ఉమ్మడి రాజధానిలో 'పోలీసు' సమస్య!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఇపుడు శాంతిభద్రతల సమస్య చర్చనీయాంశమైంది. ఇటు తెలంగాణ, ఆటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలో సమాన హక్కులున్నాయని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ఒక పక్క రాజధానిలో మాకొక్కరికే శాంతిభద్రతల పరిరక్షణ అధికారం ఉందని తెలంగాణ పోలీస్ బాస్ అంటుంటే… మాకు కూడా సమాన హక్కు ఉంటుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రత అంశం తమ పరిధిలోకి వస్తుందని, కాని […]
Advertisement
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఇపుడు శాంతిభద్రతల సమస్య చర్చనీయాంశమైంది. ఇటు తెలంగాణ, ఆటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలో సమాన హక్కులున్నాయని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ఒక పక్క రాజధానిలో మాకొక్కరికే శాంతిభద్రతల పరిరక్షణ అధికారం ఉందని తెలంగాణ పోలీస్ బాస్ అంటుంటే… మాకు కూడా సమాన హక్కు ఉంటుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రత అంశం తమ పరిధిలోకి వస్తుందని, కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ రాష్ట్ర పోలీసులను పంపించి వేసి తన వ్యక్తిగత భద్రతకు, ఇంటి వద్ద భద్రతకు ఏపీ పోలీసులను నియమించుకోవడం తమను అనుమానించడమేనని, ఇది తమకు అవమానకరమని తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇలాగైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రముఖులకు, ఇతర నాయకులకు తాము కల్పిస్తున్న భద్రత మొత్తం ఉపసంహరించుకుంటామని ఆయన గవర్నర్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. అనురాగ్ శర్మతోపాటు ఆయన వెంట నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. రాజ్ భవన్ లో ఈ సమావేశం జరిగింది. ఓటుకు నోటు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
సరిగ్గా ఈనేపథ్యంలోనే ఈ సమస్యను మరింత జఠిలం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం కేబినెట్ మంత్రులతో సమావేశమైన తర్వాత మంత్రి అచ్చెనాయుడు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో తమకు భద్రత లేకుండా పోయిందని, ఇక్కడుంటున్న ఆంద్ర మంత్రులకు, ముఖ్యులకు తామే ఏపీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించారు. ఈ విషయాన్ని గవర్నర్‌తో చెప్పడానికి ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడును పంపుతుంది. మొత్తం మీద ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాల పోలీసులు ఉండడానికి కావలసిన వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇపుడు గవర్నర్ మీద ఉంటుంది. అంటే సెక్షన్ 8 అమలు ద్వారా గవర్నర్ నరసింహన్ తన విధులను అనివార్యంగా నిర్వహించాల్సిన పరిస్థితిని ఏపీ ప్రభుత్వం కల్పిస్తుందన్న మాట.!
Advertisement