శివమ్ సినిమా రివ్యూ
రేటింగ్: 2.25/5 కాలంతోపాటు తెలుగుసినిమా హీరోకూడా మారాడు. 1950 నుంచి 70 వరకూ హీరో ఆదర్శాలు మాట్లాడేవాడు. అవినీతిపై యుద్ధం ప్రకటించేవాడు. దేశభక్తి గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 70 నుంచి 80 వరకూ ప్రేమికుడుగా మారాడు. ఆ తరువాత డాన్ అవతారమెత్తాడు. అయినా ఎంతోకొంత క్యారెక్టరుండేది. 2000 తరువాత సమాజంలో చాలా విలువలు క్షీణించినట్టే హీరో కూడా దిగజారిపోయాడు. కొందరు దర్శకుల పుణ్యమా అని ఇడియట్, తిక్కలోడు, మెంటలోడు, పొకిరీగా మారిపోయాడు. ఈ హీరోకి ఎవరంటే కూడా […]
రేటింగ్: 2.25/5
కాలంతోపాటు తెలుగుసినిమా హీరోకూడా మారాడు. 1950 నుంచి 70 వరకూ హీరో ఆదర్శాలు మాట్లాడేవాడు. అవినీతిపై యుద్ధం ప్రకటించేవాడు. దేశభక్తి గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 70 నుంచి 80 వరకూ ప్రేమికుడుగా మారాడు. ఆ తరువాత డాన్ అవతారమెత్తాడు. అయినా ఎంతోకొంత క్యారెక్టరుండేది. 2000 తరువాత సమాజంలో చాలా విలువలు క్షీణించినట్టే హీరో కూడా దిగజారిపోయాడు. కొందరు దర్శకుల పుణ్యమా అని ఇడియట్, తిక్కలోడు, మెంటలోడు, పొకిరీగా మారిపోయాడు.
ఈ హీరోకి ఎవరంటే కూడా భయంలేదు. చట్టమంటే లెక్కలేదు. తాగుతాడు, ప్రేమించమని వెంటపడతాడు. మనుషులు గాల్లోకి లేచేలా తంతాడు. ఇదంతా ఏదో పుణ్యకార్యంకోసం చేస్తున్నట్టు చివర్లో బిల్డప్.
వినాయకచవితికి అచ్చులుపోసి విగ్రహాలు చేస్తారు. అదే పద్ధతిలో సినిమాలకి కూడా మూసలుంటాయి. ఆ మూసలోకి కొంత ముడిసరుకు వేసి సినిమాని బయటికి తీస్తేసరి. అలాంటి మూస సినిమానే శివమ్. ప్రేక్షకులపై ఇది అనేక యాంగిల్స్‌లో శివతాండవం ఆడుతుంది.
హీరో శివ (రామ్) అంటే మామూలోడు కాడు. ఎంతమందినైనా తన్ని ప్రేమికుల పెళ్ళి చేసేస్తూ ఉంటాడు. అలాంటి అరిగిపోయిన సీన్‌తో సినిమా మొదలవుతుంది. ఒక ఫైట్, హీరో క్వాలిటీస్‌ని వర్ణించే పాట. ఈ హీరో ఇంట్రడక్షన్ పాట ఫార్ములాని ఎవరు కనుక్కున్నారోకానీ వాళ్ళకి హ్యాట్సఫ్. ఎందుకంటే దీనికి ఆల్డర్నేటివ్‌ని గత పదేళ్ళుగా మన డైరెక్టర్లు కనుక్కోలేకపోతున్నారు.
ఫైట్ తరువాత ప్రేక్షకులకి కొంత గ్యాప్ ఇద్దామని హీరో రైలెక్కుతాడు. బహుశా ఎక్కడికో ఆయనికి కూడా తెలియదు. రైల్లో కృష్ణభగవాన్ అనే జ్యోతిష్యుడు తగిలి నీ జీవితం మారుతుంది అంటాడు. నిజంగానే మారుతుంది. హీరోయిన్ కనిపిస్తుంది.
కాలేజీలో వేయాల్సిన నాటకం కోసం ఎక్కడా చోటుదొరక్క రైల్వేలైన్ దగ్గర హీరోయిన్ రిహార్సల్స్ చేస్తూ ఐలవ్‌యూ అని చెబితే అది చూసి హీరో ముచ్చటపడి రైలు దూకేస్తాడు.
అయితే అంతకు ముందు బోజిరెడ్డి అనే ఫ్యాక్షనిస్ట్ కథలోకి చొరబడుతాడు. కాలికి చెప్పులు వేసి నడిచాడని ఒక కుర్రాన్ని నిప్పులపై నడిపించేంత క్రూరుడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. అందులో ఒక కొడుకుని హీరో చావబాదుతాడు. దాంతో బోజిరెడ్డి హీరోపై పగబడతాడు.
ఇక్కన్నుంచి ఒక్కడు లెవెల్‌లో కథ మలుపులు తిరిగి టాప్‌గేర్‌లో పడుతుందని ఆశిస్తే కాసేపు న్యూట్రల్, మరికాసేపు రివర్స్‌గేర్, ఉన్నట్టుండి జర్క్‌లిచ్చి కథ అక్కడక్కడే తిరుగుతూ గమ్యం లేకుండా సాగుతుంది.
బోజిరెడ్డి గోల నడుస్తూవుండగా కథలోకి ఇంకో విలన్ వస్తాడు. శివకోసం వెతుకుతూ ఉంటాడు. ఇంటర్వెల్‌వరకూ అదో సస్పెన్స్. నిజానికి ఇంటర్వెల్ తరువాత పదిహేను నిముసాల్లో సినిమా ముగించేయవచ్చు. అలా కుదరదు కాబట్టి పాటలు, అపార్థాలు, కామెడీ సన్నివేశాలు. ఇలా చికెన్ బిరియానిని వడ్డించడానికి ప్రయత్నించి అసలు చికెన్ వేయడమే మరిచిపోయారు.
ఈ సినిమాలో రామ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. అతి లేకుండా చాలా బాగా చేసాడు కూడా. రాశీఖన్నా గ్లామరస్‌గా ఉంది. నటించడానికి ఏమీ అవకాశంలేదు కాబట్టి ఐదారురకాల స్టాక్ ఎక్స్‌ప్రెషన్స్‌కే పరిమితమైంది. రసూల్ ఎల్లోర్ ఫోటోగ్రఫి చాలా బావుంది. మాటలు బావున్నాయి. కానీ సినిమా మిస్‌ఫైర్ కావడం వల్ల అవి పేలినా పేలినట్టు అనిపించవు. పాటల్లో పసలేదు.
కావాలసిన అన్ని దినుసులు ఉన్నా ఇది ఎక్కకపోవడానికి బోలెడు కారణాలున్నాయి. కథలో గందరగోళముంది. దీన్ని పూర్తిగా కామెడీగా తీయదలచుకుంటే బోజిరెడ్డిలాంటి సీరియస్ విలన్‌ని తీసుకురాకూడదు. అతను కింగ్‌లా బిల్డప్ ఇచ్చి జోకర్‌లా దిగజారిపోతాడు. ఇదో మైనస్. దెబ్బలుతిన్న అతని కొడుకు ఏమైపోతాడో దర్శకుడికే తెలియాలి. ఇదికాకుండా సినిమానిండా ప్లాష్‌బ్యాక్‌లే.
బోజిరెడ్డిమీద కథ ఓపెన్‌చేసి ఇంకో విలన్‌ని తెచ్చి వాడి గోలపై సగం సినిమా నడపడం మూర్ఖత్వం. కామెడీ కోసం బ్రహ్మానందం, సప్తగిరి, పోసాని ఇందర్ని తెచ్చి ఇరికించినా ప్రయోజనంలేకుండా పోయింది. హీరోని ఎలివేట్ చేయడానికి వీళ్ళందరిని వాడుకున్నారనుకున్నా హీరో పెద్ద పొడిచిందేమీ లేదు. ఒకటిరెండు పెళ్ళిళ్ళు చేయడం, విలన్లని ఫూల్స్ చేయడం తప్ప. ఇది గతంలో చాలామంది చేసారు.
ఇంతకూ పోసానికి కొడుకుపై తుపాకీతో కాల్చేంత కోపమెందుకో చెప్పకుండానే సినిమా అయిపోతుంది. ఇప్పుడు అందరు డైరెక్టర్లకి ఉన్న సమస్య ఏమిటంటే సెకండాఫ్. ఫస్టాప్ వరకూ ఏదో ఒక రకంగా కథని లాక్ చేస్తారు. ఆ తరువాత తాళం పోగొట్టుకుంటారు. పాయసం తయారు చేయడానికి పూనుకుని పంచదారకు బదులు ఉప్పువేసి కంపుచేస్తున్నారు.
రెండు గంటల యాభైనిముషాల నిడివితో ఉన్న ఈ సినిమా చివర్లో దూలతీరిపోద్ది అని టైటిల్‌పడి ముగుస్తుంది. దూల తీరింది ప్రేక్షకులకేనా?
– జిఆర్. మహర్షి