ఇంటి పనికి విలువ కట్టం...కట్నం మాత్రం కాదనం!
మహిళల శ్రమని మనం వినియోగించుకోవటం లేదని, వారిని జాతీయ ఉత్పత్తిలో భాగం చేయాలనే మాట చాలాసార్లు వినబడుతూ ఉంటుంది. అయితే నిజంగానే జాతీయ ఉత్పత్తిలో వారి చేయి అసలు లేదా అనేది ప్రశ్న. వంట, ఇంటిశుభ్రం, పిల్లల పెంపకం, అతిధి మర్యాదలు, పెద్దవారికి సేవలు…ఇవన్నీ ప్రపంచంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక నిరంతర ప్రవాహంలా జరిగిపోతున్నాయి. వీటన్నింటికీ ధర కట్టి కొనుగోలు చేస్తే తప్పకుండా అన్నింటికీ మార్కెట్‌లో విలువ ఉంది. పైగా ఎంత ధరపెట్టినా తల్లి ఇచ్చినంత […]
మహిళల శ్రమని మనం వినియోగించుకోవటం లేదని, వారిని జాతీయ ఉత్పత్తిలో భాగం చేయాలనే మాట చాలాసార్లు వినబడుతూ ఉంటుంది. అయితే నిజంగానే జాతీయ ఉత్పత్తిలో వారి చేయి అసలు లేదా అనేది ప్రశ్న. వంట, ఇంటిశుభ్రం, పిల్లల పెంపకం, అతిధి మర్యాదలు, పెద్దవారికి సేవలు…ఇవన్నీ ప్రపంచంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక నిరంతర ప్రవాహంలా జరిగిపోతున్నాయి. వీటన్నింటికీ ధర కట్టి కొనుగోలు చేస్తే తప్పకుండా అన్నింటికీ మార్కెట్‌లో విలువ ఉంది. పైగా ఎంత ధరపెట్టినా తల్లి ఇచ్చినంత నాణ్యమైన సేవలు అందవు అనేది నూటికి నూరుపాళ్లూ నిజం. జాతీయ ఉత్పత్తిలో మహిళ పాత్ర తక్కువుందని చెప్పుకునే ముందు, అసలు ఆ ఉత్పత్తికి అనుకూలంగా ప్రపంచాన్ని నిర్వహిస్తున్నది ఎవరు అనే ప్రశ్న వేసుకోవాలి. ప్రపంచంలో ఆర్థికం కాని ఏకైక అంశంగా మహిళా శ్రమ ఇప్పటికీ మిగిలి ఉంది. మనదేశం లోనూ కోర్టులు ఇంటి పనికి విలువ కట్టి తీర్పు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఇళ్లలో పనులు చేసే ఆడవారికి లెక్కకట్టి డబ్బులు ఇచ్చేయమని కాదు, మనలాంటి దేశాల్లో అది సాధ్యంకాదు కూడా. ఇంటికోసం మహిళ చేసే కష్టానికి మనం చాలా అందమైన పేర్లు పెట్టుకున్నాం. దానికి కన్నతల్లి ప్రేమ, ఇల్లాలి బాధ్యత, అలా చేయగలిగిన స్త్రీయే నిజమైన దేవత లాంటి పేర్లు పెట్టుకున్నాం. వాటికి డబ్బు అనే మాటని జోడిస్తే చాలామందికి మహాపరాధంగా కనబడుతుంది కూడా. అయితే మరొక పక్క ఇంటికి భార్యగా…వారి మాటల్లో దేవతగా వచ్చే స్త్రీ నుండి కట్నం వసూలు చేయడానికి, ఆమె సంపాదనను సైతం స్వాహా చేయడానికి మాత్రం ఎలాంటి సిగ్గూ ఎగ్గూ ఉండవు. చాలా కన్వీనియంట్‌గా శతాబ్దాలుగా పైసా ఖర్చులేకుండా మనిషి నిత్య జీవన మనుగడకు సంబంధించిన పనులను నిర్విఘ్నంగా స్త్రీతో చేయిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన మదర్స్ డే సందర్భంగా అమెరికాలో కొంతమంది చిన్నారులు వారి తల్లులకు ఫేక్ చెక్కులను బహుమతిగా ఇచ్చారు. తల్లి శ్రమకు విలువ ఉందనే గుర్తింపుకి నిదర్శనంగా వారు ఆ పనిచేశారు. వర్జీనియాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి, తన పిల్లలు ఇచ్చిన చెక్కు ఒక జిమ్మిక్ అని తెలిసినా దాన్నిఆనందంగా తీసుకుంటున్నట్టుగా చెప్పారు. 77వేల డాలర్లు విలువ చేసే ఆ చెక్కు డబ్బుగా మారకపోయినా తన విలువ తనకు అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఆర్థికతమీదే నడుస్తున్నా పనిచేసిన వారికి ఫలితం దక్కాలి అనే సూత్రం మహిళకు మాత్రం వర్తించడం లేదు. మానవీయ విలువలు అత్యున్నత స్థాయిలో అమలవుతుంటే, తప్పకుండా తల్లి శ్రమని ప్రేమ ఖాతాలోనే వేయాలి. సమాజానికి తెలివైన పౌరులను అందించిన తల్లి చివరికి భర్త వదిలేసిన, ఏ ఆధారంలేని ఒంటరి మహిళగానో లేదా, ఏ అండా, ఆర్థిక భ్రదతా లేని అనాధగా వృద్ధాశ్రమంలోనో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడినపుడు మాత్రం…ఆమె జీవితాంతం పడిన కష్టం ఏమైంది అనే ప్రశ్న వేసుకోక తప్పదు. రిటైర్ అయ్యాక హాయిగా ఠీవీగా బతికే ప్రభుత్వ ఉద్యోగిలా ఆమె ఎందుకు బతకకూడదు….జీవితమంతా బద్దకంగా, పనీపాటా లేకుండా గడిపేసిన వృథా జీవిలా ఎందుకు బాధలు అనుభవించాలి….నిజానికి ఈ సమస్య పరిధి మరింత విశాలం….ఈ ప్రశ్నలన్నీ ప్రాథమికంగా మన కళ్లముందు కనబడుతున్న సమస్యలు…మదర్స్ డేలు చేయడం కాదు…వీటికి సమాధానాలు వెతకాలి.