బరువు తగ్గాలా....అయితే మీ ఆహారాన్ని బ్యాక్టీరియా నిర్ణయిస్తుంది!
బరువు తగ్గదలచుకున్న వారికి ఏం ఆహారం తింటున్నాం… అనేది చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా బరువు తగ్గాలి అనుకోగానే పుల్కాలు, పళ్లు లాంటి తేలికపాటి ఆహారం తినడం, కొవ్వు, నూనె పదార్థాలకు దూరంగా ఉండటం లాంటి సాధారణ విధానాలను అందరూ ఒకేలా పాటిస్తుంటారు. అయితే ఒక తాజా పరిశోధనలో తేలిన అంశాలను బట్టి అలా అందరికీ ఒకే డైట్ విధానం వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఆధారంగా ఎవరికి వారికి ప్రత్యేకంగా […]
బరువు తగ్గదలచుకున్న వారికి ఏం ఆహారం తింటున్నాం… అనేది చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా బరువు తగ్గాలి అనుకోగానే పుల్కాలు, పళ్లు లాంటి తేలికపాటి ఆహారం తినడం, కొవ్వు, నూనె పదార్థాలకు దూరంగా ఉండటం లాంటి సాధారణ విధానాలను అందరూ ఒకేలా పాటిస్తుంటారు. అయితే ఒక తాజా పరిశోధనలో తేలిన అంశాలను బట్టి అలా అందరికీ ఒకే డైట్ విధానం వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది.
మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఆధారంగా ఎవరికి వారికి ప్రత్యేకంగా టైలర్‌మేడ్ ఆహారవిధానం ఉండాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన శరీరంలో దాదాపు రెండు కిలోల బరువున్న వందల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. పేగుల్లో ఉన్న బ్యాక్టీరియాలో మూడింటా రెండువంతులు ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ఇవి మన జీర్ణశక్తిమీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఏదైనా సందర్భంలో మన పొట్ట, చిన్నపేగులు కొన్ని రకాల ఆహారాలను జీర్ణం చేసుకోలేకపోతే ఇక్కడున్న బ్యాక్టీరియా చురుగ్గా పనిచేసి ఆ ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. శరీరానికి తగిన పోషకాలు అందేలా చూస్తుంది.
ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో జరిగిన ఒక పరిశోధనలో శాస్త్రవేత్తలు ఇదే చెబుతున్నారు. ప్రతి మనిషిలో ఈ బ్యాక్టీరియా వేరుగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలన్నా, కొన్ని రకాల అనారోగ్యాలను తగ్గించుకోవాలన్నా ఎవరికి సరిపోయే ఆహారం వారు తీసుకోవాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు. స్వీడన్‌లోని ఛాల్‌మర్స్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు మన పొట్టలోని బ్యాక్టీరియా మన మెటబాలిజంపై ప్రభావం చూపే విధానాలను మొదటిసారిగా కనుగొన్నారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిశోధనలు చాలావరకు మనిషి శరీరంలో ఉన్న భిన్న మిశ్రమాల బ్యాక్టీరియాకు, అతనికి వచ్చే అనారోగ్యాలకు ఉన్న అనుబంధాలను వెల్లడి చేస్తున్నాయి. టైప్ టు డయాబెటిస్, గుండె ధమనుల్లో వచ్చే వ్యాధి, ఒబేసిటీ ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు, డిప్రెషన్, క్యాన్సర్ ట్రీట్‌మెంట్లలో రోగులు స్పందించే విధానాలపై కూడా ఈ బ్యాక్టీరియా భిన్నత్వం ప్రభావం ఉంటుందట.
ప్రస్తుత పరిశోధనలో అధికబరువున్న వ్యక్తుల్లోని బ్యాక్టీరియా లక్షణాలను, వెయిట్ లాస్ కోసం వారు తీసుకున్న ఆహారంపై దాని ప్రభావాన్ని గమనించారు. బ్యాక్టీరియా భిన్నత్వం మరీ ఎక్కువగా లేని శరీరాల్లో అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే రసాయనాలు, రక్తంలో వాటి లక్షణాలు తక్కువగా ఉన్నట్టుగా తేలింది. అదే బ్యాక్టీరియా భిన్నత్వం ఎక్కువగా ఉన్న పేషంట్లలో ఇలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఈ రెండురకాల గ్రూపుల పేషంట్లు ఒకే రకమైన ఆహారానికి భిన్నంగా ప్రభావితం కావడం చూశారు.
దీని ఆధారంగా ఒబేసిటీకి గురయినవారిలో కార్డియోమెటబాలిక్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఎవరికి ఉందో కనుగొనే వీలు ఉంటుంది. అలాగే వారి ఆహారంలో సరైన మార్పుల ద్వారా బరువుని తగ్గించి, అనారోగ్యాలు రాకుండా నివారించే అవకాశం కూడా వైద్యులకు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.