మోడీ-షాల జైత్రయాత్ర

కాంగ్రెస్‌, ఇండియా కూటమి పార్టీలు, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలపై పై చేయి సాధించిన ద్వయం

Advertisement
Update:2025-02-22 08:20 IST

లోక్‌సభ ఎన్నికల్లో చార్‌ సౌ పార్‌ (400 సీట్లకు పైగా) నినాదంతో బరిలోకి దిగిన బీజేపీకి భారతీయ ఓటర్లు షాక్‌ ఇచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల మద్దతు లేకుండానే మెజారిటీ సాధించిన మోడీ హవాకు విపక్షాలు అడ్డుకట్టవేశాయి. 230 సీట్లతో టీడీపీ, జేడీయూ లాంటి ప్రాంతీయపార్టీల మద్దతు మోడీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కానీ ఏ ఎన్నికైనా సీరియస్‌గా తీసుకునే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, మోడీ-షా వ్యూహాలను ఇండియా కూటమి (ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ) అంచనా వేయలేకపోయింది. దీంతో హర్యానాతో మొదలుపెట్టిన బీజేపీ జైత్రయాత్ర... మహారాష్ట్ర, ఢిల్లీని తన ఖాతాలో వేసుకున్నది.

యూపీ, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హర్యానా, ఒడిషా, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, మణిపూర్‌, తాజాగా ఢిల్లీతో బీజేపీ సొంతంగా 15 రాష్ట్రాల్లో పాగా వేసింది. వీటిలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, గోవా, అసోం, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో నేరుగా తలపడింది. కానీ బీజేపీ మూడేసి సార్లు అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్‌ పార్టీకి ఐదు, పదేళ్లకు ఒకసారి అవకాశం వస్తే మళ్లీ దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఉండటం లేదు. పైగా కాంగ్రెస్‌ పార్టీకి దూరదృష్టి లేకపోవడం వల్ల ఆ పార్టీ తాను ఓడిపోవడమే కాకుండా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలను బలహీనపరిచి బీజేపీ అధికారంలోకి దోహదపడుతున్నది.

అందుకే మోడీ-షా ద్వయం ఏదైనా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌కు మూడు నాలుగు నెలల ముందే కసరత్తు చేస్తున్నది. లోపాలను సరిదిద్దుకుని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. దీనికితోడు ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణుల గ్రౌండ్‌ వర్క్‌ బీజేపీ గెలుపును ఈజీ చేస్తున్నది. అధికారంలో రావడంతోనే సరిపెట్టుకోవడం లేదు. పార్టీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా సీఎం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా సీఎం సీట్లో కూర్చోబెడున్నది. ప్రచారంలో ఉండే పేరు ఒకటి శాసనసభపక్ష సమావేశంలో ప్రాతిపాదిత పేరు మరొకటి ఉంటున్నది. రాజస్థాన్‌లో బలమైన నేత వసుంధరా రాజే పక్కపెట్టి భజన్‌ లాల్‌ శర్మను ముఖ్యమంత్రి చేసింది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ను కాదని ఆయనకంటే జూనియర్‌ మోహన్‌ యాదవ్‌ను సీఎం చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

ఇప్పుటివరకు 14 రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రి లేని లోటు ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ఎంపిక ద్వారా భర్తీ చేసింది. ఏబీవీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమెకు ఆర్‌ఎస్‌ఎస్‌ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పాలిత సీఎంలంతా కరుడుగట్టిన హిందుత్వ, ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవాళ్లే కావడం విశేషం. సంక్షేమ పథకాలతో దేశాభివృద్ధి కుంటుపడుతుందన్న మోడీనే ఢిల్లీలో ఆప్‌ను గద్దె దించడానికి ఆ పార్టీ కంటే ఎక్కువ హామీలు ఇచ్చిన విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీన్నిబట్టి బీజేపీ సీఎంల ఎంపికలోనే కాదు, ఆయా రాష్ట్రాల్లో గెలుపునకు అనుసరిస్తున్న ప్రణాళికలు చూస్తే గెలుపు కోసం ఆ పార్టీ ఏమైనా చేస్తుందని తెలుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ తగ్గినా కాంగ్రెస్‌, ఇండియా కూటమి పార్టీలను, చివరికి బీజేపీ భాగస్వామ్య పక్షాలపై మోడీ పై చేయి సాధించారు. ఇదీ మోడీ-షాల మార్క్‌ ఎన్నికల సమరం.

Tags:    
Advertisement

Similar News