కృష్ణాడెల్టాలో పంటలు వెయ్యాలా? వద్దా?
రబీ సాగుకు ప్రభుత్వం ఇప్పటివరకు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో కృష్ణాడెల్టా ఆయకట్టు రైతాంగం పరిస్థితి అయోమయంగా మారింది. కృష్ణాడెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఇందులో సాగుకు నోచుకున్న భూమి కేవలం 8 లక్షల ఎకరాలు మాత్రమేనని జలవనరుల శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డెల్టా ఆయకట్టులో సాగుచేసిన పంటలకు కూడా సక్రమంగా నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలు వేసిన పంటలు రక్షించుకోవడానికి విద్యుత్ మోటార్లు, ఎత్తిపోతల పథకాల ద్వారా భగీరధ ప్రయత్నం […]
రబీ సాగుకు ప్రభుత్వం ఇప్పటివరకు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో కృష్ణాడెల్టా ఆయకట్టు రైతాంగం పరిస్థితి అయోమయంగా మారింది. కృష్ణాడెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఇందులో సాగుకు నోచుకున్న భూమి కేవలం 8 లక్షల ఎకరాలు మాత్రమేనని జలవనరుల శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డెల్టా ఆయకట్టులో సాగుచేసిన పంటలకు కూడా సక్రమంగా నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలు వేసిన పంటలు రక్షించుకోవడానికి విద్యుత్ మోటార్లు, ఎత్తిపోతల పథకాల ద్వారా భగీరధ ప్రయత్నం చేస్తున్నారు. 70 శాతానికి పైగా వరి పంట పొట్టదశలో ఉంది.
నవంబర్ 10వ తేదీ నుంచి రబీ సీజన్ కు భూములను తయారు చేసుకోవాలంటే డెల్టా పరిధిలో ఒక విడత నీరు వదలాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్న కారణంగా డెల్టాలో ఖరీఫ్ లో సగం ఆయకట్టు కూడా సాగుకు నోచుకోక, సాగు చేసిన ప్రాంతాల్లో సరిపడా నీరివ్వక కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారంటే డెల్టాలో సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థంచేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీలో కనీస నీటిమట్టం 12 అడుగులు ఉండాల్సి ఉండగా, నేడు 10.7 అడుగులకు పడిపోయింది. దీంతో కెనాల్ కు నీటి విడుదల నిలిపివేశారు. వరి పొట్ట దశలో ఉన్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల చివరి ఆయకట్టుకు నీరు అవసరమని రైతాంగం రోడ్డెక్కుతోంది.
రబీ సీజన్ కు సంబంధించి డెల్టా ఆయకట్టులో వరి పంట సాగు చేయడం ఆనవాయితీ. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సాగు చేయలా వద్దా అనే అంశాలపై రైతుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అధికార గణం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.