టాలీవుడ్ రివ్యూ-2015

బాహుబలి సినిమా వసూళ్ల వర్షం కురిపించిందని తెగ సంబరపడిపోతున్నాం. శ్రీమంతుడు సినిమా బంపర్ హిట్ అయిందని విజయోత్సవాలు చేసుకున్నాం. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనుకున్నాం. కానీ ఓవరాల్ గా టాలీవుడ్ పరిస్థితి ఏమాత్రం మారలేదు. గతేడాది…అంతకుముందు ఏడాది ఎలా ఉందో… ఈ ఏడాది కూడా టాలీవుడ్ అలానే ముగుస్తోంది. సక్సెస్ రేటు కాస్త పెరిగినప్పటికీ… ఓవరాల్ గా ఇండస్ట్రీ లాభపడిన దాఖలాలు కనిపించలేదు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 8 […]

Advertisement
Update:2015-12-23 05:04 IST
బాహుబలి సినిమా వసూళ్ల వర్షం కురిపించిందని తెగ సంబరపడిపోతున్నాం. శ్రీమంతుడు సినిమా బంపర్ హిట్ అయిందని విజయోత్సవాలు చేసుకున్నాం. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనుకున్నాం. కానీ ఓవరాల్ గా టాలీవుడ్ పరిస్థితి ఏమాత్రం మారలేదు. గతేడాది…అంతకుముందు ఏడాది ఎలా ఉందో… ఈ ఏడాది కూడా టాలీవుడ్ అలానే ముగుస్తోంది. సక్సెస్ రేటు కాస్త పెరిగినప్పటికీ… ఓవరాల్ గా ఇండస్ట్రీ లాభపడిన దాఖలాలు కనిపించలేదు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 8 సూపర్ హిట్స్ నమోదవ్వగా…. 9 సినిమాలు యావరేజ్ హిట్స్ గా నిలిచాయి. విడుదలైన దాదాపు 145 సినిమాల్లో ఈ 17 మాత్రమే మిగిలాయి. మిగతావన్నీ ఫ్లాపులే. ఈ ఏడాది టాలీవుడ్ లో సూపర్ హిట్స్…యావరేజులు… అట్టర్ ఫ్లాపులపై ఓ లుక్కేద్దాం.
బోణీకొట్టలేకపోయిన పవన్ – పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఏడాదిని గ్రాండ్ గా ప్రారంభిస్తాడని అంతా అనుకున్నారు. అప్పటికే వరుస విజయాలతో ఊపుమీదున్న పవర్ స్టార్…. గోపాల-గోపాల సినిమాతో 2015ను ఘనంగా స్టార్ట్‌ చేస్తాడని అంతా అనుకున్నారు. మరీ ముఖ్యంగా మల్టీస్టారర్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయ్. అలా భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య సంక్రాంతి కానుకగా జనవరి మాసంలో వచ్చిన గోపాల గోపాల యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. ఓ విధంగా చెప్పాలంటే…. 2015 సంక్రాంతి బోసిపోయింది. సంక్రాంతి పండగను జనవరి నెలాఖరుకు తీసుకొచ్చాడు కల్యాణ్ రామ్. అతడు నటించిన పటాస్ సినిమా మంచి విజయాన్నందుకుంది. కొత్త కుర్రాడు అనీల్ రావిపూడి…. ఈ ఏడాది బోణీ కొట్టాడు. అలా జనవరి నెలలో పటాస్ ఒక్కటే ఏకైక హిట్ గా నిలిచింది.

ఫిబ్రవరిలో ఏకంగా 2 సినిమాలు హిట్టవ్వడం విశేషం. వీటిలో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా అంచనాలతో వచ్చి హిట్ కొడితే…. శర్వానంద్ నటించిన మళ్లీ మళ్లీ ఇది రానిరోజు అనే చిన్న సినిమా ఊహించని విజయాన్నందుకుంది. ఈ నెలలో విడుదలైన మిగతా సినిమాలన్నీ అతీగతీ లేకుండా పోయాయి. ఇక మార్చిలో అంతా చిన్న హీరోల హవా నడిచింది. సూర్య వెర్సెస్ సూర్య నిఖిల్… తన మార్క్ హిట్ అందుకుంటే…. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో చాన్నాళ్ల తర్వాత నాని ఫర్వాలేదనిపించుకున్నాడు. అలాగే జిల్ సినిమాతో గోపీచంద్ కూడా ఓకే అనిపించుకున్నాడు. ఇదే నెలలో వచ్చిన జెండాపై కపిరాజు, రేయ్ సినిమాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

బాక్సాఫీస్ కు ఎంతో కీలకమైన ఏప్రిల్ బాక్సాఫీస్పై రెండు భారీ సినిమాలు కన్నేశాయి. వీటిలో ఒకటి హిట్. మరొకటి ఫట్. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్టవ్వగా…. నాగచైతన్య చేసిన దోచెయ్ సినిమా ఫ్లాప్ అయింది. ఏప్రిల్ మాసంలో ఈ 2 సినిమాల గురించి మాత్రమే ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. ఇక మే నెలలో… భారీ అంచనాలతో వచ్చిన లయన్ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టగా…. అప్పటికే ఫ్లాపులతో ఉన్న రామ్ మాత్రం పండగ చేస్కో మూవీతో నిజంగానే పండగ చేసుకున్నాడు. మే నెలలో పండగ చేస్కో తప్ప మరే సినిమా ప్రభావం చూపించలేకపోయింది. సుధీర్ బాబు చేసిన మోసగాళ్లకు మోసగాడు… వర్మ తీసిన 365 డేస్…మంచు లక్ష్మి నటించిన దొంగాట లాంటి సినిమాలన్నీ సోదిలో కలిసిపోయాయి.

మే తరహాలోనే జూన్ నెల బాక్సాఫీస్ కూడా నడిచింది. ప్రతి శుక్రవారం సగటున 3 సినిమాలు విడుదలైనప్పటికీ… చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటి కూడా లేదు. పూరి జగన్నాధ్-చార్మి కాంబినేషన్ లో వచ్చిన జ్యోతిలక్ష్మి మాత్రమే ఓ మోస్తరు విజయాన్నందుకుంది. జాదుగాడు, టైగర్, అసుర, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని లాంటి సినిమాలన్నీ అతీగతి లేకుండా పోయాయి. ఇక జులై నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఓ కొత్త ఊపు వచ్చింది. దాదాపు ఏడాదిన్నరగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బాహుబలి సినిమా 2015లో విడుదలవ్వడం చెప్పుకోదగ్గ విశేషం. జులై 10న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా… అదే స్థాయిలో విజయాన్నందుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 6వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ ఒక్క సినిమాతో… 2015 సంవత్సరం…. తెలుగు సినీచరిత్రలో నిలిచిపోతుంది. బాహుబలి ధాటికి జులై నెలలో పెద్దగా సినిమాలేవీ థియేటర్లలోకి రాలేదు. కానీ నెలాఖరుకు మాత్రం జేమ్స్ బాండ్ గా థియేటర్లలోకి వచ్చాడు అల్లరినరేష్. ఎప్పట్నుంచో విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న ఈ కామెడీ స్టార్… జేమ్స్ బాండ్ తో యావరేజ్ హిట్ అందుకున్నాడు.

ఇక ఆగస్ట్ మాసంలో…. చెప్పుకోదగ్గ సినిమాలు రెండే. వీటిలో మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ కాగా…. రవితేజ నటించిన కిక్-2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కిక్-2తో పాటు మిగతా సినిమాలేవీ ఆడలేదు. వాటి గురించి చెప్పుకోవడం కూడా అనవసరం. 2015 ప్రథమార్థం చాలా డల్ గా సాగింది. జూన్ వరకు సంచలన విజయాలేవీ లేవు. ఇక ఏడాదంతా అలానే ముగుస్తుందనుకున్న టైమ్ లో…. ద్వితీయార్థం బాగా మెరిసింది. బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు రెండూ హిట్టయి టాలీవుడ్ కు జోష్ తీసుకొచ్చాయి.

సెప్టెంబర్ నుంచి టాలీవుడ్ సక్సెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఢమాల్ అనడం ఈ నెల నుంచే ప్రారంభమైంది. ఈనెలలో మంచు విష్ణు చేసిన డైనమేట్, నితిన్ చేసిన కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమాలు ఫ్లాప్ అవ్వగా…. నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా విజయాన్నందుకుంది. ఇక సాయిధర్మతేజ-హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ యావరేజ్ హిట్ సాధించింది. టాలీవుడ్ ఊహించని బిగ్గెస్ట్ డిసాప్పాయింట్ మెంట్ అక్టోబర్ మాసంలో జరిగింది. ఈనెలలో విడుదలైన బ్రూస్ లీ సినిమా ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే నెలలో వచ్చిన శివం సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో ఫ్లాప్ అయ్యాయంటే… విడుదలైన మూడో రోజు నుంచి జనాలు ఆ పక్కకే వెళ్లడం మానేశారు. అయితే ఇంత స్లంప్ లో కూడా అక్టోబర్ లో విడుదలైన రుద్రమదేవి సినిమా మంచి వసూళ్లు సాధించింది. పెట్టిన పెట్టుబడికి, వచ్చిన వసూళ్లకు మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో ఇది సూపర్ హిట్ సినిమాల జాబితాలోకి చేరలేకపోయింది. అదే విధంగా అక్టోబర్ లో వచ్చిన కంచె సినిమా కూడా ఓ మోస్తరు విజయాన్నందుకుంది. సినిమా యావరేజ్ హిట్ అయినప్పటికీ… వరుణ్ తేజ కెరీర్ లో మొదటి హిట్ గా నిలిచింది.

అక్టోబర్ మాసంలానే నవంబర్ నెల కూడా నిరాశలతోనే నడిచింది. సంచలనాలు సృష్టిస్తాడనుకున్న అఖిల్… బొక్కబోర్లా పడ్డాడు. మెరుస్తుందనుకున్న చీకటి రాజ్యం…. డల్ లైటింగ్ లోనే నడిచింది. ఇక ఊహించని విజయం అందుకుంటుందని భావించిన సైజ్ జీరో… యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకోగా….. సుకుమార్ నిర్మాతగా మారి తీసిన కుమారి 21-ఎఫ్ కూడా ఓ మోస్తరు గానే ఆడింది. ఓవరాల్ గా నవంబర్ లో చీకటిరాజ్యం, సైజ్ జీరో, కుమారి 21-ఎప్ సినిమాలన్నీ ఓ మోస్తరుగా ఆడాయి. అఖిల్ మాత్రం ప్లాప్ అయింది. డిసెంబర్ లో ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో శంకరాభరణం, లోఫర్ ఫ్లాపులుగా నిలిస్తే…. రవితేజ దయ వల్ల బెంగాల్ టైగర్ ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది. ఇక సౌఖ్యం, భలే మంచిరోజు, మామ మంచు-అల్లుడు కంచు లాంటి సినిమాలు వీకెండ్ రిలీజ్ లిస్ట్ లో ఉన్నప్పటికీ… ఓవరాల్ గా 2015 టాలీవుడ్ జాతకాన్ని మార్చే సినిమాలైతే కాబోవు.

ఓవరాల్ గా చూసుకుంటే… తెలుగు చిత్రసీమలో ఈ ఏడాది విజయాల శాతం కాస్త పెరిగింది. బాహుబలి సినిమా పుణ్యమా అని టాలీవుడ్ రేంజ్ కూడా ఇంకాస్త పెరిగింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు మెరవడంతో విజయాల సంఖ్య… 2014తో పోలిస్తే కొంచెం పెరిగింది. సేమ్ టైం… భారీ అంచనాల మధ్య వచ్చిన బాలయ్య, రవితేజ, రామ్ చరణ్… ఈ ఏడాది ఫ్లాపులు తెచ్చుకున్నారు. డబ్బింగ్ చిత్రాల హవా కాస్త తగ్గడం ఈ ఏడాది చెప్పుకోదగ్గ విప్లవాత్మక మార్పుల్లో ఒకటి.

Tags:    
Advertisement

Similar News