రివ్యూ: శ్రీమంతుడు
రేటింగ్: 3.75/5 బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్, మహేష్‌బాబు ప్రొడక్షన్స్ తారాగణం: మహేష్, శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సంపత్ రాజ్, ముఖేష్ రిషి, హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, అలీ, వెన్నెల కిషోర్, సుకన్య, సితార, తులసి తదితరులు సంగీతం: దేవిశ్రీప్రసాద్ పోరాటాలు: ఎఎన్‌ఎల్ అరసు కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు ఛాయాగ్రహణం: మధి నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్ (సివిఎం) రచన, దర్శకత్వం: కొరటాల శివ విడుదల తేదీ: ఆగస్టు 7, 2015 […]
రేటింగ్: 3.75/5
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్, మహేష్‌బాబు ప్రొడక్షన్స్
తారాగణం: మహేష్, శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సంపత్ రాజ్, ముఖేష్ రిషి, హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, అలీ, వెన్నెల కిషోర్, సుకన్య, సితార, తులసి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
పోరాటాలు: ఎఎన్‌ఎల్ అరసు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: మధి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్ (సివిఎం)
రచన, దర్శకత్వం: కొరటాల శివ
విడుదల తేదీ: ఆగస్టు 7, 2015
కథ
మనకి అన్నీ ఇచ్చిన ఊరుకి తిరిగి ఏదైనా చెయ్యడం, సొంత ఊరుని దత్తత తీసుకుని అక్కడి అవసరాలన్నీ సమకూర్చడం అనే పాయింట్‌లో చాలా డెప్త్ వుంది. డెప్త్ వుంటే సరిపోదు. డెప్త్ వున్నా పాయింట్ ను వెండి తెరపై నవరసాల్ని సమన్వయం చేస్తూ సినిమా చూస్తున్నంత సేపు అభిమానుల్ని మెప్పించడం అనేది అసలైన గెలుపు . ఆ గెలుపు కొరటాల శివ సాధించాడనే చెప్పాలి.
దర్శకుడి పనితీరు..
దర్శకుడు కొరటాల శివ చేసిన ఫస్ట్ చిత్రం ‘మిర్చి’ కథ వినడానికి చాలా మామూలు కథలా వుంటుంది. కానీ అందులో అటు ఎమోషన్స్‌కి, ఇటు యాక్షన్‌కి ఆస్కారమున్న కథనంతో కాక పుట్టించాడు. అలాగే శ్రీమంతుడు లో ఊరి బాగు కోసం శత్రువుతో కలిసి ప్రేమగా వుండడానికి సిద్ధపడ్డ హీరో పాత్ర కంటే, ఊరిని దత్తత తీసుకుని, తనకున్న దాంట్లో కొంత ఊరికి తిరిగివ్వాలనే లక్షణాలున్న పాత్ర సాత్వికంగా తోస్తుంది. ఇక్కడ హీరోయిజం మిక్స్ చేయడం మరింత కష్టం. కానీ రైటర్‌గా తన టాలెంట్‌ని శివ చాలా బాగా చూపించాడు. దర్శకుడు స్వతహాగా రచయిత అయితే .. స్క్రీన్ ప్లే బలంతో .. ఎటువంటి పాయింట్ నైనా జనరంజకంగా ఎలా చెప్పొచ్చు అనేది శ్రీమంతుడు చిత్రంతో కొరటాల శివ మరోసారి నిరూపించాడు. ఔత్సాహిక దర్శకులకు శ్రీమంతుడు చిత్ర కథనం అనేది ఒక బుక్ లాంటింది మరి.
ముగ్గురు విలన్లని మూడు దశల్లో హీరో కలుసుకోవడం, ఆ తర్వాత ముగ్గురినీ ఒకే చోట కలవడం… ఇలా యాక్షన్ త్రెడ్‌ని అసలు కథతో పాటు కలిపి తెలివిగా కుట్టేశాడు. సైకిలేసుకుని తిరుగుతూ, కుటుంబాలు కలిసుండడం వల్ల వుండే మంచి గురించి బోధించే హీరో ఆ వెంటనే వెళ్లి వస్తాదుల్ని ఎత్తి కుదేసేయడం మామూలుగా అయితే సింక్ అవ్వదు. కానీ హీరో ఆటిట్యూడ్‌ని మొదట్లోనే బాగా రిజిష్టర్ చేసి, ఎప్పటికప్పుడు అతనిలోని సాఫ్ట్ మరియు హార్డ్ యాంగిల్స్‌ని స్పష్టంగా చూపిస్తూ ఆ బ్యాలెన్స్ పాటించాడు. రచయితగా శివ చాతుర్యం తెలిపే మరో కోణం.. జగపతిబాబు పాత్రకి రాసిన గతం. అది రైటర్‌గా మాస్టర్ స్ట్రోక్.
ఇక రచయితగా శివ తన సత్తాను సంభాషణల్లో చాటుకున్నాడు. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణ..ఊరి బాగు కోసం విలన్ల తో చేసే సంభాషణ లో రైటర్ గా తన మార్క్ ..తన టాలెంట్ ..తన అవుట్‌లుక్..తన మెచ్యూర్టీ ని డైరెక్టర్ కొరటాల శివ బలంగా చూపించాడు. ఊర్లో సైకిల్ మీద తిరుగుతూ కుటుంబాలు కలిసి వుండటం వలన వుండే ప్రయోజనం ఏమిటి వంటి సీన్స్ అభిమానుల్ని కట్టి పడేస్తున్నాయి.
ఆర్టిస్ట్ ల పనితీరు..
ఫ్లాలెస్ పర్‌ఫార్మెన్స్‌తో కథానాయకుడు కదం తొక్కుతుంటే కథాపరంగా వున్న లోటుపాట్లు కూడా కొన్నిసార్లు కనుమరుగు అయిపోతుంటాయి. ఇక సపోర్టింగ్ కాస్ట్ కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. ఎంత డబ్బున్నా కొడుకు మనసు గెలుచుకోలేని తండ్రిగా, అతడి నుంచి ఫోన్ కాల్ వస్తేనే మురిసిపోయే అపర శ్రీమంతుడిగా జగపతిబాబు నటన బాగుంది. శృతిహాసన్ కూడా కీలక సన్నివేశాల్లో తన వంతు చేయగలిగింది చేసింది. ఇక ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్, సంపత్ రాజ్, ముఖేష్ఋషి..ఇలా ప్రతి ఆర్టిస్ తమ ఉనికిని చాటేలా పాత్రలను మలచి ..దర్శకుడిగా తన ప్రతిభను ఘనంగా చాటుకున్నాడు కొరటాల శివ. దేవిశ్రీ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పడానికి సందేహాం అవసరం లేదు. అలాగే రామజోగయ్య శాస్త్రి సాహిత్యం (అన్ని పాటలు)బావుంది. సినిమాటోగ్రపి ..ముఖ్యంగా మహేష్ ను చాల అందంగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ మధి.
విశ్లేషణ..
ఏ సినిమా హండ్రెడ్ పర్సెంట్ అందరీకి నచ్చదు. శ్రీమంతుడు చిత్రం కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రం.. ఫుల్ కామెడి కోరుకునే అభిమానులకు నచ్చక పోవచ్చు. శ్రీమంతుడు స్టోరీ టేకాఫ్ కావడానికి కాస్త ఎక్కువ సమయమే అవసరమైంది. ముఖేషి ఋషి కి వార్నింగ్ ఇచ్చే దగ్గర నుంచి చిత్రం స్పీడ్ అందుకుంది. . ఊరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన హీరో… చివర్లో తండ్రి వెంట అలా ఉన్నపళంగా వెళ్లిపోవడం సబబు అనిపించలేదు. ఇది సగటు ప్రేక్షకుడు కూడా జీర్ణించుకోలేడు. తను లేని మరుక్షణం అక్కడేం జరుగుతుందనేది తెలిసిన కథానాయకుడు అలా కదిలి వెళ్లిపోకుండా కథని అక్కడే ఒక కొలిక్కి తీసుకు రావాల్సిందేమో.!! శ్రీమంతుడు చిత్రంలో అసలు లోపాలే లేవనడం అతిశయోక్తి ..అయితే లోపాల్ని ఎత్తి చూపించే అవకాశం దర్శకుడు ఇవ్వలేదు. మహేష్ బాబు లాంటి ఆర్టిస్ట్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే.. ఎటువంటి చిత్రమైనా అభిమానులకు ఎలా రీచ్ చేయోచ్చొ కొరటాల శివ అండ్ టీమ్ సగర్వంగా చాటినందుకు అభినందించకుండా ఉండలేం.
పంచ్ లైన్… మనసును గెలిచిన శ్రీమంతుడు