తట్టుకున్నారు. తీరాచూస్తే చికెన్‌ వేయడం మరిచిపోయారు. దాంతో అది కిచిడిలా తయారైంది. పోనీ అదైనా తిందామనుకుంటే దర్శకుడు దాన్ని ఉడికించకుండా పచ్చిపచ్చిగా వడ్డించాడు. టికెట్‌ కొన్న నేరానికి ప్రేక్షకుడు బలైపోయాడు. ఇది సౌఖ్యం సినిమా కథ. దీనికి ట్యాగ్‌లైన్‌ ఏంటంటే ‘అసౌకర్యానికి మన్నించండి’.

సినిమా ప్రారంభంలోనే చద్దివాసనకొట్టే సీన్‌. ఒకమ్మాయికి పెళ్ళవుతుంటే ఆ అమ్మాయిని హీరో తీసుకెళ్ళి ప్రేమించినవాడితో పెళ్ళి చేస్తాడు. దీనికో పిచ్చి బిల్డప్‌ సీన్‌. ఆ తరువాత హీరో తన గుణగణాల్ని వివరిస్తూ ఒకపాట. హీరో ఏం పనిచేస్తాడో ఆయనకి కూడా తెలియదు. అప్పుడో ప్లాష్‌ బ్యాక్‌. ఈ మధ్యలో ఒక చిన్న విలన్‌ని హీరో కొడతాడు. దాంతో పెద్ద విలన్‌కి కోపమొచ్చి (ప్రదీప్‌రావత్‌) హీరోని వెతుకుతూ ఉంటాడు. ఈలోగా హీరోయిన్‌ ట్రెయిన్‌ ఎపిసోడ్‌. పోసాని మురళీ కృష్ణ బూతుకామెడి. ప్రాసలు పంచ్‌ల గోల నడుస్తూ ఉండగా లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌. ఆ తరువాత వాళ్ళని కలిపే సిల్లీ సన్నివేశాలు. ఇద్దరి మధ్య లవ్‌. ఇంతలో హీరోయిన్‌ని ఎవరో ఎత్తుకెళతారు. ఇష్టంలేని పెళ్ళి తప్పించుకోవడానికి ఇంట్లోంచి పారిపోతే ఆమెని ఆమె తండ్రి వెతికిస్తూవుంటాడు. ఇదో గోల. ఆమె తండ్రి కలకత్తాలో పవర్‌ఫుల్‌. ఆతరువాత హీరో తండ్రికి యాక్సిడెంట్‌. ప్రదీప్‌రావత్‌ హీరో తండ్రిని కాపాడినట్టు నాటకం. హీరో కలకత్తాకి వెళ్ళడం. ఆమెని తీసుకురావడం. ఇది చేంతాడులాంటి కథ. పూర్తిగా చెబితే సమీక్ష చదివేవాళ్ళు జబ్బుపడతారు.

విషయం ఏంటంటే ఈ సినిమాకి తలాతోకా లేదు. అన్నిసినిమాలలాగానే మూడు ఫైట్లు, ఆరుపాటలు. పృధ్వి, కృష్ణభగవాన్‌, సప్తగిరి కృష్ణ భగవాన్‌ చివరన బ్రహ్మానందం అందరూవున్నా కథలో మనం కనెక్ట్‌కాలేం. ఎందుకంటే ఎవడిగోల వాడిదే. రెండుపాటలు బావున్నాయి. రెజినాకి నటించడానికేం లేదు. ఆమెలో చక్కటినటివున్నా ఇలాంటి పిచ్చిపాత్రలు లభించడం బ్యాడ్‌లక్‌.

బాహుబలికి పేరడికూడా ఈసినిమాలో చేసారు. గబ్బర్‌సింగ్‌లోలాగా విలన్లంతా పాటలు పాడతారు. ఏ ఒక్క క్యారెక్టర్‌కూడా ఆడియన్స్‌కి రిజిస్టర్‌ కాదు. ఎవరికి వాళ్ళు డైలాగులు అప్పజెప్పి వెళుతూ ఉంటారు. రాసుకున్నపుడు కథ బాగానే అనిపించివుంటుంది కానీ సీన్లలో ఎనర్జీలేదు. గోపిచంద్ కూడా ఎందుకో డల్‌గా ఉన్నాడు. బ్రహ్మానందం, పృధ్వీకామెడీ కూడా సినిమాని నిలబెట్టలేకపోయింది. దీనికి కారణం కథ ఎటువెళుతూ ఉందో దర్శకుడికి కూడా అంతుపట్టకపోవడమే.

అందుకే విలన్లు కాసేపు సీరియస్‌గా ఉంటారు. మరికాసేపు బఫూన్లలా వుంటారు. సెకండాఫ్‌లో హీరో తండ్రిని ఇంప్రెస్‌ చేయడానికి డ్రామానడుస్తుంది. అందులో పచ్చిబూతులు. దీనివల్ల నవ్వురాకపోగా కంపరం పుడుతుంది.

కోనవెంకట్‌, గోపిమోహన్‌ల మ్యాజిక్‌ అంతరించే దశలో ఉంది. ఎందుకంటే ఒకే కథని పదేపదే చెబితే ప్రేక్షకులు వినే మూడ్‌లో లేరు. కథ లేకుండా సన్నివేశాలను కూర్చుకుని ప్రాసలు వాడితే ప్రయోజనం లేదు. ఎంత గొప్ప సువాసనకలిగిన పువ్వులైనా మాలగా మారాలంటే దారం కావాలి. దీనికి సౌఖ్యం అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు. కానీ ఈ సినిమాలో లేనిది అదే.

– జి ఆర్‌. మహర్షి

Tags:    
Advertisement

Similar News